మోడీ ముందు నవాజ్ తీసికట్టేనా?
posted on Sep 28, 2015 4:38PM
మోడీ రాజకీయ చతురత ముందు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ మాత్రం సరిపోడని ఇంతకు ముందు రష్యా పర్యటనలోనే తేలిపోయింది. పాకిస్తాన్ దేశంతో ఎప్పుడు చర్చలు ప్రారంభించాలో ఎప్పుడు నిలిపివేయాలో అన్నీ మోడీ అనుకొన్నట్లే జరిపించుకొన్నారు. మోడీ రష్యా పర్యటన సందర్భంగా స్వయంగా చొరవ తీసుకొని నవాజ్ షరీఫ్ తో సమావేశమవడమే అందుకు ఒక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చును. అదే నవాజ్ నవాజ్ షరీఫ్ మోడీతో సమావేశం కావాలని కోరుకొన్నా వీలుపడలేదు.
రష్యాలో వారి సమావేశం ముగిసిన తరువాత ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు ఒక ఉమ్మడి ప్రకటన చేసారు. అది కూడా అంతా మోడీ వ్రాసిచ్చిన స్క్ర్పిట్ ని పాకిస్తాన్ చదివినట్లే ఉంది తప్ప దానిలో పాక్ ప్రభావం ఎక్కడా కనబడలేదు. దానిలో ఇరుదేశాలు ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించాయి. వివిధ స్థాయిల్లో ఇరు దేశాల అధికారుల మధ్య డిల్లీలో సమావేశాలు నిర్వహించేందుకు అంగీకరించాయి. భారత్ పై దాడులు చేసి పాక్ లో తలదాచుకొంటున్న ఉగ్రవాదుల అప్పగింతపై పాక్ చేత మాట్లాడించగలిగారు. అలాగని పాకిస్తాన్ ఉగ్రవాదులను భారత్ కి అప్పగిస్తుందని కాదు. కానీభారత్ పై దాడులు చేసిన ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం, రక్షణ, ప్రోత్శాహం అందిస్తోందని పాక్ చేతే దృవీకరింపజేసినట్లయింది. ప్రతీ వేదికపై కాశ్మీర్ అంశం ప్రస్తావించే పాకిస్తాన్, ఇరుదేశాల విదేశీ కార్యదర్శులు చేసిన ఆ సంయుక్త ప్రకటనలో ఆ విషయం ప్రస్తావించడం మరిచిపోయింది. దానితో నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ తిరిగి వెళ్ళిన తరువాత అక్కడ మీడియా చేత చివాట్లు చీత్కారాలు ఎదుర్కోక తప్పలేదు.
అందుకే ఆ తరువాత ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశానికి కుంటిసాకులతో హాజరు కాకుండా తప్పించుకొంది. కానీ దాని వలన ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్నే అనుమానంగా చూసాయి. మళ్ళీ ఇప్పుడు అమెరికాలో కూడా అదే పరిస్థితి ఎదురయింది. మోడీ తన దేశానికి పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నిస్తుంటే నవాజ్ షరీఫ్ మాత్రం ఇంకా కాశ్మీర్ సమస్యనే పట్టుకొని వ్రేలాడుతున్నారు. మోడీ ముందు నవాజ్ షరీఫ్ తీసికట్టేనని పాకిస్తాన్ మీడియా చెప్పడమే అందుకు ఉదాహరణ.