Home » Ladies Special » మహిళల జీవితాన్ని నందనవనం చేసే విషయాలివి.. తప్పక పాటించండి..!

మహిళల జీవితాన్ని నందనవనం చేసే విషయాలివి.. తప్పక పాటించండి..!


ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు కుటుంబం కోసం నిరంతరం కష్టపడుతూ, తమ ఆరోగ్యాన్ని , సంతోషాన్ని పణంగా పెట్టే మహిళలు మన ఇళ్లలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా  నలభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళ జీవితంలోనూ శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు వస్తుంటాయి. కానీ చాలామంది ఆ మార్పులను గమనించరు, తమ అవసరాలను ఆఖరి స్థానంలో ఉంచుకుంటారు. దీని వల్ల  తీవ్రమైన అలసటను ఎదుర్కొంటుంటారు. అటువంటి మహిళల జీవితాల్లో ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని నింపడానికి కొన్ని కీలకమైన నియమాలు ఎంతైనా అవసరం. జీవితంలో ఎప్పుడూ ఇతరుల కోసమే బతికే మహిళలు తమకంటూ కొద్దిగా సమయం కేటాయించుకుంటే ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మనశ్శాంతి కూడా లభిస్తుంది. నలభై ఏళ్ళు దాటిన మహిళలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పాటించాల్సిన ఏడు ముఖ్యమైన నియమాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..


 ముప్పై నిమిషాలు నడక..

ఇంట్లో పనులు చేసుకుంటూ తిరగడం వేరు, పూర్తిగా మన ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా నడవడం వేరు. ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో వేగంగా నడవడం వల్ల సగం రోగాలు దరిచేరవు. నడిచేటప్పుడు పక్కవారితో మాట్లాడగలిగే వేగంతో ఉంటే సరిపోతుంది.


ఆహారంలో పోషకాలు..

ఇంట్లో అందరికీ వడ్డించి మిగిలిన చల్లటి అన్నం తినడం లేదా కేవలం టీ బిస్కెట్లతో రోజు గడపడం చాలా మందిలో చూస్తుంటాము. కానీ ఈ వయసులో శరీరానికి ప్రోటీన్ చాలా ముఖ్యం. పప్పు, పెరుగు, మొలకెత్తిన గింజలు, పనీర్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. భోజనం చేసేటప్పుడు అన్నం కంటే ముందు పప్పు లేదా పెరుగు తినే అలవాటు చేసుకోవడం మంచిది.

కండరాలకు తగిన శక్తి..

వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల శాతం తగ్గిపోవడం సహజం. దీనివల్ల మోకాళ్ల నొప్పులు, నీరసం వస్తాయి. దీనికోసం ప్రత్యేకంగా జిమ్ కి వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే చిన్నచిన్న వ్యాయామాలు, కుర్చీలో నుంచి లేవడం కూర్చోవడం వంటివి చేయడం ద్వారా శరీరం దృఢంగా మారుతుంది.

ప్రశాంతమైన నిద్ర..


రాత్రి సమయంలో కనీసం ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర ప్రతి మహిళకు చాలా అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు రోజంతా చిరాకు పెరుగుతుంది. రాత్రి పడుకునే ముందు టీవీలకు, ఫోన్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం.

మొహమాటం లేకుండా నో చెప్పడం..

ఇతరుల కోసం అన్ని పనులకు తల ఊపుతూ పోతే మానసిక భారం విపరీతంగా పెరుగుతుంది. రోజులో ఒకసారైనా మీకు ఇష్టం లేని పనికి లేదా వేరేవాళ్ళు చేసుకోగలిగిన పనికి నో చెప్పడం వల్ల మానసిక ప్రశాంతత దొరుకుతుంది.


 మనసు విప్పి మాట్లాడటం,  నవ్వడం..

ఒంటరితనం  అనారోగ్యానికి దారితీస్తుంది. వారానికి ఒక్కసారైనా పాత స్నేహితులతో లేదా బంధువులతో మాట్లాడి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ఒత్తిడి దూరమై మనసు తేలికవుతుంది.


సమయం కేటాయించుకోవడం..

చిన్ననాటి అభిరుచులు, ఇష్టమైన పాటలు పాడుకోవడం, పుస్తకాలు చదవడం లేదా మనసుకు నచ్చిన పని చేయడం ద్వారా ఉత్సాహాన్ని పొందవచ్చు. సంతోషం ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదు, అది మనలోనే ఉంటుంది. ఈ చిన్న చిన్న మార్పులను పాటిస్తే ప్రతి మహిళ తన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని తిరిగి సొంతం చేసుకోవచ్చు.

                     *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.