ప్రియాంకని హీరో.. రాహుల్ ని జీరో చేస్తున్న కాంగ్రెస్ నేతలు
posted on Oct 26, 2015 11:23AM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీ శక్తి సామర్థ్యాలు ఏంటో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతలందరికీ తెలుసు కానీ.. ఏ ఒక్కరూ బయటకు చెప్పే సాయసం చేయరు సరికదా.. తన శక్తి సామర్థ్యాల గురించి సోనియమ్మ దగ్గర ప్రశ్నించే ధైర్యం చేయరు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఏదో చేసేస్తాడని భావించిన రాహుల్ గాంధీని హీరోని చేస్తూ తెగ పొగిడిన నాయకులకు.. ఆ ఎన్నికల్లో రాహుల్ ఘోర పరాజయం అవ్వడం వలన ఆ హీరోకి అంత సీన్ లేదని అర్ధమయింది. ఆ తరువాత విశ్రాంతి పేరిట కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ వచ్చిన రాహుల్ ఏమైందో ఏమో తెలియదు కాని కొన్ని రోజులు హడావుడి చేశారు. కానీ ఆ హడావుడి గురించి కొన్ని రోజులు చెప్పుకున్న దానివల్ల ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.
అయితే ఇప్పుడు పరిస్థితి చిన్నచిన్నగా మారుతుంది. ఉన్నట్టుండి కాంగ్రెస్ నేతలు ప్రియాంక గాంధీని సీన్ లోకి ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు.. అప్పట్లో ఇందిర తన రాజకీయ వారసురాలిగా ప్రియాంకగాంధీనేనని చెప్పేవారని ఆయన వెల్లడించారు. ఆయన అలా వ్యాఖ్యానించిన తరువాత ఇంకో నేత ఎం.ఎల్. ఫోతేదార్ కి కూడా ధైర్యం వచ్చిందో ఏమో తెలియదు కానీ ఆయన కంటే కాస్త ఘాటుగానే రాహుల్ గాంధీని విమర్శించారు. రాహుల్ కు పార్టీ పగ్గాలు ఇవ్వటానికి పార్టీలో చాలామంది ఒప్పుకోవటం లేదని.. పార్టీ అధ్యక్ష పదవి కాకుండా ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా రాహుల్ సరైన వ్యక్తికాదని వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రియాంక గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్క ప్రియాంక గాంధీని హీరోని చేసే క్రమంలో పాపం రాహుల్ గాంధీని జీరో ని చేస్తున్నారు పార్టీ నేతలు. మరి ఈ విషయంలో అమ్మ సోనియా గాంధీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.