Home » Beauty Care » ఇది పాటిస్తేఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు!

ఇది పాటిస్తేఎంత వయసు పెరిగినా యవ్వనంగా కనిపిస్తారు!

వయసు పెరిగే కొద్దీ చర్మంలో మార్పులు రావడం సహజం. ఈ మార్పులను అమ్మాయిలు అంత సులువుగా అంగీకరించలేరు. అందుకే యవ్వనంగా కనిపించడం కోసం, చర్మం మీద ముడతలు, గీతలు కనిపించకుండా ఉండటం కోసం చాలా రకాల చిట్కాలు, క్రీములు, బ్యూటీ ట్రీట్మెంట్లు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే సరైన జీవనశైలి, సరైన చర్మ సంరక్షణ పద్ధతులు పాటిస్తే వయసు పెరిగినా కూడా ముఖంలో ఆకర్షణీయమైన మెరుపును, కాంతిని కాపాడుకోవచ్చు. చర్మం యవ్వనంగా, ఆరోగ్యంగా కనిపించడానికి యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ గైడ్ ఎంతగానో సహాయపడుతుంది. అసలు యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ గైడ్ లో ఏముంటుంది? దీన్నెలా అనుసరించాలి? ఇది చేసే మ్యాజిక్ ఏమిటి వివరంగా తెలుసుకుంటే..

యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ గైడ్..

యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ గైడ్ అంటే చర్మంపై వయసు రీత్యా వచ్చే మార్పులైన ముడతలు, సన్నని గీతలు, మచ్చలు , చర్మం సాగిపోవడం వంటి సమస్యలను అరికట్టి, చర్మాన్ని యవ్వనంగా , ఆరోగ్యంగా ఉంచడానికి పాటించాల్సిన చిట్కాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించే  మార్గదర్శకం. ఇందులో చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, చర్మం మీద ముడుతలు, గీతలు తగ్గించడానికి ఎన్నో మార్గాలు అవలంబిస్తారు.

క్లెన్సింగ్..

యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ లో  అతి ముఖ్యమైన మొదటి స్టెప్ చర్మాన్ని ప్రతిరోజూ శుభ్రపరచడం. రోజంతా చర్మంపై చేరే ధూళి, కాలుష్యం, జిడ్డును తొలగించడానికి మృదువైన క్లెన్సర్ ఉపయోగించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్నాక, చర్మానికి తగినంత తేమను అందించే మాయిశ్చరైజర్ రాయడం తప్పనిసరి. చర్మంలో తేమ తగ్గడం వల్లే సన్నని గీతలు, ముడతలు త్వరగా కనిపిస్తాయి. కాబట్టి ఉదయం,  రాత్రి వేళల్లో మాయిశ్చరైజర్ వాడటం అలవాటు చేసుకోవాలి.

సన్ స్క్రీన్..

తక్కువ వయసులోనే ముడుతలు రావడం లేదా చర్మానికి ఎక్కువగా ముడుతలు  రావడానికి ప్రధాన కారణం సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు. ఎండ ఎక్కువగా లేని రోజుల్లో కూడా ఈ కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ప్రతిరోజూ ఉదయం నాణ్యమైన సన్ స్క్రీన్ ఉపయోగించడం చాలా ముఖ్యం. సన్ స్క్రీన్ చర్మాన్ని ఎండ దెబ్బ నుండి కాపాడటమే కాకుండా మచ్చలు, ముడతలు రాకుండా నిరోధిస్తుంది.

ఎక్స్‌ఫోలియేషన్..

చర్మ కణాలు వాటి జీవితకాలం ముగియగానే నశిస్తుంటాయి. ఈ మృతకణాలను తొలగించడానికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు మృదువైన ఎక్స్‌ఫోలియేషన్ చేయాలి. ఇది చర్మంపై ఉండే పాత కణాలను తొలగించి, కొత్త కణాలు పైకి రావడానికి సహాయపడుతుంది. దీనివల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

నైట్ స్కిన్ కేర్..

రాత్రి వేళల్లో చర్మం తనను తాను రిపేర్ చేసుకుంటుంది. అందుకే నైట్ స్కిన్ కేర్ రొటీన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు విటమిన్ సి, హైలురోనిక్ యాసిడ్ లేదా రెటినాల్ కలిగిన సీరమ్‌లను వాడటం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొల్లాజెన్ అనేది చర్మానికి సాగే గుణాన్ని, బిగుతును ఇచ్చే ముఖ్యమైన ప్రొటీన్. సీరమ్‌లు చర్మం లోపలి పొరల్లోకి వెళ్లి దెబ్బతిన్న కణాలను బాగు చేస్తాయి.

నీరు..

కేవలం బయట రాసే క్రీములు మాత్రమే కాకుండా, లోపలి నుండి చర్మానికి పోషణ అందించడం అత్యంత అవసరం. రోజూ తగినంత నీరు తాగుతుండాలి. నీరు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి యవ్వనపు మెరుపును ఇస్తుంది. 

ఆహారం..

ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరలు, బాదం, వాల్ నట్స్ వంటి పోషకాహారాన్ని చేర్చుకోవాలి. విటమిన్ సి, ఈ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఆహారం చర్మ కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ ఇస్తుంది.

మానసిక ఆరోగ్యం..

మానసిక ఒత్తిడి , సరిపడా నిద్ర లేకపోవడం వల్ల ముఖంపై వయసు త్వరగా కనిపిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ప్రతిరోజూ ఏడు నుండి ఎనిమిది గంటల గాఢ నిద్ర అవసరం. నిద్రపోయే సమయంలోనే చర్మం కొత్త కణాలను తయారు చేసుకుంటుంది. 

యోగా.. ధ్యానం..

 యోగా, ధ్యానం లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ  పెరిగి చర్మానికి సహజమైన కాంతి వస్తుంది.

చెడు అలవాట్లు వద్దు..

ధూమపానం, మద్యం సేవించడం వంటి అలవాట్లు చర్మంలోని కొల్లాజెన్‌ను వేగంగా నాశనం చేస్తాయి. వీటివల్ల చర్మం సాగిపోయి, త్వరగా ముడతలు పడుతుంది. కాబట్టి ఈ అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

గుర్తుంచుకోవాల్సిన విషయం..

యాంటీ ఏజింగ్ స్కిన్ కేర్ అనేది ఒక రోజులో వచ్చే మార్పు కాదు. క్రమం తప్పకుండా సరైన పద్ధతులు పాటిస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం , జీవనశైలిని అలవర్చుకుంటే ఏ వయసులోనైనా చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

                         *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.