అశ్వక్రాంత ఆర్కియలాజికల్ సైట్.. అసోం..
కొత్త ప్రదేశాలలో చూడవలసిన ప్రదేశాల వివరాలు మనం అడగాలేగానీ ఆసక్తివున్న ఆటో, టాక్సీ డ్రైవర్లు కొందరు చక్కగా వివరిస్తారు. సాధారణంగా గౌహతిలో చూడవలసిన ప్రదేశాల గురించి అడిగితే ఎవరైనా, కామాఖ్య, ఉమానంద, నవగ్రహ ఆలయాల గురించి చెబుతారు. ఇవికాక మేము చూసిన అశ్వక్రాంత, దౌల్ గోవింద, దుర్గాచల్ మా టాక్సీ డ్రైవర్ వలనే చూడగలిగాము. అందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్పాము. కామాఖ్య ఆలయంనుంచి ముందు అశ్వక్రాంత ఆర్కియలాజికల్ సైట్ కి వెళ్ళాము. అది పురాతనమైన ఆలయం అని చెప్పాడుగానీ మా టాక్సీ డ్రైవర్ అంతకన్నా ఏమీ చెప్పలేక పోయాడు. అక్కడ వున్న పూజారి, ఆయనకన్నా ఎక్కువగా అక్కడే వున్న ఒక మహిళ ఆ స్ధల విశేషాలు చెప్పారు. అవేమిటంటే....
అశ్వక్రాంత ఆర్కియలాజికల్ సైట్:
కామాఖ్య ఆలయం నుంచి ఇక్కడికి ప్రయాణం 1-10 ని. లు పట్టింది. బహుశా మినీ టాక్సీ అవటంవల్లనేమో. ఈ ప్రదేశం బ్రహ్మపుత్రనది ఒడ్డున వున్నది. అవతల ఒడ్డునుంచి ఫెర్రీమీద కూడా రావచ్చు. అలా అయితే ఆలయం చేరుకోవటానికి 125 మెట్లు ఎక్కాలి. టాక్సీలో వెళ్తే సరాయ్ ఘాట్ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలి. ఎక్కువ మెట్లు ఎక్కక్కరలేదు. శ్రీ కృష్ణుడు నడయాడిన ప్రదేశం ఇదంతా. అవునండీ..శ్రీ కృష్ణుడు ద్వారకాలోనే కాదు.. అసోంలో కూడా తిరిగాడు. అది తలచుకుంటేనే మనసు పులకిస్తుంది. అంత పుణ్యభూమిలో మనంకూడా సంచరిస్తున్నాము కదా అని.
క్షేత్ర పురాణం:
ఈ ప్రదేశం చారిత్రకంగా, పౌరాణికంగా ప్రసిధ్ధికెక్కింది. శరాయ్ ఘాట్ యుధ్ధంలో అహోం రాజుల ప్రముఖ సైనిక కేంద్రం ఇది. ఇక్కడినుంచి అహోం సైనికులు తమ విలువిద్యను ప్రదర్శించారు. ఇంక పౌరాణికంగా యోగినీతంత్ర, ఇంకా ఇతర పౌరాణిక గ్రంధానుసారం శ్రీ కృష్ణుడు ఇక్కడ మూడు సార్లు వచ్చి విశ్రాంతి తీసుకున్నాడు. మొదటిసారి రుక్మిణిని అపహరించుకుని వెళ్తున్నప్పుడు ఇక్కడ రధం ఆపి అలసిన గుఱ్ఱాలతోసహా విశ్రాంతి తీసుకున్నారు. (వారి క్షేత్ర పురాణం ప్రకారం) అందుకే అశ్వక్లాంత అనే పేరు వచ్చింది అంటారు. అశ్వ అంటే గుఱ్ఱము, క్లాంత అంటే అస్సామీ భాషలో అలసిన అని అర్ధం. రెండవసారి శ్రీ కృష్ణుడు తన మనవడు అనిరుధ్ధుణ్ణి విడిపించటానికి వచ్చేటప్పుడు కూడా ఇక్కడే విశ్రాంతికోసం ఆగారు. మూడవసారి నరకాసుర సంహారం ఇక్కడే జరిగిందంటారు. అంటే శ్రీ కృష్ణుడి రధానికి పూన్చిన గుఱ్ఱం ఇక్కడ ఎదుర్కోబడింది. అందుకే దీని పేరు అశ్వక్రాంత అయి వుండాలి అని ఒక కధనం. గవర్నమెంటువారు వ్రాయించిన బోర్డులో అశ్వక్రాంత అనే వున్నది. అందుకే నేనూ అదే వాడాను.
