దాసరికి సీబీఐ కోర్టు సమన్లు జారీ

 

ప్రముఖ దర్శకుడు మరియు మాజీ బొగ్గు శాఖా మంత్రి అయిన దాసరి నారాయణ రావుకి బొగ్గు కుంభకోణం కేసులో విచారణకు సీబీఐ ప్రత్యేక కోర్టు బుదవారం నోటీసులు జారీ చేసింది. దాసరి నారాయణ రావుతో బాటు మరో 14మందికి, 5 కంపెనీలకి కూడా ఈరోజు నోటీసులు జారీ అయ్యాయి. ఈరోజు నోటీసులు జారీ అయిన వారిలో మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి హెచ్.సి. గుప్తా, మాజీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి మధు కోడా, ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ఉన్నారు. వారు కాక ఇంకా గ్యాన్ స్వరూప్ ఘార్గ్, సురేష్ సింఘాల్, రాజీవి జైన్, గిరీష్ కుమార్ సునేజ, ఆర్కే సరఫ్ మరియు కె. రామకృష్ణ ప్రసాద్ కూడా ఉన్నారు. వీరితో బాటు జే.యస్.పి.యల్., జిందాల్ రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, గగన్ ఇన్ఫ్రా ఎనర్జీ లిమిటెడ్, న్యూ డిల్లీ ఎగ్సిం లిమిటెడ్ మరియు సౌభాగ్య మీడియా లిమిటెడ్ సంస్థలకు కూడా నోటీసులు జారీ చేయబడ్డాయి. వీరందరూ అమర్ కొండ ముర్గాదంగల్ బొగ్గు గనుల కేటాయింపులో జరిగిన అవినీతిలో నిందితులని సీబీఐ పేర్కొంది. వారిపై ఐ.పి.సి.సెక్షన్స్: 420,409 మరియు 120-బి క్రింద కేసులు నమోదు చేయబడ్డాయి. వారినందరినీ ఈనెల 22వ తేదీన సీబీఐ కోర్టులో హాజరు కావలసిందిగా జడ్జి భరత్ పరాశర్ ఆదేశించారు.