Home » Fashion » పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు సువాసన రావాలంటే.. శరీరంలో ఇక్కడ రాసుకోండి!
పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు సువాసన రావాలంటే.. శరీరంలో ఇక్కడ రాసుకోండి!

చక్కగా ముస్తాబయ్యి ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ అప్లై చేసుకోవడం నేటికాలంలో కామన్ అయిపోయింది. ఇక చెమటతో ఇబ్బంది పడేవారు ఎలాగో తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ వాడుతుంటారు. అయితే.. ఈ వేసవికాలంలో వచ్చే చెమట కారణంగా పెర్ఫ్యూమ్ వాసన తొందరగా పోతుంది. కానీ ఇలా పెర్ఫ్యూమ్ స్మెల్ తొందరగా పోకుండా.. ఎక్కువ సేపు నిలిచి ఉండటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. పెర్ప్యూన్ ను అప్లై చేసుకునే విధానమే అది తొందరగా వాసన కోల్పోవడానికి కారణం అవుతుంది. ఎంత ఖరీదైన పెర్ఫ్యూమ్ వాడినా అది బూడిదలో పోసిన పన్నీరవుతుంది. పెర్ఫ్యూమ్ వాసన ఎక్కువ సేపు సువాసన వెదజల్లుతూ ఉండాలంటే శరీరంలో ఎక్కడ అప్లై చేయాలో ఫ్యాషన్ నిపుణులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే..
బట్టలమీద కాదు..
చాలా మందికి బట్టలకు పెర్ఫ్యూమ్ రాసుకునే అలవాటు ఉంటుంది, కానీ ఈ పద్ధతి సరైనది కాదు. బట్టలకు పెర్ఫ్యూమ్ రాసుకుంటే దాని సువాసన నిలవదు. అంతేకాకుండా కొన్ని పెర్ఫ్యూమ్‌లు బట్టలపై మరకలుగా మారతాయి. అందువల్ల పెర్ఫ్యూమ్‌ను నేరుగా చర్మానికి, ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రత కొద్దిగా వెచ్చగా ఉండే ప్రదేశాలలో రాసుకోవాలి. పెర్ఫ్యూమ్ గురించి మంచి అవగాహన ఉన్న ఫ్యాషన్ నిపుణులు మాత్రం పెర్ప్యూమ్ ను మణికట్టుకు రాసుకోవడం చాలా మంచి పద్దతి అని, ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి అని చెబుతున్నారు. ఇక్కడ నరాలు చర్మానికి దగ్గరగా ఉంటాయి, ఇది కొద్దిగా వెచ్చదనాన్ని నిలుపుకొని, సువాసన ఎక్కువసేపు నిలిచి ఉండేలా చేస్తుంది. మెడకు , చెవుల వెనుక పెర్ఫ్యూమ్ రాసుకోవడం కూడా సరైన విధానం.
నాడీ ప్రదేశాలలో పెర్ఫ్యూమ్..
ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఛాతీకి కొద్దిగా పెర్ఫ్యూమ్ రాసుకోవడం వల్ల దాని సువాసన పైకి వ్యాపించి, రోజంతా చాలా ఆహ్లాదకరమైన పరిమళాన్ని అందిస్తుంది. ఎక్కువ సేపు తాజాగా ఉండాలనుకునే వారికి ఇది చాలా మంచి ఛాయిస్. ఈ ప్రాంతాలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉంటుంది,, మోచేతుల లోపలి భాగం, మోకాళ్ల వెనుక భాగం, చీలమండల వంటి ప్రదేశాలలో పెర్ఫ్యూమ్ బాగా అప్లై అయ్యి, దాని సువాసనను నెమ్మదిగా విడుదల చేస్తూ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. చాలా మంది పెర్ఫ్యూమ్ రాసుకున్న తర్వాత దానిని రుద్దుకుంటారు, కానీ ఇది కరెక్ట్ కాదు.. ఇలా చేయడం వల్ల పెర్ఫ్యూమ్ సువాసన విచ్ఛిన్నమై దాని ప్రభావం తగ్గుతుంది. పొట్ట చుట్టూ పెర్ఫ్యూమ్ రాసుకోవడం చాలా మందికి తెలియదు, కానీ ఇది కూడా సువాసన ఎక్కువసేపు నిలిచి ఉండటానికి సహాయపడుతుంది. శరీర వేడి ఈ ప్రాంతంలో నిలిచి ఉండి, పెర్ఫ్యూమ్ ప్రభావాన్ని మరింత పెంచుతుంది.
పెర్ఫ్యూమ్ ఎక్కడ పూయకూడదంటే..
అధికంగా చెమట పట్టే ప్రదేశాలు లేదా బాగా పొడిబారిన చర్మం వంటి కొన్ని ప్రాంతాలలో పెర్ఫ్యూమ్‌ను వాడకూడదు. చెమట సువాసనను త్వరగా ఆవిరి చేస్తుంది, అదే సమయంలో పొడి చర్మంపై పెర్ఫ్యూమ్ ఎక్కువసేపు నిలవదు. అందువల్ల పెర్ఫ్యూమ్ వేసుకునే ముందు తేలికపాటి మాయిశ్చరైజర్‌ను రాసుకోవడం చాలా మంచిది. సరైన ప్రదేశంలో, సరైన పద్ధతిలో రాసుకున్నప్పుడు మాత్రమే దాని సువాసన ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. దీని వల్ల రోజంతా రిఫ్రెషింగ్ గా ఉండవచ్చు.
*రూపశ్రీ.
