శంఖం గొప్పతనం తెలుసా?

Auspiscious Conch Shells

 

"శంఖంలో పోస్తే గానీ తీర్ధం కాదు" అని సామెతుంది. నిజమే మరి, సముద్రంలో లభించే శంఖంలో పోసినదే సిసలైన తీర్ధం. శంఖం చాలా పవిత్రమైంది. శంఖాన్ని "కోన్చ్" లేదా "షెల్ శంఖ" అంటారు.

 

ప్రాచీన గ్రంధాల్లో అనేకచోట్ల శంఖం ప్రస్తావన వస్తుంది. ప్రాచీన భారత సంస్కృతిలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. అఖండ దైవిక వస్తువుల్లో శంఖం ఒకటి. శ్రీకృష్ణుడు తదితర దేవుళ్ళ చేతిలో శంఖం దర్శనమిస్తుంది. వేల సంవత్సరాలుగా శంఖాలను ఉపయోగిస్తున్నాం.

 

విష్ణుమూర్తి, దుష్ట శక్తులను పారదోలడంలో శంఖాన్ని కూడా ఒక ఆయుధంగా ఉపయోగించాడు. శంఖం పూరించగా వచ్చే మధుర ధ్వని ధైర్యాన్ని, ఆశని, లక్ష్యాన్ని, పట్టుదలని, స్థిర చిత్తాన్ని, ఆశావాదాన్ని ఇస్తుంది. దుష్టశక్తులను తరిమికొడుతూ, విజయం మనదే అని ప్రబోధిస్తుంది. శంఖంలో సృష్టికి మూలమైన ఓంకారం ఉంది.

 

బౌద్ధంలో, చైనీస్ బుద్ధిజం లో శంఖ ధ్వనిని కష్టాలపై విజయంగా పేర్కొన్నారు. మనిషి పుట్టుక, జీవనాలకి శంఖం ప్రతీక. శంఖం చెవికి ఆనించుకున్నప్పుడు వినవచ్చే సముద్ర ధ్వని, శంఖం పూరిస్తే వచ్చే సంగీతం మానవ మనుగడను ప్రతిఫలిస్తుంది. శంఖాన్ని పూరించగా వచ్చే మధుర శబ్దం మన చెవులకు ఇంపుగా ఉంటుంది. మనసంతా హాయిగా ఉంటుంది. అంతకంటే ముఖ్యమైన సంగతి ఏమంటే శంఖనాదంతో అనేక విషక్రిములు హరిస్తాయని తేలింది.

 

శంఖాన్ని పూజిస్తాం. శంఖంతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. శంఖంతో అభిషేకం చేస్తాం. పూజలో శంఖాన్ని పూరిస్తాం. దక్షిణావర్త శంఖం అత్యంత విలువైనది. దివ్యమైన వస్తువులుగా పరిగణించే శంఖాల ఖరీదు వేలల్లో ఉంటుంది.

 

శంఖం సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. శంఖంతో పూజ అంటే లక్ష్మి ముఖాంతరంగా పూజించడం అన్నమాట.

 

మోల్ స్కా అనే జీవులు ఆత్మ రక్షణ కోసం ఏర్పరచుకున్న కవచమే శంఖం. మోల్ స్కా జీవులు కొన్నిసార్లు ఒక కవచాన్ని వదిలి, మరో కవచాన్ని తయారుచేసుకుంటాయి. అలా మనకు శంఖాలు రూపొందుతాయి. అలా రూపొందిన శంఖాన్ని ధార్మిక జీవితంలో ప్రధానంగా ఉపయోగిస్తున్నాం. తులసితో కూడిన సాలగ్రామ తీర్ధాన్ని శంఖంలో పోసి సేవించడం చాలా మంచిది. ఇలా సేవించే శంఖు తీర్ధం సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది.

 

శాస్త్రీయంగా చూస్తే, శంఖం కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, కార్బొనేట్లతో తయారౌతుంది. ఈ ధాతువులు మన శరీరానికి గొప్ప ప్రయోజనం చేకూరుస్తాయి. ఈ దైవిక వస్తువును వినియోగించడం వల్ల, శంఖు తీర్ధాన్ని సేవించడం వల్ల దేహ దారుడ్యం బాగుంటుంది. వాత, పిత్త దోషాలు హరిస్తాయి. శరీరానికి కాంతి వస్తుంది.

 

శంఖు తీర్ధం తీసుకునే సమయంలో -

''అకాల మృత్యు హరణం సర్వ వ్యాధి నివారణం

సమస్త పాప శమనం విష్ణు పాదోదకం శుభం''

అనే మంత్రాన్ని స్మరించుకోవాలి.

 

రోజులో మూడుసార్లు శంఖు తీర్ధం స్వీకరించడం అలవాటు చేసుకోవాలి. శంఖం ద్వారా వచ్చే తీర్ధాన్ని తాగడం వల్ల, శంఖంతో అభిషేకం చేయడం వల్ల అందులో ఉండే ధాతువులు మనకు ఎనలేని మేలు చేస్తాయి. కనుక శంఖం ధార్మికంగానే కాదు, వైజ్ఞానికంగా కూడా మంచిది.

 

Conch Shells in India, information about Conch Shells, Conch Shells in hindu culture and traditions, Shankham called as Conch Shell, The Auspiscious Conch Shell-Shankha


More Enduku-Emiti