భారత్-పాక్ సంబంధాలు ఎందుకు మెరుగుపడటం లేదు?
posted on Nov 29, 2015 8:53PM
భారత్ ఎప్పుడూ ఇరుగుపొరుగు దేశాలన్నిటితో శాంతి, బలమయిన స్నేహ సంబందాలే కోరుకొంది తప్ప ఏనాడూ కయ్యానికి కాలు దువ్వాలని ప్రయత్నించలేదు. కానీ గత ఆరు దశాబ్దాలుగా భారత్ ఎంతగా ప్రయత్నించినా పాకిస్తాన్ తో మాత్రం సఖ్యత కుదరడం లేదు. ఒకవేళ కుదిరినా అది తాత్కాలికమే అవుతోంది. అందుకు ఇరుదేశాలు ఒక దానిని మరొకటి నిందించుకొంటున్నాయి. ఎవరి వాదనలు, కారణాలు వారికి ఉన్నాయి. ఈ వాదోపవాదాలు, ఉద్రిక్తతల మధ్యనే ఇరు దేశాలు అప్పుడప్పుడు శాంతి చర్చలు జరుపుకొంటూ మళ్ళీ గొడవపడుతూ దశాబ్దాలు దొర్లించేస్తున్నాయి. మిగిలిన ఇరుగు పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు చాలా వరకు బాగానే ఉన్నప్పటికీ ఒక్క పాకిస్తాన్ తో మాత్రమే ఎందుకు సయోధ్య కుదరడం లేదు? అనే సందేహం కలగడం చాలా సహజం. అందుకు ఇరు దేశాలు చెపుతున్న కారణాలే కాక ఇంకో బలమయిన కారణం కూడా ఉంది. అదే పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులు!
భారత్, పాక్ రెండూ ఒకేసారి స్వాతంత్ర్యం పొందాయి. అప్పటి నుండి భారత్ లో ప్రజాస్వామ్యం నెలకొని ఉంటే, పాకిస్తాన్ లో చాలాసార్లు సైనిక పాలన సాగింది. అపుడప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ వాటిపై సైనిక పెత్తనం తప్పడం లేదు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికారం చెలాయిస్తున్న పాక్ సైనికాధికారుల యుద్దపిపాస కారణంగా ఈ ఆరు దశాబ్దాల సుదీర్ఘ కాలంలో పాకిస్తాన్ ఆశించినంత అభివృద్ధికి నోచుకోలేదు. సైనికాధికారుల కర్ర పెత్తనం వలన ప్రభుత్వాలు దేశాభివృద్ధి కంటే భారత్ పైనే ఎక్కువ దృష్టిపెట్టవలసి వస్తోంది. తత్ఫలితంగా దేశంలో అవినీతి, నిరుద్యోగం, దారిద్యం పెరిగాయి. భారత్ లో కూడా ఈ సమస్యలన్నీ ఉన్నాయి. కానీ ప్రజాస్వామ్యం నెలకొని ఉండటం వలన నిరంతర అభివృద్ధి జరుగుతోంది. కనుక పరిస్థితులు ఏనాడు అదుపు తప్పలేదు.
ప్రభుత్వ విధానాలు, వైఖరిని బట్టే ఆ దేశంలో లేదా రాష్ట్రంలో పరిస్థితులుంటాయి. చైనాలో కమ్యూనిస్ట్ పాలన సాగుతోంది. వారికీ యుద్ద కాంక్ష చాలా ఎక్కువే. కానీ దానికంటే వారు దేశాభివృద్ధికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే అగ్రరాజ్యాలతో సమానంగా చైనా అభివృద్ధి చెందుతోంది. కానీ పాక్ అనుసరిస్తున్న తప్పుడు వైఖరి కారణంగా పాక్ పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. ఒకవేళ పాక్ ప్రభుత్వంపై కర్ర పెత్తనం చేస్తున్న సైనికాధికారులు కూడా దేశాభివృద్ధికే ప్రాధాన్యతనిచ్చి ఉండి ఉంటే నేడు పాక్ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ వారు దేశాభివృద్దిపై దృష్టి పెట్టకుండా భారత్ తో ప్రత్యక్ష, పరోక్ష యుద్ధం చేయడానికే ఎక్కువ ప్రాధాన్యత నిచ్చారు. తత్ఫలితంగానే పాకిస్తాన్ లో మతోన్మాదం, ఉగ్రవాదం పెరిగిపోయింది.
శాంతికాముక దేశమయిన భారత్ ఏనాడూ యుద్ధం గురించి ఆలోచించలేదు. కానీ యుద్ధోన్మాదంతో రగిలిపోతున్న పాక్ సైనిక పాలకులు, సైనికాధికారులే భారత్ తమపై యుద్ధానికి వస్తుందని ఊహించేసుకొంటూ, ప్రభుత్వాన్ని, ప్రజలను కూడా ఆ ఊహాజనితమయిన యుద్దవాతవరణంలో ఉంచుతున్నారు. అలాగ ఉంచినంత కాలం వారు ప్రభుత్వాలపై కర్ర పెత్తనం చేయగలరు. వారి కనుసన్నలలో ప్రభుత్వాలు నడుస్తున్నంత కాలం, అవి దైర్యంగా, స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోలేవు. భారత్ అందిస్తున్న స్నేహహస్తం అందుకోలేవు. అందుకే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడటంలేదు. అయినప్పటికీ నాడు జవహార్ లాల్ నెహ్రూ మొదలుకొని నేడు నరేంద్ర మోడీ వరకు అందరూ పాకిస్తాన్ కి స్నేహ హస్తం అందిస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించడం లేదు.
భారత్-పాక్ ల మధ్య సంబంధాలు బలపడాలంటే, ముందుగా పాక్ లో నెలకొన్న ఈ పరిస్థితులు మారాలి. కానీ అది అసంభవం. కనుక భారత్-పాక్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగుపడటం కూడా దాదాపు అసంభవమేనని భావించవచ్చును. బహుశః భారత్-పాక్ సంబంధాలు ఎప్పటికీ ఇలాగే ఉండవచ్చును లేదా ఇంకా అద్వానంగా మారినా ఆశ్చర్యం లేదు. భారత్ తో బేషరతుగా చర్చలలో పాల్గొనటానికి తాము సిద్దంగా ఉన్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మొన్న ప్రకటించారు. కానీ భారత్ పట్ల పాక్ దృకోణం, దాని వైఖరి మారనంతవరకు ఎన్ని సార్లు చర్చించినా దాని వలన ఎటువంటి ప్రయోజనమూ ఉండబోదని చెప్పవచ్చును.