Home » Baby Care » పసిపాపల వ్యాక్సిన్ చార్ట్.. ఏ వయసులో ఏ టీకా వేయించాలో తెలుసా.!
పసిపాపల వ్యాక్సిన్ చార్ట్.. ఏ వయసులో ఏ టీకా వేయించాలో తెలుసా.!

ఒక మహిళ గర్భవతి అయ్యాక ఆమె ప్రసవించే బిడ్డ కోసం కేవలం ఆమె మాత్రమే కాకుండా ఇంటిల్లిపాది ఎంతో ఆతురతగా ఎదురుచూస్తూ ఉంటారు. బిడ్డ ప్రసవించిన తర్వాత.. వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యం. పసిపిల్లల ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు , రక్షణకు సరైన సమయంలో టీకాలు వేయించడం చాలా ముఖ్యం. బిడ్డ జన్మించినప్పటి నుండి నిర్దిష్ట వయస్సులలో వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు వ్యాక్సిన్లు ఎంతగానో దోహదపడతాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచి, ఎన్నో అంటువ్యాధుల నుండి పసిబిడ్డలను కాపాడుకోవడానికి ప్రభుత్వం , వైద్య నిపుణులు సూచించిన టీకాలను వేయించడం ప్రతి తల్లిదండ్రుల బాధ్యత. బిడ్డ ఏ వయసులో ఉన్నప్పుడు ఏ టీకా వేయించాలో, వాటి ప్రాముఖ్యత ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
బిడ్డ పుట్టిన వెంటనే..
నవజాత శిశువు జన్మించిన వెంటనే వేయించాల్సిన టీకాలు చాలా ప్రాధాన్యమైనవి. బిడ్డ పుట్టిన 24 గంటలలోపు క్షయ వ్యాధి నివారణకు బీసీజీ టీకాను వేయించాలి. దీనితో పాటు పోలియో రక్షణ కోసం ఓపీవీ జీరో డోస్, కాలేయ సంబంధిత సమస్యల నివారణకు హెపటైటిస్ బి మొదటి డోస్ ఇవ్వాలి. ఈ ప్రాథమిక టీకాలు నవజాత శిశువు శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థకు బలమైన పునాది వేస్తాయి.
ఆరు వారాల వయసులో..
పసిపిల్లలకు ఆరు వారాల వయసు వచ్చినప్పుడు రెండవ విడత టీకాలు వేయించాలి. ఈ సమయంలో పెంటావాలెంట్ మొదటి డోస్ అందిస్తారు, ఇది డిఫ్తీరియా, ధనుర్వాతం, కోరింత దగ్గు, హెపటైటిస్ బి మరియు హిబ్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ ఇస్తుంది. దీనితో పాటు ఓపీవీ మొదటి డోస్, రోటావైరస్ మొదటి డోస్, నిమోకోకల్ కాంజుగేట్ టీకా మొదటి డోస్ , ఇన్‌యాక్టివేటెడ్ పోలియో టీకా మొదటి డోస్ వేయించాల్సి ఉంటుంది. ఇవి చిన్నపిల్లల్లో వచ్చే తీవ్రమైన విరేచనాలు , నిమోనియా వంటి సమస్యల నుండి కాపాడతాయి.
పది వారాల వయసులో ...
మొదట్లో టీకాలు వేయించిన తర్వాత మళ్ళీ డోసులు అందించాలి. ఇందులో భాగంగా పెంటావాలెంట్ రెండవ డోస్, ఓపీవీ రెండవ డోస్ , రోటావైరస్ రెండవ డోస్ ఇస్తారు. ఈ వయసులో ఇచ్చే డోసులు శిశువులో రోగనిరోధక శక్తిని మరింత బలంగా మారుస్తాయి.
పద్నాలుగు వారాల వయసులో..
పద్నాలుగు వారాలు పూర్తి కాగానే మరికొన్ని ముఖ్యమైన డోసులు వేయించాలి. పెంటావాలెంట్ మూడవ డోస్, ఓపీవీ మూడవ డోస్, రోటావైరస్ మూడవ డోస్‌తో పాటు నిమోకోకల్ కాంజుగేట్ రెండవ డోస్ , ఇన్‌యాక్టివేటెడ్ పోలియో టీకా రెండవ డోస్ ఇస్తారు. మూడవసారి ఇచ్చి ఆ డోస్ వల్ల శిశువుకు మొదట్లో కావాల్సిన ప్రాథమిక వ్యాధి నిరోధక రక్షణ పూర్తవుతుంది.
తొమ్మిది నెలలు నిండిన తర్వాత..
తొమ్మిది నెలల తర్వాత ఇచ్చే టీకాలు చిన్నపిల్లల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ వయసులో తట్టు, రూబెల్లా నివారణకు ఎంఆర్ మొదటి డోస్ వేయిస్తారు. అలాగే నిమోకోకల్ బూస్టర్ డోస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ మొదటి డోస్ మరియు విటమిన్ ఏ మొదటి డోస్ ద్రావణం తాగిస్తారు. ఇవి బిడ్డ నాడీ వ్యవస్థ సమస్యలను , దృష్టి లోపాలను నివారిస్తాయి.
పదిహేను నుండి పద్దెనిమిది నెలల వయసులో..
పదిహేడు నుండి పద్దేనిమిది నెలల వయసులో బూస్టర్ డోసులు వేయించాల్సి ఉంటుంది. ఇందులో డీపీటీ మొదటి బూస్టర్, ఎంఆర్ రెండవ డోస్, జపనీస్ ఎన్సెఫలైటిస్ రెండవ డోస్ , విటమిన్ ఏ రెండవ డోస్ ఉంటాయి. ప్రైవేట్ వైద్యుల సలహా మేరకు ఈ వయసులో చికెన్ పాక్స్, హెపటైటిస్ ఏ, గలిబిలి కాట వ్యాక్సిన్లను కూడా వేయించవచ్చు.
రెండు సంవత్సరాల వయసులో..
టైఫాయిడ్ నివారణకు కాంజుగేట్ టీకా ఇప్పిస్తే మంచిది. ఆ తర్వాత ఐదు సంవత్సరాలు నిండినప్పుడు బిడ్డ స్కూల్ కు వెళ్లే ముందు డీపీటీ రెండవ బూస్టర్ డోస్ , ఓపీవీ బూస్టర్ డోస్ వేయించాలి. ఇది చిన్నతనంలో పొందిన రక్షణను దీర్ఘకాలం పాటు కొనసాగేలా చేస్తుంది.
చివరగా పది మరియు పధ్నాలుగు సంవత్సరాల వయసులో ధనుర్వాతం , డిఫ్తీరియా రక్షణకు టీడీ టీకా ఇవ్వాలి. బిడ్డ పెరుగుదలలో ఏ ఒక్క టీకాను కూడా విస్మరించకుండా సమయానికి వేయించడం ద్వారా మాత్రమే వారిని ప్రమాదకర వ్యాధుల నుండి సురక్షితంగా ఉంచగలము. అయితే టీకా వేయించే ముందు మరియు వేయించిన తర్వాత వైద్యుల సలహాలను పాటించడం మంచిది.
*రూపశ్రీ.
