Home » Ladies Special » ఈ చిన్న అలవాట్లు మహిళల జీవితాన్ని మార్చేస్తాయ్..!
ఈ చిన్న అలవాట్లు మహిళల జీవితాన్ని మార్చేస్తాయ్..!
.webp)
మహిళల జీవితంలో మార్పు రావాలంటే పెద్ద నిర్ణయాలు గానీ, కఠినమైన నియమాలు గానీ అవసరం లేదు. రోజూ వారు చేసే చిన్న చిన్న అలవాట్లే వారి సమయాన్ని, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని చక్కదిద్దుతాయి. అన్నీ ఒకేసారి మార్చుకోవాలని ఒత్తిడి పడకుండా, వారికి ఇప్పుడు అవసరమైన రెండు మూడు అలవాట్లతో నెమ్మదిగా మొదలుపెడితే చాలు..
మార్నింగ్ ప్రయారిటీ..
ఉదయం నిద్రలేచిన వెంటనే ఫోన్ చూడకుండా మొదటి పది నిమిషాలు మీ కోసం కేటాయించుకోవాలి. నీళ్లు తాగడం, కిటికీ దగ్గర నిలబడటం లేదా కాసేపు నడవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ రోజులో తప్పకుండా చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులను ముందుగా రాసుకోవాలి. అన్ని పనులను ఒకేసారి కాకుండా, ఒక్కో చిన్న పనిని పూర్తి చేస్తూ ముందుకు వెళ్లడం వల్ల పని పూర్తయిన సంతృప్తి కలుగుతుంది.
విశ్రాంతి..
పనుల మధ్యలో అలసిపోకముందే చిన్న చిన్న విశ్రాంతులు తీసుకోవాలి. విశ్రాంతి అంటే ఫోన్ స్క్రోల్ చేయడం కాదు, మనసుకు నిజమైన రిలాక్సేషన్ ఇచ్చేలా ఫోన్ లేకుండా కొద్దిసేపు కూర్చోవడం. అలాగే ఇంట్లో పనులలో భాగస్వామ్యం అడగడం, మీ కోసం రోజులో కనీసం పది నిమిషాలు ముందుగానే తీసి పెట్టుకోవడం చాలా అవసరం.
.webp)
బంధాలలో మార్పు..
సంబంధాలలో కూడా చిన్న అలవాట్లు పెద్ద మార్పు తెస్తాయి. ప్రతి అభ్యర్థనకు వెంటనే సరే అనకుండా, ఆలోచించి అవసరమైతే మర్యాదగా లేదు అని చెప్పడం నేర్చుకోవాలి. మనసులో ఏముందో అవతలి వారు ఊహించాలని ఆశించకుండా, మీకు ఏం కావాలో స్పష్టంగా చెప్పాలి. కోపం వచ్చినప్పుడు వెంటనే కఠినమైన మాటలు అనకుండా, కొంత సమయం తీసుకుని శాంతంగా మాట్లాడాలి.
ఆర్థిక విషయాలు..
డబ్బు విషయంలో ఆదాయం రాగానే కొంత మొత్తం ముందుగానే పొదుపు చేయండి. ఆన్లైన్లో ఏదైనా నచ్చినప్పుడు వెంటనే కొనకుండా ఒక్క రోజు ఆగి ఆలోచించండి. వారానికోసారి ఖర్చులను చూసుకోవడం, ఏడాదికోసారి వచ్చే ఖర్చులకు ముందుగానే సిద్ధపడటం వల్ల ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది.
చివరగా, మీతో మీరు మాట్లాడే మాటలను సానుకూలంగా మార్చుకోవాలి. చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా గుర్తించాలి, ఇతరులతో పోల్చుకోకుండా నిన్నటి కంటే ఈరోజు కొంచెమైనా మెరుగ్గా ఉన్నామా అని చూసుకోవాలి. ఈ చిన్న అలవాట్లను ఈరోజే మొదలుపెడితే మీ జీవితం మరింత తేలికగా, ఆనందంగా మారుతుంది.
*రూపశ్రీ.
