Home » Beauty Care » పెర్ఫ్యూమ్ లేకుండానే శరీరం నుండి రోజంతా మంచి సువాస వెదజల్లాలంటే..
పెర్ఫ్యూమ్ లేకుండానే శరీరం నుండి రోజంతా మంచి సువాస వెదజల్లాలంటే..

శరీరం నుండి మంచి వాసన రావడం గురించి చాలామంది బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. శరీరం నుండి వచ్చే ఆహ్లాదకరమైన సువాసన ఇతరులను ఆకర్షించడానికి అని కొందరు అనుకుంటారు, చెమట సమస్య నుండి రక్షణ కోసం అని మరికొందరు అనుకుంటారు. కానీ నిజానికి శరీరం మంచి సువాసనతో ఉంటే వారి మెదడు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఆహ్లాదకరంగా ఉంటుంది. చేసే పనుల్లో ఏకాగ్రత మెరుగవుతుంది. చురుగ్గా ఉండగలుగుతారు. ఆ తరువాతే ఇతరులను ఆకర్షించడం, ఇతరులు మాట్లాడాలి అనిపించేలా ఉండటం వంటివి ఉంటాయి. శరీరం మంచి సువాసనతో ఉండటం అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదని, అది మనిషి అంతర్గత ఆరోగ్యానికి సంబంధించినది కూడా అని ఆయుర్వేదం చెబుతుంది. పెర్ఫ్యూమ్ లు ఏమీ వాడకుండా శరీరం సహజంగా సువాసన వెదజల్లాలంటే ఏం చేయాలో తెలుసుకుంటే..
సైన్స్ ఏం చెబుతోంది?
చాలామంది చెమట కారణంగా శరీరం నుండి దుర్వాసన వస్తుందని అనుకుంటారు. కానీ నిజానికి చెమటకు ఎలాంటి వాసన ఉండదు. చర్మంపై ఉండే బ్యాక్టీరియానే దానికి వాసనను ఇస్తుందని సైన్స్ ప్రూవ్ చేస్తోంది. అందుకే సహజంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్రహ్మ ముహూర్తం..
సూర్యోదయానికి ముందే నిద్రలేవడం శరీరంలోని వాత దోషాన్ని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. నిద్రలేచిన వెంటనే ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరం నుండి విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
దుర్వాసన తొలగించడం..
ప్రతి ఉదయం వెండి లేదా రాగి టంగ్ క్లీనర్ తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. రాగి టంగ్ క్లీనర్ బ్యాక్టీరియాను ఎక్కువసేపు నాలుకకు దూరంగా ఉంచి దుర్వాసనను నివారిస్తుంది. దీని తరువాత, ఒక చెంచా నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెను నోటిలో వేసుకుని, మౌత్‌వాష్ లాగా కొంతసేపు పుక్కిలించి, ఆపై ఉమ్మివేయాలి. ఇది నోటి మూలల్లో దాగి ఉన్న బ్యాక్టీరియాను తొలగిస్తుంది.
ఆయిల్ మసాజ్..
ప్రతిరోజూ స్నానానికి ముందు నువ్వుల నూనె లేదా చందనం నూనెతో శరీరానికి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మ రంధ్రాలు బాగా తెరుచుకుని మురికి బయటకు వస్తుంది. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడి, స్వేద గ్రంథులు సమతుల్యంగా పనిచేయగలుగుతాయి.
శుభ్రమైన దుస్తులు..
ప్రతిరోజూ శుభ్రమైన, ఉతికిన , ఎండలో ఆరబెట్టిన దుస్తులను ధరించాలి. కాటన్ దుస్తులు అయితే చాలామంచిది. నైలాన్ లేదా పాలిస్టర్ వంటి కృత్రిమ ఫాబ్రిక్ చర్మానికి గాలి తగలకుండా అడ్డుకుంటాయి , చెమట నిలిచిపోయేలా చేస్తాయి, దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది, శరీర దుర్వాసనకు దారితీస్తుంది.
శరీరం సువాసన రావాలంటే..
ఆయుర్వేదంలో స్నానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. రసాయనాలు కలిగిన బాడీ వాష్‌లను ఉపయోగించడానికి బదులుగా, సహజ పదార్థాలతో స్నానం చేయడం మంచిది. ఎందుకంటే ఇది చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, చాలా కాలం పాటు తాజాగా సువాసన వచ్చేలా చేస్తుంది.
సహజ సువాసన కోసం వీటిని వాడాలి..
చందనం శరీర వేడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది చర్మపు దద్దుర్లు , వాపులను కూడా నయం చేసి, చర్మానికి అద్భుతమైన సువాసనను అందిస్తుంది. ప్రతిరోజూ స్నానపు నీటిలో ఒక టీస్పూన్ ఎరుపు లేదా పసుపు చందనాన్ని కలపాలి.
గసగసాలకు సహజంగా చల్లదనాన్నిచ్చే గుణాలు ఉన్నాయి. స్నానపు నీటిలో గసగసాల వేర్లను రాత్రంతా నానబెట్టాలి. ఉదయం ఈ నీటితో స్నానం చేయాలి. ఇది అధిక చెమట నుండి ఉపశమనం కలిగించి, శరీరాన్ని తాజాగా, సువాసనగా ఉంచుతుంది.
వేప , తులసి చర్మ దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి. వేప , తులసి ఆకులను నీటిలో 10 నుండి 15 నిమిషాల పాటు ఉడకబెట్టి, అవి చల్లారిన తర్వాత స్నానపు నీటిలో కలపాలి. ఇది చర్మ దుర్వాసనను తొలగించడానికి సహాయపడుతుంది.
గులాబీ రేకులు , కర్పూరం చర్మాన్ని శుభ్రపరిచి, చాలా సేపటి వరకు శక్తివంతంగా ఉంచుతాయి. స్నానపు నీటిలో తాజా గులాబీ రేకులను , చిటికెడు కర్పూరాన్ని కలపాలి. కర్పూరం చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది, గులాబీ పునరుత్తేజాన్ని అందిస్తుంది.
రెండు లేదా మూడు దంచిన యాలకులు, లవంగాలను నీటిలో మరిగించి, ఆ నీటిని స్నానపు నీటిలో కలపాలి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది , శరీరానికి తాజా సువాసనను అందిస్తుంది.
పటిక..
పటిక ఒక అద్భుతమైన పదార్థం. దీనికి వాసన లేనప్పటికీ, చర్మం యొక్క pH ను సమతుల్యం చేసే గుణాలు దీనికి ఉన్నాయి. దీనిని చంకలకు రుద్దడం వల్ల చర్మం యొక్క pH సమతుల్యం అయ్యి, దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా పెరుగుదలను నివారిస్తుంది. ఇది కాకుండా, షియా బటర్, తేనె మైనం, బేకింగ్ సోడా లేదా కొబ్బరి నూనె వంటి పదార్థాలు కలిగిన అల్యూమినియం లేని డియోడరెంట్లను కూడా ఉపయోగించవచ్చు. ఇవి మార్కెట్లో సులభంగా లభిస్తాయి.
*రూపశ్రీ.
