బంధువుల సాక్షిగా... బంధాలు గట్టిగా...
posted on Jun 29, 2018 12:11PM
ఒకరి కోసం ఒకరుగా జీవించాలి అని పెళ్ళిలో పెద్దలు దీవిస్తారు. ఆ దీవెనలు ఫలించాలి అంటే భార్యాభర్తలు వాళ్ళ బంధాన్ని ముందు అర్థం చేసుకోవాలి. ఆ బంధం ప్రాముఖ్యతని గుర్తించాలి. అప్పుడే అందులోని ఒడుదుడుకులకి సర్దుకోవటం ఎంత అవసరమో తెలుస్తుంది. ఈ రోజు ఒక వ్యక్తిని మన జీవితంలోకి ఆహ్వానించటం అంటే ఏంటో చూద్దాం.
అది అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు... కేవలం వాళ్ళిద్దరూ మాత్రమే కాదు అక్కడ ముడిపడేది. రెండు కుటుంబాలు కలుస్తాయి. ఆ రెండు కుటుంబాల అనుబంధం ఆ ఇద్దరు వ్యక్తుల బంధం మీద ఆధారపడి వుంటుంది. ఈ విషయాన్ని గ్రహిస్తే, ఎదుటి వ్యక్తి కుటుంబాన్ని తనదిగా భావించి, వారితో సత్సంబంధాలు కలిగి వుండటం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. నిజానికి చాలామంది భార్యాభర్తల మధ్య గొడవలకి ఈ ఒక్క విషయమే కారణం అంటే ఆశ్చర్యంగా అనిపించినా నిజమదే.
"మా అమ్మానాన్న అంటే అస్సలు ప్రేమ లేదు తనకి ", "కొంచం కూడా పట్టించుకోడు " ఇలాంటి ఆరోపణలు వింటూనే ఉంటారుగా? అటు అమ్మాయిది అదే ఆరోపణ, ఇటు అబ్బాయిది అదే ఆరోపణ. వాళ్ళ గురించి కాకుండా , వాళ్ళ వాళ్ళ గురించి ఇద్దరూ గొడవలు పడతారు. ఇక అక్కడ నుంచి ఇద్దరి మధ్య అగాథం పెరిగి, పెరిగి బంధంలో అనుబంధం లేకుండా పోతుంది . అందుకే ప్రతి కొత్త జంట గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటే. కేవలం ఒక భార్య మాత్రమే కాదు... తనతో పాటు ఇంకా ఎన్నో కొత్త బంధాలు కూడా ఏర్పడతాయి. అత్త, మామ, బావమరిది, మరదలు, ఇంకా, ఇంకా ఎందరో కొత్తగా తన జీవితంలోకి వస్తారు.
వాళ్ళందరితో ఒక మాట, ఒక పలకరింపు, ఒక చిన్న చిరునవ్వు... అవి వారిని, వారితోపాటు చిన్ననాటి నుంచి వారి ప్రేమని పొందిన మీ శ్రీమతిని కూడా ఆనందపరుస్తాయి. ఇదే సూత్రం భార్యకీ వర్తిస్తుంది. ఒక కోడలిగా, వదినగా, తోటి కోడలిగా... ఇలా తన పాత్ర ఎన్నో విధాలుగా ఆ కుటుంబంలో ఎంతో ముఖ్యమైనది. ఏ పాత్రకి తగ్గట్టు ఆ పాత్రలో ఒదిగిపోతూ, వారందరితో అనుబంధాన్ని పెంచుకుంటూ వెళుతుంటే, భర్తతో తన అనుబంధం గట్టిపడుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు.
ఇది కష్టమైనది కాదు, కష్టమని అనుకుని చాలామంది ఎదుటి వారి తాలుకా వారికి దూరంగా వుంటారు. ఆ దూరం అపోహలని పెంచుతుంది. ఆ అపోహలు ఇద్దరి మనసులలో కోపాన్ని, అసహనాన్ని పెంచుతాయి. నెమ్మదిగా నిప్పు రాజుకుంటుంది. అది దావాగ్నిలా కావటానికి అప్పుడప్పుడు ఏవేవో పరిస్థితులు కూడా తోడవుతాయి. ఇక అంతే. ఇద్దరు వ్యక్తులు కాదు అక్కడ కలసి ఉందేది. వారిద్దరి మధ్య ఎందరో నిలుస్తారు. సో ఇదంతా జరగకుండా వుండాలంటే ఏం చేయాలో ఇందాకే చెప్పుకున్నాం కదా.... వీలు చూసుకుని పలకరింపులు, కలుసుకోవటాలు... ఇక్కడ ఒక్క విషయం మర్చిపోవద్దు. చిన్నతనం నుంచి పెరిగిన తోబుట్టువులతోనే అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్థలు సహజం. అలాంటిది... వేరే కుటుంబం, పద్ధతులు, మనస్తత్వాలు... అలాంటప్పుడు అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు జరగటం సహజం. వాటిని చూసి, చూడనట్టు వదిలేయటమే మంచిది. ఎందుకంటే ఆ చిన్న సంఘటన కన్నా జీవితం చాలా పెద్దది. వారితో బంధం ఎంతో ముఖ్య మైనది. ఈ ఒక్క సూత్రం తెలిస్తే చాలు... పెళ్ళిలో పెద్దలు దీవించినట్టు ఒకరి కోసం ఒకరుగా జీవించటం కష్టమేంకాదు.
-రమ