ప్రత్యేకహోదాపై కేంద్రం ఇంకా ఆలశ్యం చేసినట్లయితే...
posted on Aug 6, 2015 9:24AM
ఏపీలో ప్రత్యేకహోదాపై మళ్ళీ వేడి రాజుకొంది. దానికోసమే ప్రత్యేకంగా నటుడు శివాజీ అధ్యక్షతన ప్రత్యేకహోదా సాధన సమితి ఏర్పడింది. సిపిఐరాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నేతృత్వంలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు బస్సు యాత్రలు, ఆ సందర్భంగా ఆంధ్రా మేధావుల ఫోరం నేతృత్వంలో జిల్లాలలో సమావేశాలు, ఊరేగింపులు చాలా జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీ వరకు వారి బస్సు యాత్రలు, సమావేశాలు కొనసాగించి, అప్పటికీ కేంద్రం ప్రత్యేకహోదాపై నిర్దిష్ట ప్రకటన చేయకపోతే, ఈనెల 11న ఆంద్ర ప్రదేశ్ బంద్ కి పిలుపునిస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
మరోవైపు వైకాపా కూడా దీని కోసం రాష్ట్రంలో పోరాటాలు మొదలుపెట్టింది. ఆపార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 10న డిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా త్వరలో తిరుపతిలో దీని కోసం ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది. తెదేపా, వైకాపా ఎంపీలు పార్లమెంటులో కేంద్రప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
ఈ పోరాటాల వలన కేంద్రం మీద ఇప్పుడు ఒత్తిడి ఇంకా పెరిగింది. దీని వలన రాష్ట్రానికి, పరిశ్రమలకి కలిగే మేలు సంగతి ఎలా ఉన్నప్పటికీ, దీనివలన రాజకీయ పార్టీలకి ప్రజలలో ఆదరణ పెరిగి తమ బలం మరింత పెంచుకొనే అవకాశం ఉంటుంది కనుక అన్ని పార్టీలు కూడా ఈ అంశంపై తమ పోరాటాలను మున్ముందు మరింత ఉదృతం చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. మోడీ ప్రభుత్వం కూడా ఈ విషయం గ్రహించే ఉంటుంది. కనుక ఇంకా దీనిని సాగదీయకుండా వీలయినంత త్వరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకొంటే మంచిది. కానీ ఇంకా జాప్యం చేసినట్లయితే ఇంతవరకు ప్రత్యేకహోదా కోసం పోరాటాలు చేస్తున్న రాజకీయ పార్టీలు, కొత్తగా ఏర్పడిన సంఘాలు అన్నీ కూడా రైల్వేజోన్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టు వంటి ఇతర హామీల అమలుకు కోసం తమ పోరాటాలను పొడిగించవచ్చును.
కేంద్రప్రభుత్వం గత 14 నెలల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా విధాలుగా సహాయం చేసింది. కానీ రాష్ట్ర బీజేపీ నేతలు వాటి గురించి గట్టిగా ప్రచారం చేసుకొనేందుకు ఆసక్తి కనబరచక పోవడంవలన, మోడీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏమీ చేయలేదనే అపవాదు మూటగట్టుకోవలసివస్తోంది. పైగా ప్రత్యేకహోదా మంజూరు చేయకుండా ప్రజలను మభ్యపెడుతోందనే మరో అపవాదుని కూడా భరించాల్సివస్తోంది. దీని వలన రాష్ట్రంలో తెదేపా-బీజేపీలకి తీవ్ర నష్టం జరుగుతోంది. ఇప్పుడు మొదలయిన పోరాటాల వలన ఒకవేళ కేంద్రం ప్రత్యేకహోదా మంజూరు చేసినప్పటికీ బీజేపీ-తెదేపా, రాష్ట్ర బీజేపీలకి దక్కవలసిన ఖ్యాతి వివిధ రాజకీయ పార్టీలు, కొత్తగా ఏర్పడిన సంఘాలకే దక్కుతుంది. తమ పోరాటాల కారణంగానే కేంద్రం దిగివచ్చి ప్రత్యేకహోదా ఇవ్వవలసి వచ్చిందని అవి చెప్పుకొనే అవకాశం కేంద్రం వాటికి కల్పించినట్లయింది. కనుక ఇప్పటికయినా ఆ ప్రయోజనం, మంచిపేరు బీజేపీ-తెదేపాలకు దక్కలనుకొంటే ప్రత్యేకహోదా గురించి కేంద్రం తక్షణమే ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేయడం మంచిది. లేకుంటే వ్రతం చెడ్డా ఫలం దక్కకుండాపోతుంది.