కాంగ్రెస్ నాయకుల పార్టీల జంప్
posted on Jul 1, 2015 1:06PM
రాష్ట్రం విడిపోయిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఆనవాలు కూడా సరిగా కనపడకుండా పోయింది. అటు తెలంగాణలోనూ ఏదో ఉంది అంటే ఉంది అనే పరిస్థితి వచ్చింది. ఇక ఆంధ్రాలో అయితే చెప్పనవసరంలేదు.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే అది దేవుడికే తెలియాలి. అందుకే పార్టీ లో ఉన్న నాయకులు కూడా చిన్నచిన్నగా వేరే పార్టీల గూటికి చేరుకుంటున్నారు. ఈ పార్టీలో ఉండి ఒట్టిగా ఖాళీగా ఉండటం కంటే వేరే పార్టీలోకి చేరితే కనీసం ఏదో ఒక పదవి ఇవ్వకపోతారా అని ఆ రూట్ లో వెళుతున్నట్టున్నారు. మొన్నటికి మొన్న పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అసలు ఎప్పుడో వెళ్లాల్సింది కానీ కొన్ని బేరసారాలు కుదరక లేట్ అయింది. కానీ మొత్తానికి పార్టీ వీడారు.
ఇప్పుడు అదే బాటలో కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాను కూడా పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకుంటున్నట్టు రాజకీయవర్గాలు అనుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి కేసీఆర్ ను కలిసి సమావేశమయినట్టు తెలుస్తోంది. అసలు ఎప్పటినుంచో తనకు సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పై డీ.ఎస్ అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా డీఎస్ కు నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నించినా ఆ అవకాశం వేరే వాళ్లకు ఇవ్వడంతో మనస్తాపానికి గురై పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే డిఎస్ ను పార్టీలోనే ఉంచేందుకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బాగానే కష్టపడ్డారు కానీ అసలే కాంగ్రెస్ పార్టీ మీద ఫుల్లు ఫైర్ మీద ఉన్న డిఎస్ మాత్రం పార్టీ మారాలనే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6 న గులాబీ గూటికి చేరనున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదిలా ఉండగా కాంగ్రెస్ కు చెందిన మరో నేత కూడా డిఎస్ బాటలోనే టీఆర్ఎస్ లో చేరనున్నారట. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో తమకు భవిష్యత్ ఉండదని ముందే తెలుసుకుంటున్నారేమో నేతలు పాపం ఒక్కోక్కరుగా పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ ఎంటో కాలమే నిర్ణయించాలి..