భారత్-పాక్ చర్చలు మొదలవక మునుపే ఆగిపోయే అవకాశం?
posted on Dec 1, 2015 10:40AM
పర్యావరణ కాలుష్య నియంత్రణపై చర్చించేందుకు పారిస్ లో జరుగుతున్నఅంతర్జాతీయ సమావేశంలో భారత్-పాక్ ప్రధానులు నరేంద్ర మోడీ, నవాజ్ షరీఫ్ ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడంతో మళ్ళీ రెండు దేశాల మధ్య శాంతి చర్చలు మొదలవుతాయని అందరూ ఆశిస్తున్నారు. కానీ వాటికి బ్రేక్ వేసే సంఘటన జరిగింది.
జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాజౌలీ జిల్లాకు చెందిన ఖైఫతుల్లా ఖాన్ అనే పాకిస్తానీ ఏజెంట్, అతనికి సహకరిస్తున్న అబ్దుల్ రషీద్ అనే ఒక బి.ఎస్.ఫ్.జవానును మొన్న డిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు జమ్ములో అరెస్ట్ చేసారు. వారి వద్ద నుండి బి.ఎస్.ఫ్. నిఘా వర్గానికి చెందిన కొన్ని రహస్య పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. సరిహద్దులలో భారత్ దళాల కదలికలకు సంబంధించి వ్యూహాలు, సరిహద్దులలో 126,163 ఆర్మీ రెజిమెంట్ల బలం, అవి మొహరించి ఉన్న ప్రాంతం వివరాలు, రాజోరి, పూంచ్ మరియు మెందాన్ ప్రాంతాలలో బీ.ఎస్.ఎఫ్. బలాలు వాటి మొహరింపుల వివరాలు, శ్రీనగర్ లో ఉన్న భారత్ వాయుసేన యుద్ద విమానాల వివరాలు, వాటి సంఖ్య వంటి అనేక అత్యంత రహస్య సమాచారాన్ని బి.ఎస్.ఫ్. నిఘావర్గంలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అబ్దుల్ రషీద్ సేకరించి ఖైఫతుల్లా ఖాన్ అందిస్తుంటే, అతను ఆ వివరాలను వైబర్, వాట్స్ అప్, ఈ-మెయిల్ ద్వారా పాకిస్తానీ గూడచార సంస్థ ఐ.ఎస్.ఐ.కు పంపేవాడు. బాగా రద్దీగా ఉన్న మార్కెట్ ప్రదేశాలలో లేదా బస్సులలో ఆ రహస్య పత్రాలు చేతులు మారేవని ఖైఫతుల్లా ఖాన్ తెలిపాడు.
కధ ఇంతవరకు మాత్రమే సాగి ఉండి ఉంటే, భారత్ ఏమీ చేయలేకపోయేదని చెప్పవచ్చును. భారత్ లో పాక్ గూడచర్యం చేయడాన్ని భారత విదేశాంగ శాఖ నిరసించి ఉండేది. దానిని పాక్ ఖండించి ఉండేది. కానీ ఖైఫతుల్లా ఖాన్ ఈ కధకి ఊహించని ట్విస్ట్ ఇచ్చేడు. తను అందిస్తున్న ఈ రహస్యాల గురించి చర్చించేందుకు ఐ.ఎస్.ఐ. అధికారులు తనను పాకిస్తాన్ రమ్మని పిలిచారని కానీ తన వీసా గడువు ముగుసిపోయిందని చెప్పగా వారు డిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లోని తమ సంస్థ తరపున పనిచేస్తున్న ఒక వ్యక్తిని కలవమని చెప్పారని, ఖైఫతుల్లా ఖాన్ పోలీసులకు వివరించాడు. అతనిని కలిసినట్లయితే పాకిస్తాన్ రావడానికి వీసా ఏర్పాటు చేస్తాడని ఐ.ఎస్.ఐ. అధికారులు తనకు చెప్పారని పోలీసులకు తెలిపాడు.
డిల్లీలో పాక్ హైకమీషన్ కాశ్మీరీ వేర్పాటువాదులతో అపుడప్పుడు సమావేశం అవడం అందరికీ తెలుసు. కానీ భారత్ లో ఈవిధంగా గూడచర్య చర్యలకు అండగా నిలుస్తోందనే విషయం ఇప్పుడే బయటపడింది. పాక్ హైకమీషన్ ఖైఫతుల్లా ఖాన్ కి సహకరించే వ్యక్తి ఎవరో డిల్లీ క్రైం బ్రాంచ్ బయటపెట్టలేదు. కానీ ఆ వ్యక్తిని ప్రశ్నించడానికి అరెస్ట్ చేయవలసి ఉంటుంది. కానీ అతనిని అరెస్ట్ చేయడానికి పాకిస్తాన్ అంగీకరించదు. అంగీకరిస్తే పాకిస్తాన్ హైకమీషన్ భారత్ లో గూడచర్యానికి సహకరిస్తోందని అంగీకరించినట్లవుతుంది. కనుక భారత్ అటువంటి ప్రయత్నం చేయగానే పాక్ యధాప్రకారం ఎదురుదాడికి దిగుతుంది. కనుక రెండు దేశాలు శాంతి చర్చల ఆలోచన ఏదయినా చేస్తున్నట్లయితే మళ్ళీ అది అటకెక్కుతుంది. దానికి బదులు పరస్పరం విమర్శలు మొదలవవచ్చును.
ఈ చర్చలు, పరస్పర విమర్శలు ఎప్పుడూ ఉండేవే. పాకిస్తాన్ గూడచర్యానికి పాల్పడటంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ బి.ఎస్.ఎఫ్.లో ఇంకా చాలా మంది భారత్ ఆర్మీకి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్ కి చేరవేయడంలో సహకరిస్తున్నారనే విషయం చాలా ఆందోళన కలిగిస్తోంది.