జయలలితకు వంద కోట్ల విముక్తి... సీఎం ఛాన్స్

 
 

మూడు దశాబ్దాలకు పైగా తమిళ రాజకీయాల్లో తనదైన మార్క్‌ను కనబరిచిన ఉక్కు మహిళ జయలలిత. బంగపడ్డ చోటే తిరగబడ్డ ధీర వనితగా ఆమె అభిమానుల మన్ననలు పొందారు. రాజకీయాల్లోకి తెచ్చింది ఎంజీఆరే ఆయినా... తనదైన ముద్ర కనబరిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఆమెను చుట్టుముట్టిన వివాదాలు మరో ఎత్తు.

 

1948 ఫిబ్రవరి 24న మైసూర్‌లో జయలలిత జన్మించారు.  సొంతూరు తమిళనాడులోని శ్రీరంగం. బెంగళూరు, చెన్నైల్లో మెట్రిక్యులేషన్‌ వరకు చదువుకున్నారు. ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోవడంతో...  1963లో అంటే కేవలం 15 ఏళ్లకే ఆమె ఫిలిం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాల్సివచ్చింది.  సినిమాల్లో ఉన్నంతకాలం జయలలితకు గాడ్ ఫాదర్ ఎంజీఆర్.  1970ల్లో ఎంజీఆర్‌తో జయ లలితకు ఉన్న సంబంధాలు దెబ్బతిన్నాయి. 1981లో మళ్లీ ఎంజీఆర్ చెంతకే చేరారు. అదే ఏడాది  పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జయ... రెండేళ్లలోనే అన్నాడీఎంకే కార్యదర్శి స్థాయికి ఎదిగారు. 1984లో రాజ్యసభ ఎంపీగా  నామినేట్ అయ్యారు. అదే ఏడాది సీఎంగా ఉన్న ఎంజీఆర్‌కు గుండెజబ్బు వచ్చింది... అమెరికాలో ఆయన  ట్రీట్‌మెంట్ తీసుకుంటుండగా..తాను తాత్కాలికంగా గద్దెనెక్కేందుకు జయ ఉబలాటపడ్డారు. తనను ఆపద్ధర్మ సీఎం చేయాలంటూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకీ, గవర్నర్‌కూ లేఖలు రాశారు.  ఈ పరిణామం... ఎంజీఆర్‌కు కోపం తెప్పించింది. అమెరికాలో వైద్యంచేయంచుకుని తమిళనాడు వచ్చిన ఎంజీఆర్... జయలలితను పార్టీ నుంచి బహిష్కరించారు. 1987లో ఎంజీఆర్ మరణించాక అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టారు జయలలిత. 1989లో ప్రతిపక్షనాయకురాలి పాత్రపోషించారు.

 

1991లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకుని... తొలిసారిగా తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  అవినీతి ఆరోపణలు ... 1996లో అన్నాడీఎంకే కొంప ముంచాయి.  అవినీతి కేసులు ఉండటంతో... 2001లో జయలలిత పోటీ చేయలేకపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చాకమాత్రం ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. అయితే  జయ ఎన్నికను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. దీంతో  తను నమ్మినబంటు  పన్నీర్‌సెల్వమ్‌ను సీఎం  చేసి... పాలన మొత్తం తనే నడిపారు. 2003లో జయకు అవినీతి కేసులనుంచి విముక్తి లభించింది. దీంతో మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2006లో అధికారాన్ని కోల్పోయారు.

 

1989లో ప్రతిపక్ష నేతగా ఉన్న జయలలిత...  ఆర్థికమంత్రిగాకూడా ఉన్న సీఎం కరుణానిధి బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.   దీంతో ఆగ్రహం చెందిన డీఎంకే ఎమ్మెల్యేలు జయలలిత కొంగులాగారు.  చీర కొంత చిరిగిందికూడా. ఈ ఘటన ఆమెను కలచివేసింది. సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగుపెడతానని శపథం చేసి... సీఎం కలను 1991లో నెరవేర్చుకున్నారు. తర్వాత కరుణానిధిపై  అర్థరాత్రి దాడులు చేయించి... గుడ్డలూడేలా కొట్టించారు.

 

1995లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత తన పెంపుడు కొడుకు సుధాకరన్ వివాహాన్ని అట్టహాసంగా జరిపి..వివాదంలో చిక్కుకున్నారు. ఇందుకోసం రెండు వందలకోట్లకుపైగా ఖర్చుచేశారని సమాచారం.  తర్వాత అధికారంలోకి వచ్చిన కరుణానిధి జయలలితపై అక్రమ ఆస్తులకేసు నమోదుచేశారు. 1996లో ఆమె కొన్నాళ్లు జైలులో గడపాల్సివచ్చింది. జయ ఇంట్లో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు భారీ ఎత్తున బంగారు, వజ్రాభరణాలు,వేల సంఖ్యలో చెప్పులు, రిస్ట్ వాచ్‌లు స్వాధీనం చేసుకున్నారు. జైలు నుంచి విడుదలైన జయలలిత... తన జీవితంలో ఆభరణాలు, వాచ్‌లు ధరించనని 1996లో శపథం చేశారు. ఇప్పటికీ దీన్ని పాటిస్తున్నారు.

 

2014 సెప్టెంబర్ 27న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయలలితకు నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. వంద కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని ఆదేశించింది. ఆమెతో పాటు మరో ముగ్గురు నిందితులకు కూడా నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ పది కోట్ల రూపాయలు జరిమానా విధించింది. శిక్ష పడటంతో జయలలిత ముఖ్యమంత్రి పదవి కోల్పోవాల్సి వచ్చింది. దాంతో తను నమ్మినబంటు పన్నీర్‌సెల్వమ్‌ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు.

 

తాజాగా ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో  తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఊరట లభించింది. జయలలితను కర్నాటక హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆమెపై ఉన్న కేసులు రద్దు చేస్తున్నట్లు  కోర్టు తీర్పునిచ్చింది. నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా నుంచి జయలలితకు విముక్తి లభించడంతో.....అన్నాడీఎంకే కార్యకర్తలు ఆనందోత్సహాల్లో తేలుతున్నారు. కర్నాటక కోర్టు తీర్పు ఆశ్చర్యానికి, షాక్‌కు గురిచేసిందంటున్న పిటిషనర్ సుబ్రమణ్యస్వామి....ఈ తీర్పుపై మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. దీంతో జయలలిత మళ్లీ తమిళనాడు సీఎంగా పగ్గాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయింది.