చంద్రబాబును కలిసిన రామ్‌చరణ్

 

హుదూద్ తుఫాను బాధితుల సహాయార్థం సినీ కథానాయకుడు రామ్‌చరణ్ 15 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును అందించడానికి రామ్‌చరణ్ శుక్రవారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. చంద్రబాబుతో కొద్దిసేపు భేటీ అయిన అనంతరం రామ్ చరణ్ తన విరాళం చెక్కును చంద్రబాబుకు అందించారు. తుఫాను బాధితులకు పెద్ద మనసులతో విరాళాన్ని ప్రకటించిన రామ్ చరణ్‌ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అభినందించారు. ఇదిలా వుంటే, హుదూద్ తుఫాను బాధితులను ఆదుకోవడానికి పలువురు సినీ రంగ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. యువ కథానాయకుడు రామ్ చరణ్ అందరికంటే ముందు తన విరాళాన్ని ప్రకటించారు. ఆ తర్వాతే టాలీవుడ్‌లో విరాళాల ఊపు అందుకుంది. రామ్ చరణ్ తర్వాత యువ హీరోలందరూ చకచకా విరాళాలను ప్రకటించారు. తాము ప్రకటించిన విరాళాలను సీఎం సహాయ నిధికి అందించే విషయంలో కూడా యువ హీరోలలో రామ్ చరణ్ అందరికంటే ముందు వుండటం విశేషం.