ఇంకొక కధనం ప్రకారం అర్జనుడు అశ్వమేధ యజ్ఞం సమయంలో అశ్వం వెంట వెళ్ళేటప్పుడు తన గుఱ్ఱానికి ఇక్కడ నీళ్ళు తాగించాడని. అర్జనుడి గురించే ఇంకొక కధ .. పద్మవ్యూహంలో పోరాడుతున్న అభిమన్యుడికి సహాయానికి వెళ్ళకుండా అర్జనుడి అశ్వాన్ని ఇక్కడ ఆపారని, ఇది కుట్రతో చేసిందిగనుక అభిక్రాంత (అస్సామీ భాషలో) అన్నారు. ఈ మాటనుంచే అశ్వక్రాంత అనే పేరు వచ్చిందని అంటారు. అక్కడి మహిళ ఆ క్షేత్ర కధనం చెప్పారన్నానుకదా. ఆవిడ పేరు శ్రీమతి బోగీ మెధీ. ఆవిడ వచ్చీ రాని హిందీలో అస్సామీ భాష కూడా మిళితం చేసి చాలా ఉత్సాహంగా చెప్పారు. మధ్యలో అస్సామీ మాటలని మా టాక్సీ డ్రైవరు హిందీలో చెప్పారు. అందులో నేను అర్ధం చేసుకున్నది మీకు చెబుతున్నాను. ఇవ్వన్నీ ఆ ప్రాంతం వారి జనశ్రుతులు.
కృష్ణుడు, ధరిత్రి (ఆవిడ ఆపేరే చెప్పారు. మనం భూదేవి సత్యభామగా అవతారమెత్తిందనుకుంటాం కదా) నరకాసురుడితో యుధ్ధం చేసిన ప్రదేశం అది. యుధ్ధంలో కృష్ణుడు అలసిపోయాడు. గుఱ్ఱం కింద పడింది. అప్పుడు ధరిత్రికి కోపం వచ్చి, ఆ కోపంతో చిన్నగా ఊగేసరికి భూమంతా కదిలిపోయింది. మట్టి మెత్తగా అయిపోయి సకల చరాచరాలు భూమిలోకి వెళ్ళిపోతుంటే దేవతలంతా వచ్చి ధరిత్రిని ప్రార్ధించారు. అమ్మా, అందరూ నీ బిడ్డలే. ఒక బిడ్డకోసం ఇంతమందిని బాధ పెడతావా శాంతించమని ప్రార్ధిస్తే ఆవిడ శాంతించి నరకాసురుణ్ణి వధించింది. అప్పటినుంచీ టపాకాయలు కాలుస్తున్నారు. అక్కడ మట్టిలో వున్న గుంటలన్నీ ఆ యుధ్ధ చిహ్నాలు అని చెప్పారు ఆవిడ.
ఫెర్రీలో వచ్చినవాళ్ళకి ముందు కనబడేది, వాహనంలో వెళ్ళినవాళ్ళు 125 మెట్లు దిగి వెళ్ళి దర్శనం చేసుకోవాల్సింది, బ్రహ్మపుత్రానది ఒడ్డునవున్న విష్ణుపాదం. నది ఒడ్డున ఒక పాదం ఆనవాలు వున్నది. నది ఒడ్డునవున్న మట్టి, రాళ్ళు గుఱ్ఱాల గిట్టలు పడితే ఎలా గుంటలు పడతాయో అలాంటి గుంటలు ఎక్కువగా వున్నాయి. అవి చూపించి పై కధ చెప్పారావిడ. అక్కడే రాతిలో ఒక పాదం ముద్ర వున్నది. అది కృష్ణుడి పాదం అన్నారు. రెండవది ఉమానంద లో వున్నదట. అక్కడనుంచి ఉమానంద (పీకాక్ ఐలెండ్) కనబడుతుంది.
అశ్వక్రాంతలో బ్రహ్మపుత్ర ఒడ్డున వున్న విష్ణుపాదం దగ్గర అశోకాష్టమి (చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే అష్టమి) నాడు పితృకార్యాలు నిర్వహిస్తారు. అంతేకాదు ఆ రోజు 8 అశోక మొగ్గలు తిని బ్రహ్మపుత్రలో స్నానం చేస్తే ఎటువంటి దుఃఖములూ వుండవని అక్కడివారి నమ్మకం. అందుకే ఆ రోజు అక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది. భక్త జన సందోహం కూడా చాలా ఎక్కువగా వస్తారు. ఇక్కడి మెట్లు స్వతహాగా ఏర్పడినవి అన్నారు. బహుశా ముందు కొండరాళ్ళతో వున్నవాటిని తర్వాత పునరుధ్ధరించి వుంటారు. నది ఒడ్డున హాయిగా, ప్రశాంతంగా వున్నది. సమయం వున్నవాళ్ళు కొంచెంసేపు గడపచ్చు.
