కవితపై మధుయాష్కీ ఫైర్.. సెల్ఫీలు దిగినప్పుడు తెలీదా..

కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఈమధ్య మీడియా ద్వారా ప్రతిపక్షాలపై బానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఈమధ్య నేనూ ఉన్నానంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి మధుయాష్కీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితను టార్గెట్ చేశారు. ఎప్పుడో ఆమె మోడీని కలిసి తీసుకున్న సెల్ఫీ గురించి ఇప్పుడు విమర్శల బాణాలు విసిరారు. కవిత ఈ మధ్య కాలంలో మోడీపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన స్పందించి అప్పట్లో మోడీని కలిసి ఆయనతో సెల్ఫీలు దిగి మంత్రులతో ముచ్చటించిన కవిత ఇప్పుడు అదే మోడీపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆమెకు కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కనందుకే ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తుందని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు కావాల్సిన హక్కుల్ని సాధించటంలో ఎంపీలు విఫలమైనందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోడీపై విమర్శలు చేసిన  కవితపై బీజేపీ నేతలు మండిపడాలి కానీ.. వారు సైలెంట్ గానే ఉన్నారు.. కానీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ స్పందించి కవితపై విమర్శలు చేయడం కొంచెం వెరైటీగానే ఉంది.