అధికార విపక్షాలకు వక్ఫ్ పరీక్ష !
posted on Mar 31, 2025 12:50PM

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకున్నాయి. మరో నాలుగు రోజుల్లో అంటే ఏప్రిల్ 4 తో ఈ సమావేశాలు ముగుస్తాయి. అయితే,ఇంతవరకు జరిగిన కథ ఒకెత్తు అయితే ఈ చివరి నాలుగు రోజుల కథ మరొక ఎత్తు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవును ఇటు అధికార ఎన్డీఎ కూటమి, అటు విపక్ష ఇండియా కూటమి నాయకులు వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో పట్టు బిగిస్తున్నారు. ఇంతదాక ఒక లెక్క ఇక పై మరో లెక్క అంటున్నారు. ఒకరు గెలుస్తాం అంటుంటే మరొకరు అదే జరిగితే అల్లకల్లోలమే అని హెచ్చరిస్తున్నారు.
నిజానికి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభానికి ముందు నుంచీ వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు అంశం రాజకీయ వర్గాల్లో, రాజకీయ చర్చల్లో రగులుతూనే వుంది. ఎంఐఎం సహా అనేక ముస్లిం సంస్థలు, రాజకీయ పార్టీలు వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మరోవంక ఎన్డీఎ ప్రభుత్వం, తగ్గేదే లే అంటోంది. పద్దతిగా పనిచేసుకు పోతోంది. గతంలో విపక్షాల డిమాండ్ చేసిన విధంగా వక్ఫ్ సవరణ బిల్లు పై ఏర్పాటు చేసి జేపీసీ ఇచ్చిన నివేదికను సవరణలతోసహ కేంద్ర మంత్రి వర్గం ఫిబ్రవరిలో ఆమోదించింది. అప్పుడే బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశ పెట్టాలనే నిర్ణయం జరిగిపోయింది. మరో వంక ఇప్పుడు తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత షా, గత శుక్రవారం ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశ పెడుతుందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఇప్పడు దేశ రాజకీయ, మీడియాలో సవరణ బిల్లుకు ఎవరు అనుకూలం, ఎవరు వ్యతిరేకం అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనే విషయంలో రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య జనంలోనూ ఉత్కంఠ వ్యకమవుతోంది. ఆసక్తికర చర్చ జరుగుతోంది.
వక్ఫ్ బిల్లును ముస్లిం సమాజం వ్యతిరేకిస్తున్న నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ఆక్సిజన్ అందిస్తున్న తెలుగుదేశం, జనతాదళ్ యునైటెడ్ (జేడీయు), జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్),లోక్ జనశక్తి(ఎల్జీపీ) రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయి అనేది ఆసక్తి కరంగా మారింది. ముఖ్యంగా ఈ సంవత్సరం చివర్లో ఎన్నికలు జరగనున్న బీహార్ లో ముస్లిం సమాజం నుంచి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్ ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించడంద్వారా ప్రధాన ముస్లిం సంస్థలు జేడీయు పట్ల తమ అసంతృప్తి స్పష్టంగా వ్యక్తం చేశాయి. ఒక విధంగా చూస్తే ఇఫ్తార్ విందును బహిష్కరించడం ద్వారా ముస్లిం సంస్థలు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అటో ఇటో తెల్చుకోమని అల్టిమేటం ఇచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ముస్లిం సంస్థలతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపిం చట్ట సవరణకు ఒప్పించినట్లు జేడీయు వర్గాలు చెపుతున్నాయి. తాజాగా ఆదివారం (మార్చి 30) న రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంమక్షంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గతంలో చేసిన తప్పు మళ్ళీ చేయనని, ఎన్డీఎ, మోదీ చేయి’ వదలనని, చేతిలో చెయ్యేసి చెప్పినట్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి. అలాగే ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తామని గట్టి హామీ ఇచ్చారు. మిగిలిన ఎన్డీఎ భాగసామ్య పక్షాలు బిల్లుకు మద్దతు తెలిపే విషయంలో కొంచెం అటూ ఇటుగా ఉన్నా, బిల్లును వ్యతిరేకించక పోవచ్చునని అంటున్నారు. అయితే, అంత మాత్రం చేత ఎన్డీఎలో అంతా బాగుందని కాదు కానీ బిల్లు గట్టెక్కుతుందని బీజేపీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి.
మరో వంక ప్రతిపక్ష ఇండియా కూటమిలోని పార్టీలు కూడా అటూ ఇటూ తేల్చుకోలేకుండానే ఉన్నాయని అంటున్నారు. నిజానికి ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీలోనూ వక్ఫ్ బిల్లు విషయంలో ఏకాభిప్రాయం లేదని అంటున్నారు. అందుకే ఇండియా కూటమి పార్టీలు వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. అయినా ఇటు అధికార ఎన్డీఎ కూటమికి అటు విపక్ష ఇండియా కూటమికి వక్ఫ్ బిల్లు పే..ద్ద.. పరీక్ష.. అంటున్నారు.