చంద్రబాబు హామీతోనే పోటీపై పట్టు సడలించా: కంఠంనేని
posted on Apr 24, 2014 5:55PM
.jpg)
ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినవాడే నిజమైన నాయకుడు. అలాంటి వ్యక్తే కృష్ణాజిల్లా అవనిగడ్డకి చెందిన తెలుగుదేశం నాయకుడు కంఠంనేని రవిశంకర్. ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసి, స్థానికంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన కంఠంనేని రవిశంకర్‌కి ఈ ఎన్నికలలో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి టిక్కెట్ ఇస్తానని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే చివరి నిమిషంలో మండలి బుద్ధ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడంతో చంద్రబాబు కంఠంనేని రవిశంకర్‌ని కాదని బుద్ధ ప్రసాద్‌కి టిక్కెట్ ఇచ్చారు. దాంతో మనస్తాపం చెందిన రవిశంకర్ అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం రెబల్‌గా నామినేషన్ వేశారు.
కంఠంనేని రవిశంకర్ నామినేషన్ వేయడానికి వెళ్తున్నప్పుడు దాదాపు పదివేలమంది మద్దతుదారులు ఆయనవెంట నడిచారు. స్థానిక తెలుగుదేశం కార్యకర్తలందరూ మేమంతా కంఠంనేని వెంటే వుంటామని ముక్తకంఠంతో చెప్పారు. ఎలాంటి అధికారం లేకపోయినా తమకు ఎంతో సేవ చేసిన కంఠంనేనిని గెలిపించుకుంటామని స్థానిక ప్రజలు కూడా ఆయనకు బలమిచ్చారు. రాజకీయ వర్గాలు కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో కంఠంనేని రవిశంకర్ గెలుపు ఖాయమని నిర్ధారణకి వచ్చాయి. అవనిగడ్డ సీటు తెలుగుదేశం అకౌంట్‌లోంచి జారిపోయినట్టేనని తీర్మానించేశాయి. అందుకే కంఠంనేని నామినేషన్ వేసినప్పటి నుంచి సుజనాచౌదరి లాంటి అనేకమంది నాయకులు ఆయనన్ని పోట నుంచి విరమించుకోవాల్సిందిగా కోరారు. అయితే కంఠంనేని అందుకు నిరాకరించి ప్రచారంలో నిమగ్నమయ్యారు.
అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజున తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రవిశంకర్‌కి ఫోన్ చేసి పోటీనుంచి విరమించుకోవాలని కోరడంతో ఎప్పుడు తగ్గాలో కూడా తెలిసిన రవిశంకర్ తన నామినేషన్‌ని ఉపసంహరించుకుని మండలి బుద్ధ ప్రసాద్ గెలుపుకి మార్గం సుగమం చేశారు. తనవెంట వున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని చంద్రబాబు నుంచి, బుద్ధ ప్రసాద్ నుంచి స్పష్టమైన హామీ రావడంతో పోటీ నుంచి వెనక్కి తగ్గానని రవిశంకర్ చెప్పారు. ఇక అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి తనవంతు కృషి చేస్తానని ప్రకటించారు. నామినేషన్ ఉపసంహరించుకున్న కంఠంనేనికి మండలి బుద్ధ ప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
రవిశంకర్ వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను తన సొంత మనుషుల మాదిరిగా చూసుకుంటానని బుద్ధ ప్రసాద్ హామీ ఇచ్చారు. కంఠంనేని పోటీ నుంచి తప్పుకోవడంతో అవనిగడ్డ నుంచి తన విజయం ఖాయమైందని ఆయన సంతోషాన్ని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి కంఠంనేని రవిశంకర్ చేసిన సేవలను చంద్రబాబు నాయుడు గుర్తించారని, రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక కంఠంనేని రవిశంకర్‌కి ప్రాధాన్యం వున్న పదవి ఇవ్వడానికి చంద్రబాబు సుముఖంగా వున్నారని, ఈ విషయంలో తనవంతు సహకారాన్ని మనస్పూర్తిగా అందిస్తానని అన్నారు.