Home » Ladies Special » ఆడవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టేది సాటి ఆడవారేనా.!

ఆడవాళ్లను ఎక్కువగా ఇబ్బంది పెట్టేది సాటి ఆడవారేనా.! 

ఇంట్లో అయినా, బయట ఉద్యోగ స్థలంలో అయినా ఒక ఆడపిల్లను మరో ఆడపిల్ల మాటలతోనో, చేతలతోనో ఇబ్బంది పెట్టడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అసలు సమాజంలో ఎప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన ఆడవాళ్లే కొంటె మాటలతోనో, విమర్శలతోనో తోటివారికి శత్రువులుగా ఎందుకు మారుతుంటారు అనే విషయంపై మన సమాజంలో ఎప్పటి నుంచో పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. మన సమాజంలో తరతరాలుగా వస్తున్న కొన్ని పాత పద్ధతులు, ఆలోచనా విధానాలు దీనికి ప్రధాన కారణం అవుతున్నాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే కుటుంబ వ్యవస్థల్లో ఆడవాళ్లు ఎప్పుడూ తమ ఉనికిని కాపాడుకోవడానికి, ఇంట్లో గుర్తింపు తెచ్చుకోవడానికి ఒకరితో ఒకరు పోటీ పడాల్సి వస్తుంది. అత్తా కోడళ్ల మధ్య గొడవలు, తోటికోడళ్ల మధ్య ఈర్ష్య..  అన్నీ ఈ పోటీ తత్వం నుంచే పుట్టుకొస్తాయి. ఒక ఆడది మరో ఆడదానిపై పైచేయి సాధిస్తేనే తనకు విలువ దక్కుతుందనే ఒక తప్పుడు అభిప్రాయం మన మనసుల్లో బలంగా నాటుకుపోయింది. అందుక ఆడవాళ్లు ఎక్కువగా సాటి ఆడదాని వల్లే ఇబ్బంది పడుతుందనే విషయం తేటతెల్లమవుతుంది.  అసలు ఇది మంచిదేనా? దీన్ని ఎలా అరికట్టాలి? వివరంగా తెలుసుకుంటే..

ఆడపిల్లలు పెరిగే విధానం..

చిన్నప్పటి నుంచి ఆడపిల్లలను పెంచే విధానంలోనే తేడాలు ఉంటున్నాయి. ఆడవాళ్లే ఆడవాళ్లను తక్కువ చేసి మాట్లాడటం, వంటపనిలో, నడతలో, ప్రవర్తనలో వేరే వాళ్లతో పోల్చడం ఇంట్లోనే మొదలవుతుంది. దీనివల్ల తోటి మహిళలను స్నేహితులుగా కాకుండా, తమను అధిగమించడానికి ప్రయత్నించే పోటీదారులుగా చూసే మనస్తత్వం చిన్న వయసు నుంచే అలవడుతుంది.

పురుషాధిక్య సమాజం..

పురుషాధిక్య సమాజంలో తాము ఎదుర్కొన్న కష్టాలను, అణచివేతలను మరో కొత్త తరానికి తామే స్వయంగా మోయించడం కూడా మరో లోపం. అత్తగారు తాను పడ్డ కష్టాలను కోడలు కూడా పడాలని కోరుకోవడం, కోడలిని అలాగే నియంత్రించాలని చూడటం,  కోడలు ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఇవన్నీ మేము అనుభవించామని చెప్పడం.. వంటి కారణాల  వల్ల తరం తరం మధ్య ఈ వైరం అలాగే కొనసాగుతూ వస్తుంది.

దీన్నెలా మార్చాలి?

ఈ పరిస్థితి మారాలంటే ముందుగా మన ఆలోచనా విధానం మారాలి. తోటి ఆడది ఎదుగుతుంటే ఈర్ష్య పడటం మాని, ఆమె విజయాలను మెచ్చుకోవడం నేర్చుకోవాలి. ఒకరికొకరు పోటీదారులు కాకుండా, కష్టసుఖాల్లో అండగా నిలిచే తోడు నీడలుగా మారినప్పుడే సమాజంలో నిజమైన మార్పు వస్తుంది. ఆడవాళ్ల శక్తి ఏమిటో తోటివారికే అర్థమైన రోజున ఇలాంటి సమస్యలకు పూర్తిగా తెరపడుతుంది.

                                                                                                                                            *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.