భక్తుడు దేవుడి పట్ల కలిగి ఉండవలసింది!!

 

ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా చిటుక్కుమనదు. ఈ విషయం అందరికీ తెలిసినదే. కానీ కొంతమంది తమ జీవితంలో దక్కిన కొన్ని సంతోషాలను, కొన్ని అదృష్టాలను అనుభవిస్తూ ఆ భగవంతుడిని మర్చిపోవడమే కాకుండా ఇచ్చిన చేతుల్నే వెక్కించేలా అహాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అలాంటిదే ఇది కూడా.

 ఈశ్వరుడి అనుగ్రహంతో  కుబేరుడు ఐశ్వర్యవంతుడు అయ్యాడు. ధనానికి అధిపతి అయ్యాడు. అతడిలో ఆ అహాంకారం రోజు రోజుకు పెరిగిపోయింది. దేవతలను అందరినీ పిలిచి తనదగ్గరున్న ధనాన్ని చూపించి తాను గొప్పవాడిని అని అందరూ అనుకునేలా చేయాలని అనుకున్నాడు. అనుకున్నదే మొదలు దేవతలను అందరినీ తన ఇంటికి భోజనానికి రావాలి అని ఆహ్వానించాడు. అలాగే శివుడిని, పార్వతిని కూడా పిలవడానికి బయలుదేరాడు.

శివుడికి అన్ని తెలిసిపోకుంటాయి. ఎవరి ఆలోచన ఏమిటి అనేది తెలుస్తూ ఉంటుంది. అలాగే కుబేరుడు ఎందుకొస్తున్నాడు అని కూడా అర్థమైపోయింది, పార్వతి కూడా కుబేరుడి ఆలోచన తెలుసుకునేసింది. 

కుబేరుడు కొండలు వెతుకుతూ శివుడి దగ్గరకు వెళ్ళాడు. కుబేరుడు వస్తున్నాడని తెలిసినా శివుడు, పార్వతి ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నట్టు నటించారు. కుబేరుడు వచ్చి రాగానే పరమేశ్వరా మా ఇంటికి భోజనానికి రండి అని పిలిచాడు. 

శివుడు నాకు కుదరదు అన్నాడు,  పార్వతి శివుడు లేకుండా  నేను రాను అంది. ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు. వస్తూనే... 'అమ్మా! ఆకలేస్తోంది, ఏదైనా ఉంటే పెట్టు' అన్నాడు గణపతి.

పార్వతీదేవి గణపతి వైపు కనుసైగతోనే ఏదో అర్థమయ్యేలా చెప్పింది. తరువాత కుబేరుడితో 'కుబేరా! మా గణపతి మీ ఇంటికి భోజనానికి వస్తాడు' అనగా, శివుడు 'ఔనౌను, గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం. మా బదులుగా గణపతిని తీసుకెళ్లు' అన్నాడు పరమశివుడు.

ఈ పిల్లవడా భోజనానికి వచ్చేది గుప్పెడు బియ్యమైనా తింటాడో లేదో అనికుంటూ గణపతిని తీసుకుని బయలుదేరాడు. తన భవనంలోకి తీసుకెళ్ళి, అక్కడ ఉన్న సౌకర్యాలను, ఇతర సంపదలను చూపించసాగాడు.

కుభేరా ఇవన్నీ వ్యర్ధమైనవి, నేనొచ్చింది భోజనం చేయడానికి, నాకు ఆకలేస్తుంది త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా, కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞ చేశాడు.

వెంటనే బంగారు కంచం పెట్టి, రకరకాల తీపి పదార్ధలు, పానీయాలు, కూరలు, పండ్లు గణపతికి వడ్డించారు.  కుబేరుడు చూస్తుండగానే ఒక్క దెబ్బకే గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని, అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి, ఇంకా తీసుకురండి అని అడిగాడు. పనివాళ్ళు వంట గదిలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు. అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు, కడుపు నిండలేదు. 

 నా ఆకలి తీరలేదు  ఇంకా పెట్టండి అని గణపతి అడిగాడు. వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించడమే పనైపోయింది. కాసేపటికి కుబేరుడి వంటగది మొత్తం చూస్తూండగానే ఖాళీ అయిపోయింది. 

విషయం కుబేరుని తెలిసింది. తన సంపద మొత్తం తరిగిపోతోంది కానీ, గణపతి కడుపు నిండడంలేదు, ఏమి చేయాలో అర్ధంకాలేదు. ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరుని పిలిచి, నీ ఇంటికి భోజనంకు రమ్మని, నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అన్నాడు. 

కుబేరుడికి విషయం అర్ధమైంది. తనకున్న సంపద ఆ పరమాత్ముడిని ఏ మాత్రం సంతృప్తి పరచలేదని, అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని, తన అహకారం అణచడానికే దైవం ఈ విధంగా చేశాడని గ్రహించి పరుగుపరుగున కైలాసానికి వెళ్ళాడు.

స్వామీ నువ్వే దిక్కు. ధనం కి నన్ను నువ్వే అధిపతిని చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను. అందుకు బదులుగా గణపతి నా సంపద మొత్తాన్నీ ఖాళీ చేసి, అన్ని ఇచ్చిన భగవంతుడే, అహంకరించినవారి సర్వసంపదలు తీసివేస్తాడని నిరూపించాడు. నేను గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను. ఏదైనా మార్గం చూపించండి అన్నాడు. 

అప్పుడు శివుడు "కుబేరా! నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు. అందుకే గణపతి సంతృప్తి చెందలేదు. గణపతికి కావల్సినది భక్తి మాత్రమే. నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం, నీవు ఎంత భక్తితో సమర్పించావన్నది మత్రమే గణపతి చూస్తాడు. ఇదిగో ఈ గుప్పెడు బియ్యం తీసుకుని అహకారం విడిచి, చేసిన తప్పుని ఒప్పుకుని పరమభక్తితో గణపతికి సమర్పించు" అన్నాడు.

కుబేరుడు ఆ గుప్పెడు బియ్యాన్ని ఉడికించి, గణపతికి భక్తితో సమర్పించాడు. 

ఆ గుప్పెడు బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి, త్రేనుపులు వచ్చాయి. గణపతి సంతృప్తి చెందాడు.

కాబట్టి భక్తి ముఖ్యం కానీ అది లేకుండా దేవుడికి  గొప్పగా ఎంత పెట్టినా వ్యర్థమే!!

◆వెంకటేష్ పువ్వాడ


More Enduku-Emiti