అనుమానం!

అనగనగా ఓ రాజుగారు ఉండేవారు. ఆయన అద్భుతమైన, అందమైన కోటలెన్నింటిలో నిర్మించాడు. కానీ ఎందుకనో ఆయనకు తనివి తీరలేదు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఓ చిత్రమైన మహలుని నిర్మించాలనుకున్నాడు. శిల్పులందరూ వచ్చి తలా ఓ నమూనాను చూపించారు కానీ ఏవీ రాజుగారికి నచ్చలేదు. చివరికి ఓ శిల్పి చూపించిన అద్దాలగది నమూనా ఆయనకు నచ్చింది. పని కానియ్యమన్నాడు.

 

శిల్పి చూపించిన అద్దాల గది, అలాంటి ఇలాంటి గది కాదు. ఆ గదిలోకి ఎవరన్నా ప్రవేశిస్తే వారిని ప్రతిబింబించేలా గదిలో అన్నివైపులా అద్దాలే! గది పైకప్పు, కింద గచ్చు కూడా అద్దాలతోనే తయారుచేశాడు. కంట్లో నలుసు కూడా కనిపించేంత స్పష్టంగా ఉన్నాయా అద్దాలు. లోపలికి ప్రవేశించిన మనిషికి తాను ఎక్కడ నిల్చున్నాడో కూడా తెలియనంతగా నలుదిశలా కమ్ముకుని ఉన్నాయి ఆ అద్దాలు. అంతేకాదు! ఆ అద్దాల గదిలోని శబ్దాలు కూడా ఎంతో స్పష్టంగా ప్రతిధ్వనించేవి. రాజుగారు నిర్మించిన ఈ కొత్త మహలు గురించి రాజ్యమంతా తెలిసిపోయింది. అందులోకి తొంగిచూసే అదృష్టం తమకి ఎప్పుడు వస్తుందా అని ప్రజలు తెగ ఎదురుచూడసాగారు.

ఓ రాత్రి అనుకోకుండా రాజుగారి కుక్క అందులోకి ప్రవేశించింది. లోపలికి అడుగుపెట్టగానే దానికి మతి పోయింది. తనలాంటి వందలాది కుక్కలు తనని చుట్టుముట్టి ఉన్నాయి. ఈ మహలులో రాజుగారి చెంతన ఉండే అర్హత తన ఒక్కదానికే ఉందనుకుందది. ఆ కుక్కలను భయపెట్టడానికి ఒక్కసారిగా తన వాడి పళ్లను చూపించింది. చిత్రం! అవి కూడా అలాగే తనని భయపెట్టేందుకు కోరలు చూపించాయి. యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా ఒక్కసారి గట్టిగా మొరిగింది కుక్క! దానికి నాలుగువైపుల నుంచీ భీకరంగా శబ్దాలు ప్రతిధ్వనించాయి. ఇక తన చుట్టూ ఉన్న కుక్కలతో పోరాటం చేయక తప్పలేదు. గాల్లోకి ఎగిరెగిరి పడుతూ, లేని శత్రువులను ఉన్నారనుకుని అద్దాల మీద పడుతూ నానా భీభత్సం సృష్టించింది.

ఉదయాన్నే అద్దాల గదిలోకి వచ్చిన భటులకి ఆ కుక్క నిర్జీవంగా కనిపించింది. రాత్రంతా తన ప్రతిబింబాలతో పోరాటం చేసిన ఆ కుక్క ఓడిపోయింది. మన మనసు కూడా అద్దాల గదిలాంటిదే! భయాలు నిజమవకుండానే వాటితో తలపడుతూ ఉంటాము. లేనిపోని అనుమానాలతో మనమీద మనమే పోరాటం చేస్తూ ఉంటాము! కానీ అందులో గెలుపుకి అవకాశం లేదు. ఉండేదల్లా ఓటమే!

Related Segment News