విష్ణుపాదం వున్నదంటే గబగబా దిగానుగానీ మళ్ళీ అన్ని మెట్లూ ఎక్కి పైకి రావాలికదా. బోగీ మెధీ కధ చెప్పటంలో చాలా చమత్కారం చూపించారు. మెట్లు దిగటానికి అక్కడ విష్ణుపాదం వుంది, దానిని చూడాలనే ఉత్సాహ కలిగించారు మాలో. మెట్లు ఎక్కేటప్పుడు ఆ కాలంలో రాతి పడవలు ఉపయోగించేవారు (రాళ్ళు నీటిలో మునిగిపోతాయికదా అని నా సందేహం) కృష్ణుడు తిరిగిన పడవ పైకి వెళ్తుంటే కనిపిస్తుంది అన్నారు. రాతి పడవ, అందులో ఆ కాలంనాటిది అంటే, పడవ ఆకారంలో రాతిని చూస్తామనుకున్నాము. మెట్లెక్కుతుంటే కొండమీద పడవ చివర ఒక కొన ఆకారంగా రాయి కనబడింది. అది చూపించి అందరూ దానిని కృష్ణుడి పడవగా భావిస్తారు అన్నారు.
ఆలయం:
ఆలయం వున్న గుట్ట పేరు జనార్దన పర్వతం. ఆలయాన్ని క్రీ.శ. 1720 లో రాజా శివసింహ కట్టించారు. క్రీ.శ. 1897 లో వచ్చిన భయంకర భూకంపంలో ఈ మందిరం చాలామటుకు పాడయింది. లార్డ్ కర్జన్ హయాంలో ఆలయం ప్రస్తుత ఆకారంలో పునరుధ్ధరింపబడింది. ఈ ఆలయంలో జనార్దన విగ్రహం ఒకటి, ఇంకొక రాతి ఫలకంపై శేషశయనుడైన మహావిష్ణువు విగ్రహం వున్నది. సాధారణంగా మనం చూసే శేషశయన విష్ణు మూర్తులు ఆయన కుడి భుజంమీద (అంటే మనకి ఎడమవైపుకి తల వస్తుంది) పడుకున్నట్లు వుంటాయి. ఇక్కడ ఆయన ఎడమ భుజం పై పడుకున్నట్లు వున్నది. ఆ ఫలకంలోనే వున్న అమ్మవారిని దుర్గ అని చెప్పారు. అది కామాఖ్య పీఠం కనుక చాలా చోట్ల దుర్గ పూజలందుకుంటోంది. పాదాల దగ్గర శ్రీదేవి, భూదేవి. ఫోటోలు తీసుకోనిచ్చారు. స్వామి ఫోటో మీరూ చూడవచ్చు. అక్కడ వున్న ప్రజలలో మాన్ జాతి వారుకూడా వున్నారు. వారు భగవంతుణ్ణి నమ్మేవారుకాదు. వారు ఈ ఆలయాన్ని తుపాకులతో ధ్వంసం చెయ్యాలని చూసినా ఆలయానికి ఏమీ కాలేదు. అప్పటినుంచీ వారూ ఈ దేవుణ్ణి నమ్మారు.
అన్ని వివరాలు ఎంతో ఉత్సాహంగా చెప్పిన శ్రీమతి బోగీ మెధీకి, ఆ ఆలయం గురించి తెలిపి తీసుకువచ్చిన మా టాక్సీ డ్రైవర్ కి మరొకసారి కృతజ్ఞతలు తెలిపి అక్కడనుండి బయల్దేరాము. సాయంత్రం 3-20 కి బయల్దేరి దోవలోనే వున్న డోల్ గోవింద మందిరానికి వచ్చాము పది నిముషాల్లో. ఈ మందిరం గురించి ముచ్చట్లు వచ్చేవారం.
పి.యస్.యమ్. లక్ష్మి
(తెలుగులో అత్యధిక యాత్రా వ్యాసాలు వ్రాసిన మహిళ)