Home » Health Science  » మహిళలలో అండాల విడుదల సక్రమంగా జరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి

మహిళలలో అండాల విడుదల సక్రమంగా జరగాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి


మహిళల ఆరోగ్యంలో సంతానోత్పత్తి వ్యవస్థ చాలా కీలకమైనది. నేటి ఆధునిక జీవనశైలి, మానసిక ఒత్తిడి, పోషకాహార లోపం , హార్మోన్ల అసమతుల్యత వల్ల చాలామంది మహిళల్లో అండాల విడుదల లేదా అండాశయం నుండి గుడ్డు సరిగ్గా విడుదల కాకపోవడమనే సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీన్నే అండ్రోజెన్ లేదా అండాల విడుదల సమస్యలు అని అంటారు. గర్భధారణకు లేదా నెలసరి సక్రమంగా రావడానికి   ప్రతి నెల అండం సరైన సమయానికి విడుదల కావడం చాలా ముఖ్యం. ఈ ప్రక్రియ సహజంగా, సక్రమంగా జరగడానికి  తినే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. సరైన పోషకాలు ఉన్న ఆహారాన్ని రోజువారీ అలవాటుగా చేసుకుంటే హార్మోన్లు సమతుల్యంగా మారి, సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. మహిళల్లో అండాల విడుదల సక్రమంగా జరగడానికి సహాయపడే ముఖ్యమైన ఆహార పదార్థాలు , వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుంటే..

ఆకుకూరలు , కూరగాయలు..

పాలకూర, తోటకూర, బ్రోకలీ వంటి ఆకుకూరల్లో ఫోలేట్ (విటమిన్ బి-9), ఐరన్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి అండాశయాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, అండం నాణ్యతను పెంచడానికి ఎంతో తోడ్పడతాయి. రోజువారీ భోజనంలో ఆకుకూరలను భాగం చేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గుతుంది.

పప్పుధాన్యాలు , శనగలు..

శాకాహారంలో ప్రోటీన్ లభించే పప్పులు, శనగలు, పెసలు ,  చిక్కుళ్ళు అండాల విడుదలకు చాలా మంచివి. జంతు సంబంధిత ప్రోటీన్ కంటే వృక్ష సంబంధిత ప్రోటీన్ తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో ఉంచి హార్మోన్లను క్రమబద్ధీకరిస్తాయి.

మొలకెత్తిన విత్తనాలు , గింజలు.. 

బాదం, వాల్‌నట్స్, గుమ్మడి విత్తనాలు, నువ్వులు , పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ఇ, జింక్, మెగ్నీషియం , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి అండాశయాలకు రక్తప్రసరణను పెంచి, హార్మోన్ల ఉత్పత్తి సరిగ్గా జరిగేలా చూస్తాయి. ముఖ్యంగా వాల్‌నట్స్ , గుమ్మడి విత్తనాలు అండం విడుదల కావడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

తాజా పండ్లు..

జామ, బత్తాయి, నారింజ, బెర్రీలు, వంటి పండ్లలో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని హానికర కణాలను తగ్గించి, అండాల నాణ్యతను కాపాడుతాయి. దానిమ్మ పండు తినడం వల్ల గర్భాశయానికి రక్తప్రసరణ పెరిగి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తృణధాన్యాలు..

తెల్ల  బియ్యం, మైదా వంటి రిఫైన్డ్ ఆహారాలకు దూరంగా ఉండి, గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు , బ్రౌన్ రైస్, కొర్రలు, సమలు వంటి చిరు ధాన్యాలు తీసుకోవాలి. వీటిలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు , ఫైబర్ శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గి అండాలు సరిగ్గా విడుదలవుతాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు..

శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు సరిగ్గా ఉత్పత్తి కావాలంటే ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. అవకాడో, ఆలివ్ నూనె , కొబ్బరి నూనె వంటివి ఆహారంలో చేర్చుకోవడం వల్ల హార్మోన్ల వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.

చేపలు.. 

మాంసాహారం తినేవారు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే శార్డైన్స్, సాల్మన్ వంటి చేపలను తీసుకోవచ్చు. ఇవి శరీరంలో మంటను లేదా వాపును తగ్గించి, అండాశయం పనితీరును మెరుగుపరుస్తాయి.

తగినంత నీరు , ద్రవాహారం..

ఆహారంతో పాటు ప్రతిరోజూ తగినంత నీరు తాగడం కూడా చాలా అవసరం. నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, కణాలకు పోషకాలు సరిగ్గా అందేలా చేస్తుంది. కొబ్బరినీళ్ళు, పల్చటి మజ్జిగ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

తీసుకోకూడని ఆహారాలు..

అండాల విడుదల సక్రమంగా జరగాలంటే మంచి ఆహారం తీసుకోవడంతో పాటు కొన్నింటికి దూరంగా ఉండాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, వేపుళ్ళు, చక్కెర ఎక్కువగా ఉండే తీపి పదార్థాలు, మైదా, కూల్ డ్రింక్స్ , జంక్ ఫుడ్ తగ్గించాలి. అలాగే కెఫిన్ పానీయాలు అయిన టీ, కాఫీ పరిమితి దాటకుండా చూసుకోవాలి.

గుర్తుంచుకోవాల్సిన విషయం..

మహిళలు తమ ఆహారంలో సహజమైన, తాజా పోషకాలు ఉండేలా చూసుకోవడం ద్వారా అండాల విడుదల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఆహార అలవాట్లతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రోజుకు 7 నుండి 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవడం , ఒత్తిడికి దూరంగా ఉండటం వల్ల సంతానోత్పత్తి ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. 

 

                          *రూపశ్రీ.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.