రాష్ట్ర విభజనపై పుస్తకం వ్రాస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి
posted on May 10, 2015 9:08AM
కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం పెద్ద పొరపాటే అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నట్లు కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చేయి. ఆయన వలననే రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఏర్పడిందని పార్టీలో చాల మంది బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. వారి విమర్శలకు కిరణ్ కుమార్ రెడ్డి చాలా ధీటుగా త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారు.
ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుండి అదృశ్యమయిపోయిన ఆయన ఈ విరామ సమయంలో రాష్ట్ర విభజన గురించి 400 పేజీలతో కూడిన ఒక పుస్తకం వ్రాయడం మొదలుపెట్టారు. అందులో సోనియా, రాహుల్, కాంగ్రెస్ పెద్దలు, రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు, ప్రతిపక్ష నేతలు తెర వెనుక ఎవరెవరు ఎటువంటి పాత్ర పోషించారో, రాష్ట్ర విభజనకు ముందు పార్టీలో, ప్రభుత్వంలో ఎటువంటి పరిణామాలు సంభవించాయో వంటి వివరాలన్నిటినీ ఆధారాలతో సహా ఆయన తన పుస్తకం ద్వారా తెలియజేయబోతున్నారు. రాష్ట్ర విభజన చేయాలని నిర్ణయించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశ వివరాలను కూడా కూడా ఆయన తన పుస్తకంలో తెలియజేయబోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీలను ఈ వ్యవహారంలో ఎవరెవరు తప్పు దారి పట్టించారో, ఎందుకు పట్టించారో ఆయన తన పుస్తకంలో సవివరంగా వ్రాసినట్లు తెలుస్తోంది.
అదే విధంగా రాష్ట్ర విభజన వ్యవహారం మొదలయిన తరువాత పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన దిగ్విజయ్ సింగ్, జైరామ్ రమేష్, గులాం నబీ ఆజాద్, ఎకె. అంతోనీ, వీరప్ప మోయిలీ తదితరులతో జరిగిన తన సమావేశాల గురించి కూడా ఆయన తన పుస్తకంలో పేర్కొనట్లు సమాచారం. సమైక్య రాష్ట్రంలో తెరాస, తెదేపా, వైకాపా మరియు ఇతర పార్టీలు వాటి అధ్యక్షులు ఈ వ్యవహారంలో ఏ విధంగా వ్యవహరించారనే విషయాల గురించి కూడా కిరణ్ కుమార్ రెడ్డి తన పుస్తకంలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
తను పుస్తకం వ్రాస్తున్న విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు కొద్ది రోజుల క్రితం తెలియజేశారు. ఆ పుస్తకం మరొకటి రెండు నెలల్లో విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. ఈ పుస్తకం ఆయనే వ్రాస్తున్నారు కనుక అందులో తనను తాను సమర్దించుకొంటూ, తనని విమర్శించిన వారందరికీ చురకలు వేయవచ్చును.
ఇక ఆయనకి మళ్ళీ రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశ్యాలున్నట్లయితే, చేరితే ఏకైక ప్రత్యామ్నాయంగా కనబడుతున్న బీజేపీలోనే చేరవలసి ఉంటుంది గనుక ఈ వ్యవహారంలోఆ పార్టీపై ఎటువంటి ఘాటు విమర్శలు చేయక పోవచ్చును. ఆయన వ్రాసిన పుస్తకం విడుదలయితే అందరి కంటే ముందుగా రాష్ట్ర విభజన వ్యవహారంలో డబల్ గేమ్ ఆడిన ఆంధ్రా కాంగ్రెస్ నేతల బండారం బయటపడటం తధ్యం. రాష్ట్ర విభజన కారణంగా ప్రజాగ్రహానికి గురయి ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి నేటికీ ప్రజాధారణకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నవారి నెత్తిపై ఇది పిడుగులా పడబోతోంది. దానితో ప్రజలు వారిని మరింత అసహ్యించుకొనే అవకాశం ఉంది కనుక వారు కిరణ్ కుమార్ రెడ్డిపై ముందుగానే ఎదురు దాడి చేయవచ్చును. లేదా వారిలో ఎవరో ఒకరు ఈ వ్యవహారంలో కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలను, పార్టీ అధిష్టానాన్ని, చివరికి తమందరినీ కూడా మభ్యపెడుతూ ఏవిధంగా రాష్ట్ర విభజన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయించారో తెలియజేస్తూ పుస్తకం వ్రాసినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ వారిలో ఎవరయినా పుస్తకం వ్రాసి పుణ్యం కట్టుకొంటే, ఈ వ్యవహారంలో కాంగ్రెస్ నేతలందరి కధలు ప్రజలకి కూడా తెలుసుకొనే అవకాశం కలుగుతుంది.