Home » Beauty Care » ముఖాన్ని గాజు బొమ్మలా మెరిపించే కొరియన్ స్కిన్ సీక్రెట్ క్రీమ్..
.webp)
బ్యూటీ ప్రపంచంలో ఎన్ని రకాల స్కిన్ కేర్ పద్ధతులు వచ్చినా.. కొరియన్ స్కిన్ కు ఉండే ఫ్యాన్ బేస్ వేరు. కొరియన్ అమ్మాయిల చర్మం లా గాజు బొమ్మలా మెరిసిపోవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే కొరియన్ స్కిన్ రావాలంటే మార్కెట్లో ఉత్పత్తుల కంటే ఇంటి చిట్కాలే చక్కగా సహాయపడతాయి. రూపాయి ఖర్చు లేకుండా, రసాయనాల బారిన పడకుండా కొరియన్ల లాంటి గ్లాస్ స్కిన్ ను, మెరిసే ఛాయను సొంతం చేసుకోవడానికి ఇంట్లోనే తయారు చేసుకునే స్కిన్ క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా ఈ చిట్కాలను పాటించడం వల్ల ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, పింపుల్స్, కంటి కింద నలుపు తగ్గడమే కాకుండా చర్మం ఎంతో మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
ఈ క్రీమ్ తయారీకి కావలసిన పదార్థాలు ఏమిటి? ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలి? వివరంగా తెలుసుకుంటే ..
కావలసిన పదార్థాలు..
బియ్యం
శనగపప్పు..
వీటిని ఒకసారి మాత్రమే శుభ్రంగా కడగాలి. ఎక్కువసార్లు కడగడం వల్ల అందులోని పోషకాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. కడిగిన తరువాత అర గ్లాసు నీళ్లు పోసి సుమారు నాలుగు గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.
బాగా నానిన బియ్యం , శనగపప్పు మిశ్రమాన్ని అదే నీళ్లతో సహా మిక్సీ జార్ లోకి తీసుకుని ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక ఫిల్టర్ సహాయంతో వడకట్టాలి. వడకట్టగా పైన మిగిలిన రఫ్ మిశ్రమాన్ని పారవేయకుండా ఒక బౌల్ లో పక్కన పెట్టుకోవాలి. ఇది తర్వాత స్క్రబ్బింగ్ కోసం ఉపయోగపడుతుంది.
వడకట్టిన బియ్యం, శనగపప్పు లిక్విడ్ మిశ్రమాన్ని నేరుగా కాకుండా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో వేడి చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఒక పాత్రలో నీళ్లు పోసి స్టవ్ పై వేడి చేయాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత, ఈ లిక్విడ్ మిశ్రమం ఉన్న స్టీల్ బౌల్ ను ఆ నీళ్లలో ఉంచి సన్నని మంటపై వేడి చేయాలి. ఈ ప్రక్రియలో గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టే ప్రమాదం ఉంది. మిశ్రమం చిక్కబడి క్రీమ్ రూపంలోకి మారగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత దానిని మరొకసారి మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టాలి. దీనివల్ల మార్కెట్లో దొరికే క్రీమ్‌ల మాదిరిగా ఎంతో మృదువైన టెక్చర్ వస్తుంది. ఆ తర్వాత అందులో ఒక స్పూన్ అలోవెరా జెల్ వేసి మళ్లీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చివరిగా ఈ మిశ్రమానికి ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ ఆయిల్ , ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి బాగా మిక్స్ చేయాలి. దీంతో కొరియన్ సీక్రెట్ ఫేస్ క్రీమ్ సిద్ధమవుతుంది. ఈ క్రీమ్‌ను గాలి చొరబడని సీసాలో భద్రపరుచుకుని ఫ్రిజ్‌లో ఉంచితే నెల రోజుల పాటు పాడుకాకుండా వాడుకోవచ్చు.
ఈ క్రీమ్ మెరుగైన ఫలితాలు ఇవ్వడానికి ముఖాన్ని ముందుగా స్క్రబ్బింగ్ చేసుకోవడం చాలా మంచిది. వడకట్టగా మిగిలిన బియ్యం, శనగపప్పు నూక మిశ్రమంలో ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ నిమ్మరసం కలిపి స్క్రబ్ తయారుచేసుకోవాలి. ఈ స్క్రబ్‌ను ముఖానికి రాసి పది నిమిషాల పాటు మెల్లగా మసాజ్ చేయడం వల్ల చర్మంపై ఉన్న జిడ్డు, మురికి, మృతకణాలు పూర్తిగా తొలగిపోతాయి. తర్వాత సాధారణ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.
స్క్రబ్బింగ్ పూర్తయిన తర్వాత తయారుచేసి పెట్టుకున్న కొరియన్ ఫేస్ క్రీమ్‌ను ముఖానికి, మెడకు లేదా చేతులకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు చర్మంలోకి ఇంకేలా మసాజ్ చేయాలి. ఈ క్రీమ్‌ను రాత్రంతా అలాగే ఉంచుకుని ఉదయాన్నే కడుక్కోవచ్చు లేదా కనీసం ఒక గంట సేపు ఉంచి సాధారణ నీటితో శుభ్రం చేసుకోవచ్చు. ప్రతిరోజూ లేదా వారానికి కొన్నిసార్లు దీన్ని పాటించడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారి సహజమైన గ్లో లభిస్తుంది.
*రూపశ్రీ.
