Home » Fashion » వేసవి పెళ్లిళ్లలో చెమటకు ఇలా చెక్ పెట్టండి!
వేసవి పెళ్లిళ్లలో చెమటకు ఇలా చెక్ పెట్టండి!

పెళ్లి అంటే చాలా గొప్ప వేడుక. భారతీయులు తమ జీవితంలో అత్యంత వైభవంగా పెళ్లి చేసుకుంటారు. పెళ్లిలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఈవెంట్ కు ప్రత్యేకంగా తయారవ్వాలని అనుకుంటారు. అమ్మాయిలు అయితే పెళ్లి అందం, హడావిడి మొత్తం తమ చుట్టూ ఉండాలని కోరుకుంటారు. కానీ వేసవి కాలం దీనికి చాలా పరీక్షలు పెడుతుంది. ఎంత బాగా ముస్తాబైనా సరే.. విపరీతమైన వేడి కారణంగా ఆ అలంకరణ అంతా పాడైపోతూ ఉంటుంది. వేసవి చెమట అసలు ఇబ్బంది పెట్టకుండా ఉండేలా తయారవ్వడం ఒకటే దీనికి మార్గం. అసలు వేసవి వేడి, చెమట ఇబ్బంది పెట్టకుండా పెళ్లిళ్లకు రెడీ కావడం ఎలా? ముఖ్యంగా పెళ్లికి హాజరయ్యే అతిథులు, బంధువులను పక్కన పెడితే.. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుకు మాత్రం ఇది పెద్ద విషమ పరీక్షే.. కానీ వేసవి ఇబ్బంది పెట్టకుండా తయారు అవ్వవచ్చు. అదెలాగో తెలుసుకుంటే..
సరైన దుస్తుల ఎంపిక..
వేసవిలో, ఆర్గాంజా, షిఫాన్ , జార్జెట్ వంటి తేలికైన , గాలి ప్రసరించే వస్త్రాలను ఎంచుకోవాలి. బరువైన వెల్వెట్ లేదా మందపాటి పట్టును వాడకూడదు.
పీచ్, పింక్, మింట్ గ్రీన్ , లావెండర్ వంటి లేత రంగులు వేసవి వివాహానికి చాలా బాగుంటాయి. ఇవి ట్రెండీగా కనిపించడమే కాకుండా, సరికొత్త లుక్ ను కూడా అందిస్తాయి.
మేకప్ ఇలా ఉండాలి..
వేసవిలో భారీ మేకప్ త్వరగా కరిగిపోతుంది, కాబట్టి వాటర్‌ప్రూఫ్ , మ్యాట్ ప్రోడక్ట్ ను వాడాలి. బేస్ లైట్ ఉంచి, నేచురల్ లైటింగ్ పై దృష్టి పెట్టాలి. మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉండాలంటే, సెట్టింగ్ స్ప్రేను తప్పకుండా వాడాలి.
జ్యువెలరీ, హెయిర్ స్టైల్..
బరువైన ఆభరణాలకు బదులుగా, తేలికైన , సొగసైన వాటిని ఎంచుకోవాలి. వేడిని తగ్గించడానికి జుట్టును బన్‌గా లేదా జడగా వేసుకోవాలి. జుట్టును వదిలేస్తే ఉక్కపోత ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. చెమట కూడా బాగా పడుతుంది. కాబట్టి జుట్టు వదులుగా ఉన్న హెయిర్ స్టైల్ నివారించాలి. తాజా పువ్వులను ఉపయోగించడం వల్ల లుక్ మరింత అందంగా మారుతుంది.
ఈ టిప్స్ చాలా హెల్ప్ అవుతాయి..
బ్లాటింగ్ పేపర్లు , ఫేస్ మిస్ట్ తీసుకువెళ్ళాలి. తేలికైన , చల్లదనాన్నిచ్చే పెర్ఫ్యూమ్ వాడాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. డీహేడ్రేషన్ కు గురికాకుండా నీళ్ళు తాగుతూ ఉండాలి. కంఫర్ట్ గా ఉండే పాదరక్షలను ఎంచుకోవాలి.
స్కిన్ కేర్, అట్రాక్షన్ లుక్..
పెళ్లికి ముందు డైలీ స్కిన్ కేర్ రొటీన్ ను పాటించాలి. తప్పకుండా సన్‌స్క్రీన్ వాడాలి. సహజమైన ఫేస్ ప్యాక్‌లను వాడాలి. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.
*రూపశ్రీ.

