పిల్లులతో ఆడుకోవడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. కొందరిలో ఆ ఇష్టం కాస్త శృతి మించి వాటితో మోటుగా ఆడుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భాలలో పిల్లి గోళ్లు కనుక మన శరీరానికి గీరుకుంటే అది ప్రాణాంతకంగా పరిణమించవచ్చు అని సూచిస్తున్నారు వైద్యులు.
cat-scratch fever: పిల్లులలో ‘బార్టొనెలా హెర్న్‌సెలే’ అనే ఒక బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉందట. ఈ బ్యాక్టీరియా పిల్లుల శరీరం మీద ఉండే రకరకాల పరాన్న జీవుల ద్వారా ఒక పిల్లి నుంచి మరో పిల్లికి వ్యాపిస్తాయి. వీటివల్ల పిల్లులకి పెద్దగా హాని కలుగకపోయినా... ఆ బ్యాక్టీరియా కనుక మనిషి ఒంట్లోకి చేరితే cat-scratch fever అనే జబ్బు వచ్చే ప్రమాదం ఉంది. పిల్లులతో ఆడేటప్పుడు వాటి గోళ్లు మనకు రక్తం వచ్చేలా గీరుకున్నా, మన కంటికి తగిలినా... సదరు బ్యాక్టీరియా మనలోకి చేరే అవకాశాలు ఏర్పడినట్లే.
లక్షణాలు
- గాయం ఏర్పడిన చోట వాపు లేదా దద్దుర్లు,
- శరీరంలోని లింఫ్ గ్రంథులు వాయడం,
- నీరసం, జ్వరం, తలనొప్పులు, గొంతు నొప్పి,
- వెన్నునొప్పి. కీళ్లు, కండరాల నొప్పులు,
- బరువు తగ్గిపోవడం, ఆకలి మందగించడం...
.... ఇలా రకరకాల లక్షణాల ఈ రోగం ద్వారా ఏర్పడవచ్చు. గాయం ఏర్పడినప్పటి నుంచి రెండు నెలల వరకు ఎప్పుడైనా ఈ లక్షణాలు ఏర్పడవచ్చు. పైగా పరీక్షల ద్వారా ఈ జబ్బుని గుర్తించడం కూడా కష్టం. కాబట్టి ఈ లక్షణాలన్నీ ఏవో సాధారణ జ్వరం వల్ల ఏర్పడ్డాయని రోగులు భావించే ప్రమాదమే ఎక్కువ. ముఖ్యంగా HIV వంటి రోగంతో బాధపడుతున్నవారు కానీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కానీ ఈ వ్యాధి బారిన పడితే మరింత అనారోగ్యానికి లోనయ్యే ప్రమాదం ఉంది.
ఉపద్రవం: సాధారణంగా ఈ రోగ లక్షణాలన్నీ వాటంతట అవే తగ్గిపోతాయి. మరీ అవసరమైతే తప్ప వైద్యులు కూడా ఈ రోగానికి పెద్దగా మందులను సూచించరు. కానీ కొన్ని అరుదైన సందర్భాలలో మాత్రం ఈ బ్యాక్టీరియా శరీరం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించవచ్చు. తాత్కాలికంగా కంటిచూపు మసకబారడం దగ్గర్నుంచీ మెదడు శాశ్వతంగా దెబ్బతినడం వరకూ ఈ బ్యాక్టీరియా ఒకోసారి ఉపద్రవాన్నే సృష్టిస్తుంది. మరికొన్ని సందర్భాలలో ఇది ఎముకలు, గుండెను సైతం ప్రభావితం చేస్తుంది.
నివారణ: దాదాపు 40 శాతం పిల్లుల్లో ఏదో ఒక సందర్భంలో ఈ రోగాన్ని కలిగించే బ్యాక్టీరియా పొంచి ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే పిల్లులతో ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఏవన్నా గాట్లు తగిలిన తరువాత రోగలక్షణాలు కనిపిస్తే వైద్యుని సంప్రదించడాన్ని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లిపిల్లల్లో ఈ వ్యాధి కారకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటికి దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉండే పెంపుడు పిల్లులకు కూడా తరచూ వైద్య పరీక్షలను నిర్వహించమని చెబుతున్నారు.
- నిర్జర.