కొత్త పైత్యం.. ఫైర్ ఛాలెంజ్...
posted on May 18, 2015 3:53PM
ఆ మధ్య బాగా ప్రచారంలోకి వచ్చిన ‘ఐస్ బక్కెట్ ఛాలెంజ్’ గురించి అందరికీ తెలిసిందే. నెత్తిన ఐస్ ముక్కలను కుమ్మరించుకునే ఈ ఛాలెంజ్‌కి సోషల్ మీడియా పుణ్యమా అని విస్తృత ప్రచారం లభించింది. ఈ ఛాలెంజ్‌కి నకలుగా ప్రపంచ వ్యాప్తంగా అనేక ఛాలెంజ్‌లు బయల్దేరాయి. నెత్తిన ఐస్ ముక్కల బక్కెట్‌ని కుమ్మరించుకుని మరికొంతమందికి అలా చేయాలంటూ ఛాలెంజ్ విసిరే ఈ ‘ఐస్ బక్కెట్’ ఛాలెంజ్ ఎంత వేగంగా ప్రపంచమంతటా వ్యాపించిందో, అంత త్వరగా చల్లారింది. ఆ ఛాలెంజ్ చల్లారినా, అలాంటి ఛాలెంజ్‌లు మాత్రం పుట్టుకొస్తూనే వున్నాయి. ఏఎల్ఎస్ వ్యాధి నివారణ కోసం ప్రారంభించిన ఐస్ బకెట్ ఛాలెంజ్ ప్రారంభమైంది. అయితే ఇప్పుడు అమెరికా యువతరం ఒక కొత్త ఛాలెంజ్‌ని ప్రారంభించారు. ఆ ఛాలెంజ్ పేరు ‘ఫైర్ ఛాలెంజ్’ ఒంటిమీద పెట్రోలు పోసుకుని, నిప్పంటించుకుని, వెంటనే నీళ్ళలోకి దూకే ఛాలెంజ్ ఇది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటున్న చాలామంది తీవ్రంగా గాయపడుతున్నారు. అబ్బాయిలే కాదు... అమ్మాయిలు కూడా ఈ ఛాలెంజ్‌లో పాల్గొంటూ గాయపడుతున్నారు. ఈ మధ్య ఈ ఫైర్ఛాలెంజ్లో పాల్గొన్న ఇద్దరు అన్నదమ్ములు ఒంటికి నిప్పంటించుకున్నారు. అయితే మంటలు విపరీతంగా వ్యాపించాయి. పక్కన ఉన్నవాళ్ళు సమయానికి మంటలార్పి వాళ్ళని కాపాడారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అలాగే నిప్పంటించుకుని ఏడుస్తున్న ఓఅమ్మాయి ఫొటో కూడా సోషల్ మీడియాలో సంచరిస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన ఛాలెంజ్‌ల కారణంగా తమ పిల్లలు ఏమైపోతారో అని అమెరికాలోని తల్లిదండ్రులు అల్లాడిపోతున్నారు.