జీవితానికి ఆలస్యం ఉంటుందా?

 

దేవుడు అన్నిరకాల మనుషులన్నీ సృష్టించీ సృష్టించీ అలసిపోయాడు. వాళ్ల బాధలు, కన్నీళ్లు, కష్టాలు చూసి చలించిపోయాడు. ‘ఇలా కాదు! నేను ఈసారి భూమి మీదే ఓ స్వర్గంలాంటి ప్రదేశాన్ని సృష్టిస్తాను. దాని చుట్టూ కేవలం కొండలను మాత్రమే అడ్డుగా ఉంచుతాను. ఆ కొండలని దాటి ఎవరైతే ఇవతలికి వస్తారో, వాళ్లు ఓ అద్భుతమైన ప్రపంచాన్ని చూస్తారు’ అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అందమైన పూలు, ఆకాశాన్నంటే చెట్లూ, ముద్దొచ్చే జంతువులు, మనసు దోచుకునే సెలయేళ్లు…ఇలా ఓ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించాడు. దానికి అడ్డుగా కేవలం కొన్ని కొండలను మాత్రమే ఉంచాడు.


ఏళ్లు గడిచిపోయాయి. కానీ ఎవ్వరూ ఆ కొండలను దాటి ఆ స్వర్గంలోకి అడుగుపెట్టలేదు. ఇంతాచేసి ఆ కొండల పక్కన ఉన్న మైదానంలోనే ఓ పల్లెటూరు ఉంది. ‘లాభం లేదు! ఓసారి నేనే వెళ్లి విషయాన్ని కనుక్కుంటాను’ అనుకున్నాడు భగవంతుడు. అనుకున్నదే తడవుగా ఓ యాత్రికుని రూపంలో ఆ పల్లెటూరికి చేరుకున్నాడు. నలుగురూ చేరి ఉన్న రచ్చబండ దగ్గరకి వెళ్లి… ‘అరే! మీరు ఎప్పుడూ ఆ కొండలను దాటి అవతలికి వెళ్లలేదా. పదండి మీకు ఆ అందమైన స్వర్గాన్ని చూపిస్తాను’ అని ప్రోత్సహించాడు.


‘అబ్బే లాభం లేదు. ఇప్పటికే కాలం గడిచిపోయింది. మేం ముసలివాళ్లం అయిపోయాం. ఇప్పుడు అక్కడికి పోయి ఏంటి ఉపయోగం!’ అని పెదవి విరిచారు ఊరి జనం. ‘సరే అవతలికి వెళ్లేందుకు ఆసక్తి లేకపోతే ఓ పని చేద్దాం. కొండల పైకి ఎక్కుదాం. కనీసం అవతలి వైపు ఉన్న స్వర్గాన్ని చూసైనా సంతోషించవచ్చు కదా!’ అని బయల్దేరదీశాడు యాత్రికుడు. ‘అబ్బే ఇప్పటికే కాలం గడిచిపోయింది. ఆ కొండలని ఎక్కే ఓపిక మాలో మిగల్లేదు’ అని ఉసూరుమన్నారు పెద్దలు. ‘అయితే సరే! కనీసం ఆ కొండల వంక చూస్తూ ఉండండి. మీకు అవతలి వైపు ఉన్న స్వర్గం ఎలా ఉంటుందో నేను వర్ణిస్తే విని సంతోషిద్దురుగాని’ అని ఊరించాడు యాత్రికుడు. ‘వద్దు వద్దు! ఇప్పటికే కాలం గడిచిపోయింది. నువ్వేం చెప్పినా అర్థం చేసుకునే తెలివి మాలో మిగల్లేదు’ అనేశారు ఊరి జనం.


ఇక యాత్రికుని రూపంలో ఉన్న భగవంతునికి ఏం చేయాలో అర్థం కాలేదు ‘సరే ఆ స్వర్గం సంగతి వదిలేయండి. ఇక్కడి వాతావరణం చూడండి, ఎంత అద్భుతంగా ఉందో! హాయిగా పాటలు పాడుకుంటూ కాసేపు కాలాన్ని గడుపుదాము’ అన్నాడు. ‘అబ్బే సూర్యుడు అస్తమిస్తున్నాడు. కాలం గడిచిపోయింది. మేం పోయి పడుకోవాలి’ అంటూ తమ ఇళ్ల వైపుకి బయల్దేరారు పెద్దలు. ‘జీవితంలోని ప్రతి రోజూ ఓ కొత్త అవకాశమేనని వీళ్లకి ఎప్పుడు అర్థమవుతుందో. గడిచిపోయిన కాలం గురించి తల్చుకుంటూ, ముందున్న జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు ఈ పిచ్చివాళ్లు. కొత్త లక్ష్యాన్ని చేరుకోవడానికైనా, చూడటానికైనా, దాని గురించి ఆలోచించడానికైనా వీళ్లకి ధైర్యం లేదు కదా! కనీసం చేతిలో ఉన్న క్షణాలని అనుభవించే తెలివీ లేదు!’ అంటూ నిరాశగా వెనుతిరిగాడు భగవంతుడు.