శోభానాగిరెడ్డి మృతి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక శైలి
posted on Apr 24, 2014 1:29PM

రాష్ట్ర రాజకీయాలలో ప్రత్యేక శైలి కలిగిన రాజనీతివేత్తగా శోభానాగిరెడ్డి నిలిచారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శోభా నాగిరెడ్డి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. యాక్సిడెంట్‌కి గురైన వెంటనే కోమాలోకి వెళ్ళిపోయిన ఆమె రక్తపోటు, పల్స్ నార్మల్‌గానే ఉన్నాయని మొదట వైద్యులు ప్రకటించినప్పుడు ఆమె కోలుకుంటారన్న ఆశ కలిగింది. అయితే అంతలోనే ఆమె కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించడం విషాదాన్ని కలిగించింది.
శోభానాగిరెడ్డి రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం. ఆమె తండ్రి ఎస్.వి.సుబ్బారెడ్డి కాకలు తీరిన రాజకీయవేత్త, రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేశారు. ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్న శోభ వివాహం 1986లో భూమా నాగిరెడ్డితో జరిగింది. శోభానాగిరెడ్డిగా మారిన శోభ గృహిణిగా తన కుటుంబాన్ని ఆదర్శవంతంగా నడిపారు. ఆమెకు ముగ్గురు పిల్లలున్నారు. ఇటీవలే కుమార్తె వివాహం జరిగింది.
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఎంతమాత్రం లేని ఆమె తన భర్త ప్రోత్సాహంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తన భర్త, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి నంద్యాల లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమె ఎ.పి.ఎస్.ఆర్.టి.సి. ఛైర్మన్‌గా రెండేళ్ళపాటు ప్రశంసనీయంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో ఇమడలేక చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికలలో రాయలసీమలో ప్రజారాజ్యం తరఫున ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా శోభా నాగిరెడ్డి నిలిచారు. ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి మారారు. ప్రస్తుత ఎన్నికలలో ఆళ్ళగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.
శోభా నాగిరెడ్డి ఏ పార్టీలో వున్నా అగ్రశ్రేణి నాయకురాలిగానే ఉన్నారు. చక్కని మాట తీరుతో, సంస్కారం ఉట్టిపడేలా మాట్లాడేవారు. రాష్ట్ర రాజకీయాలలో ఉజ్వలమైన భవిష్యత్తు వున్న శోభా నాగిరెడ్డి ఇలా ఆకస్మిక మరణం చెందటం ఆమె కుటుంబాన్ని, ఆమె నియోజకవర్గ ప్రజలను మాత్రమే కాకుండా ఆమె రాజకీయ ప్రత్యర్థులను కూడా షాక్‌కి గురి చేసింది.