మోడీని కలవడానికి ఆరాటపడుతున్న కేసీఆర్.. అందుకేనా?


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకప్పుడు కేంద్రానికి.. మోడీకి చాలా దూరంగా.. అంటీముట్టనట్టు వ్యవహరించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.. ఇప్పుడు కేసీఆర్ మోడీని కలవడానికి తెగ ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ ఢిల్లీ పర్యటనలోనే ఉన్న కేసీఆర్ కు మోడీని కలిసే అవకాశం దక్కలేదు. కావాలనే అపాయింట్ మెంట్ ఇవ్వలేదో.. లేకపోతే నిజంగానే టైమ్ లేక ఇవ్వలేదో తెలియదు కాని మోడీని కలిసే ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వలేదు. అయితే మళ్లీ కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 3 నుండి 5 వరకూ ఢిల్లీలోనే పర్యటించి..మోడీని కలిసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంతలా కేసీఆర్ మోడీని కలవడానికి ఎందుకు ఆరాటపడుతున్నారా అని అప్పుడే సందేహాలు మొదలయ్యాయి. ఒకవైపు నవంబర్ 3 - 4 తేదీల్లో ఢిల్లీలో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాన్ఫెడరేషన్ ఆప్ ఇండియన్ ఇండస్ట్రీ సమావేశాలకు హాజరు కావడానికే కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నా మరో వైపు ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి.

గత కొద్ది రోజుల కిందట కేసీఆర్ ను సీబీఐ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. యూపీఏ హయాంలో కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్న కేసీఆర్ ఆశాఖలో జరిగిన కొన్ని అవకతవకలు కారణంగా సీబీఐ కేసీఆర్ ను ప్రశ్నించింది. దీనికి తోడు మళ్లీ సహారా సంస్థ నుండి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఈనేపథ్యంలో వీటి గురించే మోడీతో మాట్లాడేందుకే కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళుతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 5న మోడీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. పాపం ఇన్ని రోజులు కేంద్రంతో కోపంగా ఉన్న కేసీఆర్ కి ఇప్పుడు కేంద్రంతోనే పనిబడింది. మరి మోడీ ఈసారైనా కేసీఆర్ ను కరుణిస్తారో? లేదో?