మలయప్ప స్వామి
తిరుమలలో మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఊరేగించిన విశేషాలు తరచూ వార్తల్లోకి వస్తుంటాయి. ఇంతకీ ఎవరీ మలయప్ప స్వామి! ఆ పేరు ఎలా వచ్చింది! అసలు ఉత్సవ మూర్తి అంటే ఎవరు! అన్న విశేషాలు...
ధ్రువబేర:
తిరుమల గర్భాలయంలో ఉన్న మూలవిరాట్టుని `ధ్రువ బేర` అంటారు. అంటే స్థిరంగా ఉన్న ప్రతిమ అని అర్థం. ఈ మూలవిరాట్టుని ఉన్న చోట నుంచి కదల్చరాదు కాబట్టి ఆ పేరు వచ్చింది. మరి గర్భాలయం వెలుపల శ్రీనివాసునికి సేవలు చేసేందుకు, కళ్యాణోత్సవం తదితర ఉత్సవాలు నిర్వహించేందుకు, ఊరేగించేందుకు ఒక అంశ ఉండాలి కదా! అదే ఉత్సవ బేర! తిరుమలలో శ్రీ మలయప్ప స్వామివారు, ఉత్సవమూర్తిగా వెలుగొందుతున్నారు. మూలవిరాట్టుకి జరిగే ప్రతి కార్యక్రమానికీ ఈ ఉత్సవబేర ప్రతినిథిగా ఉంటుంది కాబట్టి, ఈ స్వామివారిని మూలవిరాట్టుతో సమానంగా భావిస్తారు.
చరిత్ర:
ఒకప్పడు ఉత్సవాల కోసం ఉగ్రశ్రీనివాసుని మూర్తిని వినియోగించేవారట. అయితే ఒకానొక బ్రహ్మోత్సవాల సందర్భంలో, స్వామివారి ఊరేగింపు జరిగే సమయంలో చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఎందుకిలా జరిగిందా అని భక్తులు, అర్చకులు ఆందోళనపడుతుండగా ఒక భక్తుని ద్వారా స్వామివారు తన సందేశాన్ని వినిపించాడని అంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మరో సౌమ్యమైన మూర్తిని ఉత్సవాల కోసం వినియోగించమన్నదే ఆ సందేశం. ఒక కొండ వంగి ఉండే ప్రదేశంలో ఆ మూర్తి కనిపిస్తుందని కూడా స్వామివారు తెలియచేశారట. ఆ సందేశాన్ని అనుసరించి భక్తులు నూతన ఉత్సవ మూర్తి కోసం వెతకసాగారు. అలా వారికి ఒకచోట శ్రీదేవిభూదేవి సహిత వేంకటేశ్వరుని విగ్రహాలు లభించాయి. ఈ స్వామివారికి తమిళంలో `మలై కునియ నిన్ర పెరుమాళ్` (తలవంచిన పర్వతం మీద కొలువైన స్వామి) అన్న పేరుని స్థిరపరిచారు. కాలక్రమంలో అదే మలయప్పస్వామిగా మారింది.
రూపం:
మలయప్ప స్వామి విగ్రహం పంచలోహాలతో రూపొందింది. తామరపూవు ఆకారంలోని పీఠం మీద మూడు అడుగుల ఎత్తున ఠీవిగా ఉన్న శ్రీనివాసుని రూపం అది. శంఖుచక్రాలతోనూ, వరదహస్తంతోనూ స్వామివారి దివ్యమంగళ రూపం ఉంటుంది. ఈ విగ్రహానికి కుడివైపున శ్రీదేవి, ఎడమవైపు భూదేవి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి. ఈ రెండు విగ్రహాలూ ఒకేలా ఉంటాయి. కాకపోతే భంగిమలు అటుదిటుగా ఉంటాయంతే! మరి ఇద్దరిలో ఎవరూ ఎక్కువతక్కువ కాదు కదా! శ్రీదేవిభూదేవి విగ్రహాలు కూడా వేంకటేశ్వరుని విగ్రహంతో పాటుగానే స్వయంభువులుగా దొరికాయని అంటారు. ఈ విగ్రహాలు దొరికిన కోనని ఇప్పటికీ మలయప్ప కోనగా పిలుస్తున్నారు. దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే లిఖించిన ఒక శాసనంలో ఈ విగ్రహాల ప్రసక్తి ఉన్నది.
సేవలు:
శ్రీవారికి భక్తులు జరుపుకొనే కళ్యాణోత్సవాలలో మలయప్ప స్వామివారినే వినియోగిస్తారు. సాయంవేళ జరిగే సహస్రదీపాలంకరణ సేవలోనూ స్వామివారే కొలువుంటారు. స్వామివారికి జరిగే కొన్ని అభిషేకాలలో కూడా ఉత్సవమూర్తికి భాగం ఉంటుంది. పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా మలయప్ప స్వామివారికే నిర్వహిస్తారు. ఇక పద్మావతి పరిణయం, బ్రహ్మోత్సవాల వంటి ఉత్సవాల సందర్భంగా మలయప్ప స్వామివారు గజ, అశ్వ, గరుడ, శేష తదితర వాహనాలలో వైభవంగా ఊరేగుతూ భక్తులకు ఆశీస్సులను అందిస్తారు.
- నిర్జర