డోల్ గోవింద మందిరం.. గౌహతి...
డోల్ గోవింద అన్నప్పటినుంచీ నాలో ఉత్సాహం. ఆ పేరెందుకొచ్చింది అక్కడ డోల్ వాయిస్తూ డాన్స్ చేస్తారా అని అడిగితే అవునన్నారు మా టాక్సీ డ్రైవర్. రోజూ చేస్తారా అంటే అవుననే సమాధానం. ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళం అంత బాగా అర్ధం చేసుకున్నాము. సరే ఆయన్నిబ్బంది పెట్టటం ఇష్టం లేక ఊరుకున్నా సాయంకాలం అవుతోందికదా .. అక్కడ భక్తుల డాన్సులు చూడచ్చనే ఆశ కూడా ఎక్కడో మిణుకు మంటోంది. సరే మందిరం చేరాం.
క్షేత్ర పురాణం:-
గర్భాలయం 400 ఏళ్ళ క్రితందిట. తర్వాత ఆలయం చాలా అభివృధ్ధి చెయ్యబడింది. క్రీ.శ.1826 లో జరిగిన సంఘటన ఇది. ప్రస్తుతం అస్సాం రాష్ట్రంలోని రంగియా జిల్లాలో వున్న జేకేరీయా అనే గ్రామంలోని ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఒక కపిల గోవు వుండేది. అది రోజూ గోశాలనుంచీ మెడకి కట్టిన తాడు తెంచుకుని సంధ్యాజార్ అనే అడవికి వెళ్ళి అక్కడ ఒక మొక్క మీద (జటామాంసిని అనే పేరుగల మొక్క) పాలు వదిలేది. పాలు అయిపోయిన తర్వాత గోశాలకి తిరిగి వచ్చేది. పుర ప్రముఖుడికి ఈ విషయం తెలిసి తనే స్వయంగా వెళ్ళి విషయం గమనించాడు. తర్వాత ఆ మొక్కను తవ్వించగా అక్కడ శ్రీ కృష్ణుని విగ్రహం దొరికింది. గ్రామ ప్రజలంతా మేళ తాళాలతో ఊరేగింపుగా ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఊళ్ళో అంతకు మునుపే వున్న శ్రీ కృష్ణ మందిరంలో ప్రతిష్టించి పూజలు చేయసాగారు. అంతకు ముందు అక్కడ వున్న కృష్ణుడి పేరు శ్యామ్ రాయ్.
ఆ సంవత్సరం హోలీ పండుగ వచ్చింది. అక్కడి వారి ఆచారం ప్రకారం గుడికి బయట ఒక మండపం వుంటుంది. హోలీ పండగకి భగవంతుడి విగ్రహాన్ని ఆ మండపంలో పెట్టి, ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు, ప్రార్ధనలు, హోలీ సంబరాలు, నృత్యాలు వగైరా చాలా కోలాహలంగా జరుపుకుంటారు. ఐదవ రోజున పెద్ద ఊరేగింపు జరుగుతుంది. ఆ సంవత్సరం అక్కడ వున్న రెండు కృష్ణ విగ్రహాలలో ఏ విగ్రహాన్ని హోలీకి ఉపయోగించాలి అనే అనుమానం అక్కడ అందరికీ వచ్చింది. అక్కడి పూజారి రాత్రి తలుపులు వేసే ముందు స్వామినే తమ సందేహానికి సమాధానమిమ్మని కోరారు. రేపు తలుపులు తీసేసరికి ఏ విగ్రహాన్నయితే హోలీ మందిరంలో ప్రతిష్టించాలో ఆ విగ్రహం పీఠం మీద మిగతాదానికన్నా కొంచెం ముందుకు జరిగి వుండాలి అని.
స్వామి భక్తుల మొర విన్నాడు. మర్నాడు తలుపులు తీసేసరికి కొత్తగా ప్రతిష్టించిన విగ్రహం పాత దానికన్నా 4 అంగుళాలు ముందుకు జరిగి వున్నది. స్వామి వారి అభీష్టమదేననుకుని కొత్త విగ్రహాన్ని దౌల్ (హోలీ) మందిరంలో ప్రతిష్టించి హోలీ సంబరాలు జరుపుకున్నారు. అప్పటినుంచి కొత్త శ్రీ కృష్ణుడు దౌల్ గోవింద్ అయ్యాడు. ఆ దౌల్ అనే మాట నాకు ముందు తెలియక డోల్ అనుకుని డోల్ వాయిస్తూ పాడతారు, ఆడతారు అనుకున్నా. ఇంకొక విశేషమేమిటంటే ఇది జరిగిన కొన్నాళ్ళకే శ్యామ్ రాయ్ విగ్రహం పీఠం పైనుంచి పడి ఒక చెయ్యి విరగటంతో పూజకి పనికి రాదని బయట హాలులో ఒక ప్రత్యేక పీఠం పై పెట్టారు. దౌల్ గోవింద్ మహిమలు ఎక్కవయ్యేసరికి, భక్తుల రాక కూడా అధికంగానే వుంటుందిట.
ఉత్సవాలు:-
హోలీనే కాక మాఘ పౌర్ణమికి కూడా ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. అంబూవాచి సమయంలో కామాఖ్య ఆలయం మూసి వున్నప్పుడు ఈ ఆలయాన్ని కూడా మూసి వేస్తారు.
దర్శన సమయాలు:-
ఉదయం 6-30 కి గుడి తలుపులు తెరవబడతాయి. పూజారిగారు స్వామికి రకరకాల సుగంధ జలాలతోను, ఆవుపాలు, మంచి నీళ్ళతోనూ స్నానం చేయించాక అలంకరించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. మధ్యాహ్నం నైవేద్యం పెట్టిన తర్వాత అక్కడ వున్న భక్తులకందరికీ ప్రసాదం పెడతారు. (మేము వెళ్ళినప్పుడు ఆ రోజు ప్రసాదం పాయసం ఇచ్చారు). సాయంకాలం 5-30 దాకా స్వామి దర్శనం చేసుకోవచ్చు. 5-30 కి పవళింపు సేవ .. తర్వాత ఆలయాన్ని మూసి వేస్తారు.
అదండీ డోల్ గోవింద కధ.
పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