వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు

వరంగల్ లోక్‌సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్ధి పేరును తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ప్రకటించింది. టీఆర్ఎస్ తరుపున ఈ ఉపఎన్నికు పోటీ చేసే అభ్యర్ధిగా పసునూరి దయాకర్ పేరు ఖరారు చేశారు. ఢిల్లీ నుండి వచ్చిన కేసీఆర్ పార్టీ నేతలతో సమావేశమై అన్ని విధాలా చర్చించి దయాకర్ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడి వరకూ బానే ఉన్నా నిన్న మొన్నటి వరకూ టికెట్ తనకే వస్తుందని భావించిన గుడిమళ్ల రవికుమార్.. తనను కాదని కేసీఆర్ దయాకర్ కు టికెట్ ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతేకాదు మొదటి నుండి టికెట్ తనకే ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇలా చేయడం ఎంతవరకూ న్యాయం అంటూ తన సన్నిహితుల దగ్గర ఆరోపించడంతో కేసీఆర్ రవికుమార్ ను బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. కొన్ని కారణాల వల్లనే రవికుమార్ టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని.. పార్టీలో కీలక పదవి ఇస్తానని.. నిరాశ పడాల్సిన అవసరం లేదని రవికుమార్ కు హామీ ఇచ్చారంట.

కాగా పసునూరి దయాకర్ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉంటూ.. పార్టీకోసం పనిచేస్తూ.. ప్రస్తుతం పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. గత రెండు ఎన్నికల్లో వర్ధన్నపేట నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా పనిచేశారు.