Home » Beauty Care » గుమ్మడి గింజల నూనె ఇలా తయారు చేసుకుని వాడండి.. జుట్టు పెరగడాన్ని ఎవ్వరూ ఆపలేరు..!
.webp)
జుట్టు ఒత్తుగా, అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అయితే నేటి కాలంలో బిజీ లైజ్, అధిక ఒత్తిడి, సరైన హెయిర్ కేర్ రొటీన్ పాటించకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల జుట్టు పెరుగుదల దెబ్బతింటుంది. జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఈ కారణంగా నేటికాలంలో చాలామంది అమ్మాయిలు జుట్టు పెరుగుదుల కోసం, జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో మార్కెట్ ఉత్పత్తులు వాడటం, ఇంటి చిట్కాలు ప్రయత్నించడం చేస్తుంటారు. అయితే గుమ్మడి గింజల నూనె జుట్టు సమస్యలకు చెక్ పెడుతుందని అంటున్నారు. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించి, జుట్టును మూలాల నుండి బలోపేతం చేయడానికి సహాయపడుతుందట. అసలు గుమ్మడి గింజల నూనె ఎలా తయారు చేయాలి? గుమ్మడి గింజల నూనెను ఎలా వాడాలి? పూర్తీగా తెలుసుకుంటే..
జుట్టు పెరుగుదల కోసం గుమ్మడి గింజల నూనె..
గుమ్మడి గింజలలో యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్ల వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ ఇ , జింక్ పుష్కలంగా ఉంటాయి. ఈ గింజలు జుట్టు రాలడాన్ని నివారించడంలో, జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో , జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో పాత్ర పోషిస్తాయి. ఇంట్లోనే గుమ్మడి గింజల నూనెను ఎలా తయారు చేసుకోవచ్చు.
గుమ్మడి గింజల నూనె తయారీకి కావలసిన పదార్థాలు..
1/2 కప్పు గుమ్మడికాయ గింజలు
1 కప్పు కొబ్బరి నూనె
1 టీస్పూన్ కలోంజి సీడ్స్..
తయారు చేసే విధానం..
గుమ్మడికాయ గింజల నూనె తయారు చేయడానికి, ముందుగా వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. తర్వాత, ఈ విత్తనాలను ఒక పళ్ళెంలో పరచి, తేమ పోయేలా ఆరబెట్టాలి.
ఇప్పుడు ఈ గింజలను ఒక బాణలిలో వేసి వేయించుకోవాలి. అయితే ఎక్కువ మంట మీద వేయించకుండా జాగ్రత్త వహించాలి. ఎక్కువ మంట మీద వేయిస్తే వాటిలో పోషకాలు నశిస్తాయి. ఈ విత్తనాలను చల్లారడానికి ఒక పళ్ళెంలో ఉంచాలి.
గుమ్మడి విత్తనాలు చల్లారిన తర్వాత, మిక్సర్లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. తరువాతి 1 కప్పు కొబ్బరి నూనె వేసి మధ్యస్థ మంట మీద వేడి చేయాలి.
నూనె కొద్దిగా వేడెక్కగానే, అందులో దంచిన గుమ్మడికాయ గింజలను వేయాలి. అలాగే అందులో 1 టీస్పూన్ కలోంజి సీడ్స్ కూడా కలపాలి. .
నూనెను కనీసం 15-20 నిమిషాల పాటు సన్నని మంట మీద వేడి చేయాలి. గింజలు గిన్నెకు అంటుకోకుండా ఉండేందుకు, వాటిని కలుపుతూ ఉండాలి. తర్వాత గ్యాస్ ఆపివేసి, నూనెను చల్లారనివ్వాలి.
శుభ్రమైన కాటన్ గుడ్డను ఉపయోగించి నూనెను పాత్రలోకి వడకట్టండి. ఇప్పుడు ఈ నూనెను ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి, గుమ్మడికాయ గింజలతో తయారు చేసిన నూనె సిద్ధమైనట్టే.
ఎలా ఉపయోగించాలి?
ఈ నూనెను వారానికి 2-3 సార్లు వాడవచ్చు. తలస్నానం చేయడానికి ముందు, ఒక గిన్నెలో కొద్దిగా గోరువెచ్చని నూనె తీసుకుని, దానితో తలకు 5 నిమిషాల పాటు మర్దనా చేసుకోవాలి. ఒక గంట తర్వాత, తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు పెరుగుదుల మెల్లిగా పుంజుకుంటుంది.
*రూపశ్రీ.

