దేశభద్రత విషయంలో కూడా రాజకీయాలేనా?
posted on May 12, 2015 5:35PM
.jpg)
కొన్ని సం.లు సీబీఐలో పనిచేసిన నీరజ్ కుమార్ అనే ఉన్నతాధికారి ముంబై బాంబు ప్రేలుళ్ళ తరువాత దానికి సూత్రధారిగా అనుమానిస్తున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తనకు స్వయంగా ఫోన్ చేసి తనకు రక్షణ కల్పిస్తే లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పాడని, కానీ అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో కొందరు రాజకీయ నాయకులు దానికి అడ్డుతగలడంతో దావూద్ ఇబ్రహీంను అరెస్ట్ చేయలేకపోయామని చెప్పడంతో రాజకీయ పార్టీలు గగ్గోలు చేసాయి. అది చూసి ఆయన మాట మార్చి తానెప్పుడు దావూద్ లొంగిపోతాడని చెప్పలేదంటూ బుకాయించారు. ఆ తరువాత హోం శాఖకు చెందిన అధికారి ఒకరు దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో ప్రభుత్వానికి తెలియదని ప్రకటించారు. పాకిస్తాన్ లోనే దావూద్ ఇబ్రహీం తలదాచుకొన్నాడని అతనికి పాకిస్తాన్ ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోందని ఇంతవరకు భారత్ వాదిస్తోంది. పాకిస్తాన్ ప్రభుత్వం హోం శాఖకు అధికారి చెప్పిన ఆ మాటలు పట్టుకొని దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడనే సంగతి భారత ప్రభుత్వానికి కూడా తెలుని, ఆ విషయాన్ని ఆ అధికారి మాటలే దృవీకరిస్తున్నాయని, కానీ భారత ప్రభుత్వం ఇంతకాలంగా తమపై అనవసరంగా నిందలు వేస్తోందని విమర్శలు గుప్పించింది. దావూద్ ఎక్కడ ఉన్నడో తమకు తెలియదని చెప్పడంతో మళ్ళీ గగ్గోలు చేయడం మొదలుపెట్టిన విపక్షాలకి పాక్ ప్రభుత్వం చేసిన వాదన మరొక ఆయుధంగా అందడంతో మూకుమ్మడిగా ఎన్డీయే ప్రభుత్వంపై దాడి చేసాయి. ఆ దెబ్బకి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మాట మార్చక తప్పలేదు. హోం శాఖ మంత్రి రాజ్ నాద్ సింగ్ పార్లమెంటులో సభ్యులను ఉద్దేశ్యించి మాట్లాడుతూ “దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే తలదాచుకొన్నాడనే సంగతి మాకు తెలుసు. ఏదో ఒకరోజు అతనిని భారత్ కు తప్పకుండా రప్పించి తీరుతాము. అవసరమయితే ఇంటర్ పోల్ సహాయం కూడా తీసుకొంటాము” అని అన్నారు. అయితే ఇంతకు ముందు అతను ఎక్కడో ఉన్నాడో తనకు తెలియదన్న ప్రభుత్వం ఇంతలోనే మళ్ళీ ఎందుకు మాట మార్చిందని ప్రతిపక్షాలు నిలదీశాయి.
వారి వాదోపవాదాలను పక్కనబెట్టి ఆలోచిస్తే ఒక విషయం అర్ధమవుతుంది. దావూద్ ఇబ్రహీంతో సహా భారత్ పై దాడి చేసిన ఉగ్రవాదులు అందరూ పాకిస్తాన్ లోనే తలదాచుకొంటున్న సంగతి పార్లమెంటులో కూర్చొన్న వారందరికీ తెలుసు. ముంబైలో అనేక వందల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకుడయిన దావూద్ ఇబ్రహీంని ఏవిధంగా బందించి బోను కెక్కించాలనే తపన కంటే, ఈ అంశాన్ని అడ్డుపెట్టుకొని ప్రభుత్వాన్ని ఏవిధంగా ఇరుకున పెట్టాలనే తపనే ప్రతిపక్షాలలో కనబడుతోంది. ఇక అధికార పార్టీ కూడా వారి భారి నుండి ఏవిధంగా తప్పించుకోవాలా అనే ఆరాటమే కనబడుతోంది. దేశభద్రతకు సంబంధించిన విషయంలో కూడా మన రాజకీయ పార్టీలు ఈవిధమయిన రాజకీయాలు చేస్తుంటాయి గనుకనే ఉగ్రవాదులు మన ఇరుగుపొరుగు దేశాలలోనే దర్జాగా, నిశ్చింతగా జీవించగలుగుతున్నారు.