వక్ఫ్ బిల్లుకు లోక్ సభ ఆమోదం!
posted on Apr 3, 2025 11:46AM

కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిపాదించి, ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై బీఏసీలో ఎనిమిది గంటల చర్చకు అంగీకారం కుదిరినప్పటికీ, అధికార, విపక్ష కూటముల మధ్య తీవ్ర వాగ్వివాదాలలో చర్చ సుదీర్ఘంగా సాగింది. దాదాపు 12 గంటలకు పైగా చర్చ జరిగింది. చర్చ అనంతరం లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఓటింగ్ చేపట్టారు. ఈ ఓటింగ్ లో బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు, వ్యతిరేకంగా 232 మంది ఓటు వేశారు. దీంతో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందినట్లుగా స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
వాస్తవానికి ఈ బిల్లును గతంలోనే కేంద్రం ప్రతిపాదించింది. అప్పట్లో ఈ బిల్లులోని కొన్ని అంశాలపై పలు పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ బిల్లులో సవరణల కోసం జేపీసీని నియమించింది. పలు దఫాలుగా భేటీలు నిర్వహించిన జేపీసీ ఆయా పార్టీలు చేసిన సూచనలలో కొన్నిటిని ఆమోందింది. ఈ సవరణలలో తెలుగుదేశం పార్టీ ప్రతిపాదించిన నాలుగు సవరణలకు గాను జేపీసీ మూడింటిని ఆమోదించింది. అనంతరం వక్ఫ్ సవరణ బిల్లును కేంద్రం గురువారం (ఏప్రిల్ 2) లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఈ బిల్లుపై సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్ చేపట్టగా ఎన్డీయే పక్షాలన్నీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేశాయి. దీంతో బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది.
అయితే ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవలసిన అవసరమేంటంటే.. వైసీపీ సభ్యులు ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ ఇప్పటి వరకూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చిన వైసీపీ తొలి సారిగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక రాజ్యసభలో వైసీపీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే బిల్లు ఆమోదం విషయంలో ఒకింత ఇబ్బందులను కేంద్ర సర్కార్ ఎదుర్కొనే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. అలాగే అనూహ్యంగా ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా ఏకతాటిపై నిలబడి లోక్ సభలో బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేశాయి.