Home » Health Science  »  గర్భధారణలో ఉన్నప్పుడు మహిళల బిపి ఎంత ఉండాలి..ఎంత ఉంటే సేఫ్.!

 గర్భధారణలో ఉన్నప్పుడు మహిళల బిపి ఎంత ఉండాలి..ఎంత ఉంటే సేఫ్.!

గర్భధారణ అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైన, మధురమైన కాలం. ఈ సమయంలో తల్లి ఆరోగ్యం ఎంత బాగుంటే, కడుపులో ఎదుగుతున్న బిడ్డ కూడా అంత ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో జరిగే ప్రతి చిన్న మార్పునూ గమనిస్తూ ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా రక్తపోటు అంటే బిపిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయించుకోవడం ఎంతో ముఖ్యం. బిపి పెరిగినా లేదా బాగా తగ్గిపోయినా తల్లికి, బిడ్డకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే అసలు గర్భధారణ సమయంలో బిపి ఎంత ఉండాలి,  బిపి ఏ స్థాయిలో ఉంటే  సురక్షితం? గర్భం దాల్చాలనే ప్రతి మహిళ,  గర్బంతో ఉన్న ప్రతి మహిళ తెలుసుకోవాలి. ఆ విషయాలేంటో తెలుసుకుంటే..

బిపి స్థాయి..

సాధారణంగా ఏ మనిషికైనా సరైన బిపి స్థాయి 120/80 గా ఉంటుంది. గర్భిణీలలో కూడా ఈ కొలత లేదా దీనికంటే కాస్త తక్కువగా ఉండటం  సురక్షితమైనదిగా భావిస్తారు. సింపుల్ గా  చెప్పాలంటే పైన ఉండే సంఖ్య 120, కింద ఉండే సంఖ్య 80 ఉంటే బిపి నార్మల్ గా ఉన్నట్లు లెక్క. పైన ఉండే సంఖ్య 110 నుంచి 120 మధ్య, కింద ఉండే సంఖ్య 70 నుంచి 80 మధ్య ఉంటే తల్లికి ఎలాంటి ప్రమాదం ఉండదు. బిడ్డకు రక్త ప్రసరణ , ఆక్సిజన్ సరఫరా చాలా చక్కగా జరుగుతాయి.

అధిక బిపి..

ఒకవేళ రక్తపోటు 140/90 లేదా అంతకంటే ఎక్కువ నమోదు అయితే దానిని అధిక రక్తపోటుగా పరిగణిస్తారు. గర్భం దాల్చిన ఇరవై వారాల తర్వాత బిపి ఎక్కువగా ఉంటే డాక్టర్ల సలహా ప్రకారం జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అధిక బిపి వల్ల కడుపులో బిడ్డ ఎదుగుదల మందగించడం, కాళ్ళు చేతులు వాపులు రావడం , ఉమ్మనీరు తగ్గడం వంటి ఇబ్బందులు రావచ్చు. అలాగే కొందరిలో బిపి 90/60 కంటే తక్కువగా పడిపోవచ్చు. దీనివల్ల కళ్ళు తిరగడం, నీరసం , మూర్ఛ వచ్చినట్లు అనిపిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా బిపి చెక్ చేయించుకోవడం చాలా అవసరం.

గర్భవతులు బిపి కంట్రోల్ కోసం ఏం చేయాలి?

గర్భధారణ సమయంలో బిపిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. ఆహారంలో ఉప్పు పరిమాణాన్ని పరిమితంగా ఉంచడం చాలా మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉంటూ, తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల బిపి హెచ్చుతగ్గులకు లోనుకాకుండా ఉంటుంది. వైద్యులు సూచించిన విధంగా రోజువారీ నడక లేదా చిన్నపాటి వ్యాయామాలు చేయడం, శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల రక్తపోటును సేఫ్  స్థాయిలో ఉంచుకోవచ్చు. ఏ చిన్న తేడా అనిపించినా సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

                        *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.