దైర్యాన్ని పెంచుకోవడం ఎలా!!!

అనగనగా ఓ ఊళ్లో ఓ కుర్రవాడు ఉండేవాడు. అతను చచ్చేంత పిరికివాడు. తన పిరికితనంతో జీవితంలో ఎన్నో అవకాశాలను కోల్పోయాడు ఆ కుర్రవాడు. అంతేకాదు… భయంతో ఎక్కడికీ వెళ్లేవాడు కాదు, ఏ పనీ చేసేవాడు కాదు. ఇంతలో అతనికి ఓ విషయం తెలిసింది. తన ఊళ్లోకి యుద్ధ విద్యలను నేర్పే ఓ గురువుగారు వచ్చారట. ఆయన దగ్గరకి వెళ్లి యుద్ధవిద్యలన్నీ నేర్చేసుకుని బోలెడంత దైర్యాన్ని తెచ్చుకోవాలని అనుకున్నాడు ఆ కుర్రవాడు. వెంటనే ఈ గురువుగారి దగ్గరకు వెళ్లి `గురువుగారూ ఎంత కష్టమైనా సరే నేను మీ దగ్గర యుద్ధ విద్యలను నేర్చుకుంటాను`అని ప్రాథేయపడ్డాడు.

 

`అదెంత భాగ్యం! కానీ అంతకంటే ముందు నువ్వో పని చేయాల్సి ఉంటుంది.` అన్నారు గురువుగారు. `మీ దగ్గర విద్యని సాధించేందుకు ఏ పని చేయడానికైనా నేను సిద్ధమే!`అన్నాడు కుర్రవాడు.

`అయితే వెంటనే ఈ ఊరిని ఆనుకుని ఉన్న నగరానికి వెళ్లు. ఓ నెల రోజులు అక్కడే ఉండు. ప్రతిరోజూ నగరంలోకి వెళ్లి నీకు ఎదుటపడే మనుషుల కళ్లలోకి చూస్తూ గట్టిగా `నేను పిరికివాడిని`అని చెప్పు` అన్నారు గురువుగారు. ఆ మాటలు విని, గురువుగారికి మతిగానీ పోయిందా అనుకున్నాడు కుర్రవాడు. కానీ ఇప్పుడిక వెనుకడుగు వేయలేడు. వేస్తే గురువుగారు ఊరుకునేట్లు లేరు. అందుకని ఆయన చెప్పినట్లుగానే మూటాముల్లే సర్దుకుని నగరానికి బయల్దేరాడు.

తన గురువుగారు చెప్పినట్లుగానే తనకి ఎదురుపడినవారితో `నేను పిరికివాడిని`అని చెప్పాలనుకున్నాడు ఆ కుర్రవాడు. కానీ ఓ రెండు రోజులపాటు నోరు పెగలనే లేదు. చివరికి మూడో రోజున ఓ వ్యక్తి కళ్లలోకి సూటిగా చూస్తూ `నేను పిరికివాడిని` అని చెప్పేశాడు. ఆశ్చర్యం! తన గొంతు అనుకున్నంత బలహీనంగా ఏమీ లేదు. రోజులు గడిచేకొద్దీ తనకి ఎదురుపడినవారికల్లా `నేను పిరికివాడిని`అని చెప్పడం మొదలుపెట్టాడు ఆ కుర్రవాడు. విచిత్రమేమిటంటే కాలం గడిచేకొద్దీ తన గొంతు మరింత స్పష్టంగా మారింది. తను ఇతరుల కళ్లలోకి సూటిగా చూడగలుగుతున్నాడు. చెప్పాలనుకున్నది దృఢంగా చెప్పగలుగుతున్నాడు. `నేను పిరికివాడిని` అంటున్నాడే కానీ తనలో పిరికితనం పోయిందనిపిస్తోంది. అనిపించడం ఏంటి! ఓ మూడు వారాలు పూర్తయేసరికి అతనిలో ఇక పిరికితనమే మిగల్లేదని అర్థమైపోయింది!


నెలరోజుల గడువు పూర్తయిన తరువాత కుర్రవాడు తన గురువుగారి దగ్గరకు తిరిగి వెళ్లాడు. `గురువుగారూ మీరు పెట్టిన పరీక్ష అద్భుతంగా పనిచేసింది. కానీ అదెలా సాధ్యం!` అని అడిగాడు అయోమయంగా.

`మరేం లేదు. పిరికితనం అనేది ఒక అలవాటు మాత్రమే! ఆ అలవాటు ఎంత బలంగా ఉంటే నువ్వు అంత బలహీనంగా మారిపోతావు. నీ మనసులో ఉన్న మాటని చెప్పాలన్నా, ఎదుటివారితో మాట్లాడాలన్నా, వారిని ఎదుర్కోవాలన్నా… నువ్వు తెగ భయపడిపోయేవాడివి. అందుకే నీకు ఆ పరీక్ష పెట్టాను. నువ్వే పని చేయడానికైతే భయపడ్డావో ఆ పనిని చేయించాను. ఎలాగైతే పిరికితనం ఓ అలవాటో ధైర్యం కూడా అలవాటే! అది ఇప్పడు నీకు అబ్బింది. భయం అనే మార్గాన్ని నువ్వు దాటి ధైర్యం అనే ప్రపంచంలోకి అడుగుపెట్టేశావు!` అంటూ చిరునవ్వుతో జవాబిచ్చారు గురువుగారు.

Related Segment News