మారుతున్న నాగరికత పుణ్యమా అని ఇప్పుడు గ్రామాలు కూడా పట్టణాలకు తీసిపోకుండా ఉన్నాయి. వీధుల్లో కార్లూ, నేల మీద టైల్స్, ఇంట్లో డియోడరెంట్లు ఇప్పుడు సర్వసాధారణం. ఇక ప్లాస్టిక్‌ వాడకం గురించైతే చెప్పనే అక్కర్లేదు. వీటి వాడకం వల్ల పెద్దగా నష్టం లేదనీ, ఒకవేళ ఉన్నా వాటికి కాస్త దూరంగా ఉంటే సరిపోతుందనీ అనుకుంటున్నాము. కానీ కొత్తగా జరుగుతున్న కొన్ని పరిశోధనలు మనం వాడే వస్తువుల నుంచి వెలువడే కాలుష్య రసాయనాలు, మన ఇంట్లో ఉండే దుమ్ములో సైతం పేరుకుపోతున్నాయని రుజువుచేస్తున్నాయి.

 

పరిశోధన

గత పదహారు సంవత్సరాలుగా మన ఇళ్లలో ఉండే దుమ్ము గురించి అమెరికాలో పలు పరిశోధనలు జరిగాయి. జార్జ్‌ వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ఈ పరిశోధనల ఫలితాలన్నింటినీ క్రోడీకరించి చూశారు. ఇంట్లో రోజూ కనిపించే దుమ్ములో దాదాపు 45 రకాల హానికారక పదార్థాలు ఉన్నట్లు ఈ పరిశీలనలో తేలింది. వీటిలో ఒక పది రకాలైతే దాదాపు అమెరికా అంతటా కనిపించాయట. 

 

 

వేటి నుంచి?

ఇంతకీ ఈ హానికారక రసాయనాలు వేటినుంచి వచ్చి దుమ్ములో చేరుతున్నాయనే విషయం ఆసక్తికరమైనది. ప్లాస్టిక్‌ వస్తువులు మృదువుగా ఉండేందుకు వాడే phthalates అనే పదార్థాలూ, షాంపూల వంటి ఉత్పత్తులు నిలువ ఉండేందుకు వాడే phenol అనే రసాయనాలు, నాన్‌స్టిక్ వంటి వస్తువులను తయారుచేసేందుకు వాడే ఫ్లోరినేటెడ్‌ కెమికల్స్‌... ఇలా మన చుట్టూ ఉన్న నానారకాల వస్తు సముదాయం నుంచి హానికారకాలు వెలువడి, ఇంట్లోని దుమ్ములో పేరుకుంటున్నాయని తేలింది. ఒక్క మాటలో చెప్పాలంటే... మన ఇంట్లో రసాయనాలతో తయారైన ప్రతి పదార్థమూ ఎంతో కొంత విషాన్ని, ఇంటి వాతావరణంలోకి వెదజల్లుతూనే ఉంది. ఇక బయట నుంచి వచ్చే దుమ్ము గురించి చెప్పనే అక్కర్లేదు. పరిశ్రమల దగ్గర్నుంచీ వాహనాల వరకూ ప్రతి ఒక్క యంత్రమూ ఎంతో కొంత కాలుష్యాన్ని మన ఇంట్లోకి చేరవేస్తోంది.

 

తీవ్రమైన హాని

ఇలా దుమ్ములో కనిపించే రసాయనాలు ముఖ్యంగా సంతానోత్పత్తి మీద దుష్ప్రభావం చూపుతాయట. ఇక జీర్ణవ్యవస్థను దెబ్బతీయడం దగ్గర్నుంచీ కేన్సర్‌ను కలిగించడం వరకూ ఇవి నానారకాల రోగాలకూ మనల్ని చేరువ చేసే అవకాశం లేకపోలేదు. నేల మీద పారాడే పసిపిల్లలు, ఏది పడితే అది నోట్లో పెట్టుకునే చిన్న పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం అత్యధికం.

 

 

దుమ్ము దులుపుకోవడమే!

మనం రోజువారీ విచ్చలవిడిగా వాడేస్తున్న వస్తువులు, అవి వెలువరించే హానికారక పదార్థాల గురించి ఇంకా పూర్తిస్థాయి పరిశోధనలు జరగవలసి ఉంది. ఈలోపల మనం చేయగలిగిందల్లా, ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయడమే. ఇంట్లో దుమ్ము మరీ ఎక్కువగా పేరుకుంటూ ఉంటే, పాత పద్ధతులను వదిలిపెట్టి శక్తిమంతమైన వాక్యూమ్ క్లీనర్లను ఉపయోగించమని సూచిస్తున్నారు. నేలని ఎప్పటికప్పుడు తడిగుడ్డతో శుభ్రం చేస్తూ ఉండాలనీ, చేతులను తరచూ కడుక్కుంటూ ఉండాలని సలహా ఇస్తున్నారు. దుమ్మే కదా అని అశ్రద్ధ చేస్తే మన ఆరోగ్యం కూడా దుమ్ముకొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

- నిర్జర.