వ్యాక్సిన్ పై పొలిటికల్ వార్! మోడీని టార్గెట్ చేసిన రాహుల్
posted on Apr 9, 2021 12:50PM
దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. అదే సమయంలో వ్యాక్సిన్ పై రాజకీయ దుమారం కూడా ముదురుతోంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న కొవిడ్ టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడంపై కొందరు ఆరోపణలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఉందని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లాయి. అయితే అదేమీ లేదని, కొందరు కావాలనే టీకాలపై రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
‘‘కరోనా కేసులు పెరుగుతున్న వేళ వ్యాక్సిన్ల కొరత అనేది చాలా తీవ్రమైన సమస్య. అంతేగానీ ఉత్సవం కాదు. దేశ ప్రజలను ప్రమాదంలో ఉంచి టీకాలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సరైందేనా? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పక్షపాతం చూపించకుండా అన్ని రాష్ట్రాలకు సత్వర సాయం అందించాలి. ఈ మహమ్మారిపై మనమంతా కలిసికట్టుగా పోరాడి కరోనాను ఓడించాలి’’ అని రాహుల్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ప్రజల భాగస్వామ్యం లేకుండా కరోనా మహమ్మారిపై విజయం సాధించలేమని, అందరూ కరోనా జాగ్రత్తలు పాటించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించిన ఆయన.. కొవిడ్ వ్యాక్సిన్, చికిత్సా కేంద్రాలను పరిశీలించారు. దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ సూచనల మేరకు అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని తెలిపారు. టీకా వేయించుకున్న వారు నిర్లక్ష్యం వహించవద్దన్న కిషన్‌రెడ్డి, టీకా ఉత్సవ్‌పై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని తెలిపారు. ఎక్కడా వ్యాక్సిన్ లోటు లేకుండా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. వ్యాక్సిన్ తరలింపులో లోపాలు లేకుండా చర్యలు తీసుకున్నామని, దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి.