కేసీఆర్ ను కరుణించని మోడీ
posted on Oct 28, 2015 1:02PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యర్ధులపై ఎలా విరుచుకుపడతారో తెలిసిన విషయమే. వాళ్లూ.. వీళ్లూ అని చూడరూ.. తన మాటల తూటాలకి అందరిని బలి చేసేస్తుంటారు. కానీ ఇప్పుడు అదే తీరు కేసీఆర్ కు కాస్తంత ఇబ్బందికరంగా మారిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎన్నికల నేపథ్యంలో ఒకరి మీద ఒకరు అవాకులు చవాకులు పేల్చుకోవడం మామూలే కానీ కేసీఆర్ కాస్తంత దూకుడిగా ప్రధాని నరేంద్ర మోడీపై కూడా అదే రీతిలో విమర్శలు చేశారు. మరి అప్పుడు అన్న మాటల్ని మోడీ అంత త్వరగా మర్చిపోతారా.. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు మోడీ అపాయింట్ మెంట్ దొరకడమే చాలా కష్టంగా ఉంది. ఎప్పటినుండో కేంద్రంతో కేసీఆర్ కు అంత మంచి సంబంధాలు లేవు.. అందుకే ఎప్పుడు కేసీఆర్ మోడీని కలుద్దామనుకున్నా మోడీ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇప్పుడు మళ్లీ ఈ విషయంలో కేసీఆర్ కు నిరాశే ఎదురైంది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ పనిలో పనిగా మోడీని కలుద్దామనుకున్నారు. కానీ మోడీ మాత్రం కేసీఆర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. అశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారత్ నుండి తప్పిపోయి పాకిస్తాన్ ఇన్ని సంవత్సరాలు ఉన్న గీత తిరిగి భారత్ కు వచ్చిన నేపథ్యంలో స్వయంగా ప్రధాని ఆమెను కలిసి.. ఆమెతో కాసేపు ముచ్చటించారు కూడా. అయితే అదే రోజు అపాయింట్ మెంట్ అడిగిన కేసీఆర్ కు మాత్రం తనను కలిసే ఛాన్స్ ఇవ్వలేదు. అయితే కేసీఅర్ కు ఇదే మెుదటిసారి కాదు.. ఇంతకుముందు కూడా చాలాసార్లు మోడీ తనను కలిసే ఛాన్స్ కేసీఆర్ కు ఇవ్వలేదు. అయితే మొన్న జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన మోడీతో కేసీఆర్ కాస్తంత దగ్గరగా మెలిగినట్టు కనిపించినా ఈ సారి కూడా అపాయింట్ మెంట్ కరువైంది.
దీనిని బట్టి అర్ధమైన విషయం ఏంటంటే ఏంత బలమున్న నాయకుడైనా ఢిల్లీ ముందు చిన్న నాయకుడే అని. కేసీఆర్ ఇప్పటికి ఈ విషయం గ్రహించినట్టున్నారు. అందుకే మోడీని పొగిడే కార్యక్రమం పెట్టుకున్నారు. మరి కేసీఆర్ పొగడ్తలకు మోడీ పడతారో.. లేదో.. ఈ సారైనా కేసీఆర్ కు మోడీని కలిసే ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.