రాహుల్ గాంధీ మద్దతు లేకపోతే టీ-కాంగ్రెస్ మనలేదా?

 

రాష్ట్ర విభజన చేసి తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకొన్నట్లయితే, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఓడిపోయినప్పటికీ తెలంగాణాలో ఖచ్చితంగా గెలవవచ్చని కాంగ్రెస్ అధిష్టానం కలలుకంది. కానీ హస్తం గుర్తున్న కాంగ్రెస్ పార్టీకే కేసీఆర్ హ్యాండివ్వడంతో కాంగ్రెస్ అంచనాలు తారుమారయ్యాయి. కానీ అందుకు కేసీఆర్ ని నిందించడం కంటే కాంగ్రెస్ నేతలు తమను తామే నిందించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే టీ-కాంగ్రెస్ నేతలందరూ తమ బంధువులకి, కుటుంబ సభ్యులకి, స్నేహితులకి పార్టీ టికెట్లు సంపాదించుకోవడం మీద కనబరిచిన శ్రద్ద తమ పార్టీయే తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేసిందనే విషయం గురించి గట్టిగా ప్రచారం చేసుకోవడంలో చూపలేదు. తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఎన్నో సవాళ్ళని, ఒత్తిళ్ళని, తీవ్ర ప్రతిఘటనని ఎదుర్కొని మరీ తెలంగాణా ఏర్పాటు చేసింది. కానీ ఆ విషయాన్నీ ప్రజలకు గట్టిగా చెప్పుకోవడంలో విఫలమవడం వలననో లేదా నిర్లక్ష్యం వహించడం వలననో వ్రతం చెడ్డా ఫలం దక్కకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో అప్పుడున్నంత అనుకూలమయిన పరిస్థితులు మరెప్పుడూ కనబడలేదనే చెప్పవచ్చును. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ గొప్ప అవకాశాన్ని సద్వినియోగించుకోలేక చతికిలపడింది.

 

చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొంటున్నట్లుగా ఇప్పుడు రాహుల్ గాంధీ తెలంగాణా మీద ప్రత్యేకశ్రద్ద కనబరుస్తున్నారు. ఆయన మే నెలలో ఆదిలాబాద్ లో ఒకసారి పాదయాత్ర చేసారు. ఆ తరువాత మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పార్టీని వదిలి తెరాసలోకి వెళ్ళిపోయారు. మరో ఇద్దరు సీనియర్ నేతలు కె.జానారెడ్డి, దానం నాగేందర్ కూడా తెరాస వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ వచ్చి సాధించిందేమిటో ఆయనకే తెలియాలి. రాహుల్ గాంధీ మళ్ళీ ఈనెల 27, 28 తేదీలలో హైదరాబాద్, వరంగల్ జిల్లాలో భూపాలపల్లి, హన్మకొండ ప్రాంతాలలో పర్యటిస్తారని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ కుమార్ రెడ్డి తెలిపారు.

 

వరంగల్ లోక్ సభ నియోజక వర్గానికి త్వరలో జరుగబోయే ఉపఎన్నికలు, వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఆయనను రప్పిస్తున్నారనే విషయం బహిరంగ రహస్యమే. కానీ ఒక లోక్ సభ స్థానం, మున్సిపల్ ఎన్నికలలో గెలుపు కోసం రాహుల్ గాంధీ స్వయంగా పూనుకోవలసి వస్తోంది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేటికీ ఇంకా బలహీనంగానే ఉందని స్పష్టమవుతోంది. వరంగల్ నుండి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ని బరిలో దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు జిల్లాతో కానీ రాష్ట్రంతో గానీ ఏమాత్రం సంబంధం లేదు. పైగా ఆమెకు జిల్లా సమస్యలపై ఏమాత్రం అవగాహన లేదు. ఒకవేళ ఆమె ఎన్నికలలో గెలిచినా మళ్ళీ జిల్లా ముఖం చూస్తారనే నమ్మకం కూడా లేదు. అటువంటి వ్యక్తిని పార్టీ అభ్యర్ధిగా నిలబెట్టాలనుకొంటే కాంగ్రెస్ అపజయం ఖరారు అయిపోయినట్లే భావించవచ్చును. అప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ప్రచారం చేసినా ఏమీ ప్రయోజనం ఉండదు. పైగా ఆయన ప్రచారం చేసిన తరువాత కూడా ఆమె ఓడిపోతే అది ఆయనకే అవమానం, అప్రదిష్ట అవుతుంది.

 

ప్రస్తుతం తెలంగాణాలో అధికారంలో ఉన్న తెరాస చాలా బలంగా ఉంది. ముఖ్యంగా వరంగల్లో ఆ పార్టీ ఇప్పుడు చాలా బలపడింది. కనుక ఉప ఎన్నికలలో అవలీలగా గెలవగలమని భావిస్తోంది. మరోవైపు, ఓటుకి నోటు వ్యవహారంలో తమను అప్రదిష్ట పాలుచేసి, తమ పార్టీని, ప్రభుత్వాన్ని కూడా ఘోరంగా దెబ్బ తీయాలని తెరాస ప్రయత్నించినందుకు, ఈ వరంగల్ ఉపఎన్నికలలో ప్రతీకారం తీర్చుకోవాలని తెదేపా చాలా పట్టుదలగా ఉంది. అందుకు అవసరమయితే బీజేపీ అభ్యర్ధికి మద్దతు ఇచ్చయినా సరే వరంగల్ సీటును తెరాసకు దక్కకుండా చేయాలనే పట్టుదలతో ఉంది.

 

ఇటువంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ చేసే పర్యటనల వలన కాంగ్రెస్ అభ్యర్ధి గెలుస్తారని ఎవరూ భావించలేరు. కనుక ఆయనని ఈ ఎన్నికల ప్రచారానికి రప్పించాలనుకోవడమే ఒక పొరపాటు. టీ-కాంగ్రెస్ లో కొమ్ములు తిరిగిన నేతలున్నారు. వారందరూ కలిసి తమ పార్టీ అభ్యర్ధిని గెలిపించుకొని చూపిస్తే అది వారికీ గౌరవంగా ఉంటుంది...తెరాసకు తమ సత్తా ఏమిటో రుచి చూపినట్లవుతుంది. కానీ నేటికీ వారిలో ఐక్యత, పార్టీని బలపరుచుకోవాలనే పట్టుదల, ఎన్నికలలో గెలవాలనే కసి కనబడటం లేదు. అందుకే రాహుల్ గాంధీ మద్దతు కోరుతున్నారు. కానీ ఆయన రావడం వలన ఒరిగేదేమీ ఉండదు, పైగా ముందు చెప్పుకొన్నట్లుగా పార్టీ అభ్యర్ధి ఓడిపోయినట్లయితే అది అందరికీ అవమానంగానే మిగులుతుంది.