Home » Health Science » రొమ్ములలో గడ్డలు లేకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా..నిజాలు తెలుసుకోండి..!
రొమ్ములలో గడ్డలు లేకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుందా..నిజాలు తెలుసుకోండి..!

రొమ్ము క్యాన్సర్ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది రొమ్ములో ఏదైనా గడ్డ ఏర్పడటం. చాలామంది రొమ్ములో గడ్డ ఉంటేనే అది క్యాన్సర్ అని భావిస్తారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రొమ్ములో ఎలాంటి గడ్డ లేకపోయినా కొన్ని సందర్భాలలో క్యాన్సర్ సోకే అవకాశం ఉంటుంది. ప్రాథమిక దశలో రొమ్ము క్యాన్సర్ లక్షణాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. గడ్డ పస్తేనే రొమ్ము క్యాన్సర్ ఉన్నట్టు అని అనుకోవడం చాలా మూర్ఖత్వం. దీని గురించి ప్రతి మహిళ వివరంగా తెలుసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ గురించి మహిళలు తెలుసుకోవలసిన నిజాంలేంటో తెలుసుకుంటే..
ఇది కూడా చదవండి
| శీతాకాలంలో, గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: నిపుణుల సలహా |
రొమ్ములో ఎలాంటి గడ్డ లేకపోయినా క్యాన్సర్ వస్తుందా?
రొమ్ములో ఎలాంటి గడ్డ లేకపోయినా రొమ్ము క్యాన్సర్ రావడం సాధ్యమేనా అనే ప్రశ్నకు వైద్యులు అవుననే సమాధానం ఇస్తున్నారు. రొమ్ము క్యాన్సర్ కొన్ని రకాల ప్రారంభ దశల్లో స్పష్టమైన గడ్డ ఏదీ తగలదు. కొన్నిసార్లు కణితి చాలా చిన్నదిగా ఉండటం వల్ల లేదా కణజాలం లోపల ఉండటం వల్ల అది చేతికి తగలదు. అయినప్పటికీ నిప్పల్ ఆకారంలో లేదా రొమ్ము ఉపరితలంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో సాధారణ స్క్రీనింగ్ లేదా మామోగ్రఫీ పరీక్షల ద్వారా మాత్రమే ఈ క్యాన్సర్ బయటపడుతుంది. అందువల్ల కేవలం గడ్డను మాత్రమే క్యాన్సర్‌కు ఏకైక లక్షణంగా పరిగణించడం సరైన పద్ధతి కాదు.
రొమ్ము చర్మంలో గుంటలు లేదా చర్మం ముడతలు..
రొమ్ము చర్మంపై అకస్మాత్తుగా చిన్న గుంటలు, చర్మం లోపలికి లాగినట్లుగా ఉండటం లేదా కుంచించుకుపోయినట్లు కనిపిస్తే దానిని తేలికగా తీసుకోకూడదు. కొన్నిసార్లు క్యాన్సర్ కణాల ప్రభావం వల్ల లోపలి కణజాలంలో మార్పులు వచ్చి చర్మం లోపలికి లాగబడుతుంది. రొమ్ము చర్మం సరిగ్గా నారింజ పండు తొక్కలా మారడం కూడా ఒక రకమైన హెచ్చరిక సంకేతం కావచ్చు.
.webp)
ఇది కూడా చదవండి శీతాకాలంలో, గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: నిపుణుల సలహాలు
నిప్పల్ లోపలి వైపునకు తిరిగిపోవడం..
సాధారణంగా ఉండే నిప్పల్ ఒక్కసారిగా లోపలికి ముడుచుకుపోవడం లేదా ధూసుకుపోవడం జరిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. కొంతమందిలో ఇది పుట్టుకతోనే ఉండవచ్చు కానీ వయసు పెరుగుతున్న కొద్దీ లేదా అకస్మాత్తుగా ఇలాంటి మార్పు వస్తే అది క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. నిప్పల్ స్థానంలో లేదా దాని చుట్టూ వచ్చే ఇటువంటి మార్పులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
నిప్పల్ నుండి ద్రవాలు లేదా రక్తం కారడం..
నిప్పల్ ను ఎలాంటి ఒత్తిడికి గురిచేయకపోయినా దానికదే ద్రవం వెలువడటం, ముఖ్యంగా అందులో రక్తం లేదా రక్తం లాంటి మరకలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. అన్ని రకాల డిశ్చార్జ్‌లు క్యాన్సర్ కాకపోయినా, దీని వెనుక రొమ్ము క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవడం మంచిది.
రొమ్ము చర్మం ఎర్రగా మారడం లేదా మందంగా తయారవడం..
రొమ్ము చర్మంపై ఎప్పుడూ ఎరుపుదనం, వాపు లేదా మందపాటి పొర ఏర్పడినట్లు కనిపిస్తే డాక్టర్ సలహా తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక రకాల క్యాన్సర్లలో రొమ్ము చర్మం ఎర్రగా, వెచ్చగా , ఉబ్బినట్లు మారుతుంది. దీనిలో కూడా ఎలాంటి గడ్డ స్పష్టంగా ఉన్నట్టు అనిపించదు. కేవలం చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్ లేదా అలెర్జీ అనుకుని దీనిని నిర్లక్ష్యం చేయకూడదు.
రొమ్ము పరిమాణంలో లేదా రూపంలో తేడాలు..
మహిళల్లో హార్మోన్ల మార్పులు, రుతుస్రావం లేదా గర్భధారణ సమయంలో స్వల్ప మార్పులు రావడం సాధారణం. కానీ ఒక రొమ్ము పరిమాణం అకస్మాత్తుగా వేగంగా మారుతుండటం, దానిలో అనూహ్యమైన వాపు రావడం లేదా రెండు రొమ్ముల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తే దానిని పరీక్షించుకోవాలి. ముఖ్యంగా ఈ మార్పులు చాలా కాలం పాటు అలానే ఉంటే లేదా దానితో పాటు నొప్పి ఉంటే వైద్య సలహా తప్పనిసరి.
కొన్ని పరిశోధనల ప్రకారం, చాలామంది మహిళలు గడ్డ కాకుండా ఇతర లక్షణాల ద్వారా క్యాన్సర్‌ను గుర్తిస్తుంటారు. నిప్పల్ లో మార్పులు లేదా నొప్పి వంటి లక్షణాలు ఉన్నప్పుడు కొందరు డాక్టర్ వద్దకు వెళ్లడంలో ఆలస్యం చేస్తుంటారు. అందువల్ల మహిళలు అందరూ గడ్డలతో పాటు పైన పేర్కొన్న ఇతర సంకేతాల గురించి కూడా అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. రొమ్ములో ఎలాంటి అసాధారణ మార్పు కనిపించినా సొంతంగా ఎలాంటి అంచనాకు రాకుండా నిపుణులైన వైద్యుల వద్దకు వెళ్లి అల్ట్రాసౌండ్, మామోగ్రఫీ లేదా బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన అందరికీ క్యాన్సర్ అని అర్థం కాదు, కొన్నిసార్లు సాధారణ ఇన్ఫెక్షన్లు లేదా హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం కావచ్చు. ఏదేమైనా ముందస్తు గుర్తింపు, సరైన చికిత్స ద్వారా ఈ వ్యాధిని విజయవంతంగా ఎదుర్కోవచ్చు.
మీకు నచ్చవచ్చు మహిళల వక్షోజాలను బిగుతుగా చేసే వ్యాయామాలు ఇవే..!
*రూపశ్రీ
