Home » Baby Care » చిన్న పిల్లలను వదిలిపెట్టే బేబీ కేర్ సెంటర్ల గురించి ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..!
చిన్న పిల్లలను వదిలిపెట్టే బేబీ కేర్ సెంటర్ల గురించి ప్రతి తల్లి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి..!

ఈ రోజుల్లో ఉద్యోగాలు చేసే తల్లులు, ఇతర బాధ్యతల వల్ల ఇంట్లో తగినంత సమయం ఉండలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి మహిళలకు బేబీ కేర్ సెంటర్లు (డే కేర్ సెంటర్లు) చాలా సహాయంగా ఉంటాయి. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, తమ సొంత పనులను పూర్తి చేసుకోవడానికి ఇవి ఒక మంచి మార్గాన్ని ఇస్తాయి. అయితే, ప్రాణంకంటే ఎక్కువగా ప్రేమించే చిన్నపిల్లలను వేరొకరి చేతిలో పెట్టి వెళ్లేటప్పుడు ప్రతి తల్లి మనసులోనూ ఎన్నో ఆందోళనలు, అనుమానాలు కలగడం చాలా సహజం. బిడ్డకు సరైన, సురక్షితమైన వాతావరణాన్ని ఎంచుకోవడానికి, ఒక మంచి బేబీ కేర్ సెంటర్ను ఎంచుకునేటప్పుడు ప్రతి అమ్మ తప్పక గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
పరిశుభ్రత , భద్రత..
పిల్లలు ఉండే చోటు చాలా శుభ్రంగా ఉండాలి. అక్కడ ఉపయోగించే ఆటబొమ్మలు, నేల, దుప్పట్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారో లేదో చూడాలి. అలాగే, అక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో లేదో గమనించాలి. సీసీటీవీ కెమెరాలు ఉంటే, తల్లిదండ్రులు తమ ఫోన్లలో పిల్లలను చూసుకునే సౌకర్యం ఉందో లేదో అడిగి తెలుసుకోవడం మంచిది.
సిబ్బంది ప్రవర్తన , అనుభవం..
బేబీ కేర్ సెంటర్లో పనిచేసే సిబ్బందికి చిన్నపిల్లలను చూసుకోవడంలో తగిన అనుభవం ఉండాలి. వారు పిల్లలతో ఓర్పుగా, దయతో ప్రవర్తిస్తున్నారో లేదో చూడాలి. ఒక్కొక్కరు ఎంతమంది పిల్లలను పర్యవేక్షిస్తున్నారు అనేది చాలా ముఖ్యం. తక్కువ మంది పిల్లలకు ఒక కేర్టేకర్ ఉంటే, పిల్లల మీద బాగా ఫోకస్ గా ఉండగలుగుతారు. అదే ఎక్కువ మంది పిల్లలు ఉండి కేర్ టేకర్ లు తక్కువ ఉంటే కష్టం.
అత్యవసర వైద్య సహాయం..
పిల్లలకు ఉన్నట్టుండి ఆరోగ్యం బాగోలేకపోతే లేదా ఆటల్లో చిన్న గాయాలైతే వెంటనే ప్రాథమిక చికిత్స అందించే ఏర్పాటు అక్కడ ఉందో లేదో తెలుసుకోవాలి. దగ్గరలోని ఆసుపత్రులు లేదా వైద్యులతో ఆ సెంటర్కు అనుబంధం ఉందో లేదో ముందే అడిగి తెలుసుకోవడం చాలా అవసరం.
పోషకాహారం , నిద్ర సమయాలు..
కొన్ని బేబీ కేర్ సెంటర్లలో వారే ఆహారం అందిస్తారు. అలాంటి సమయంలో వారు ఇచ్చే ఆహారం ఎంతవరకు పరిశుభ్రమైనది, పోషక విలువలు ఉన్నది అనేది గమనించాలి. ఒకవేళ ఇంట్లో నుంచే ఆహారం పంపాల్సి వస్తే, దాన్ని సరైన సమయంలో తినిపించేలా చూస్తారా లేదా అనేది స్పష్టం చేసుకోవాలి. అలాగే పిల్లలు విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి ప్రశాంతమైన వాతావరణం ఉందో లేదో చూడాలి.
ఆటలు , కొత్త విషయాలు నేర్పించడం..
పిల్లలు కేవలం కూర్చుని సమయం గడపడం కాకుండా, వారి వయస్సుకు తగ్గట్టుగా చిన్న చిన్న ఆటలు ఆడించడం, కథలు చెప్పడం, రంగులు వేయించడం వంటివి చేయిస్తున్నారా అనేది చూడాలి. దీనివల్ల పిల్లల్లో కొత్త విషయాలు నేర్చుకునే ఉత్సాహం పెరుగుతుంది, అందరితో కలసిపోయే అలవాటు కూడా ఏర్పడుతుంది.
ఇతర తల్లిదండ్రుల అభిప్రాయాలు..
ఎంచుకోవాలనుకుంటున్న బేబీ కేర్ సెంటర్లో ఇప్పటికే తమ పిల్లలను చేరుస్తున్న ఇతర తల్లిదండ్రులతో మాట్లాడటం చాలా మంచిది. వారి అనుభవాలు, అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా ఆ సెంటర్ నిర్వహణ గురించి ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది.
బిడ్డను ఒక కొత్త వాతావరణంలో వదిలేముందు ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఎలాంటి ఆందోళన లేకుండా పనులను పూర్తి చేసుకోవచ్చు, అలాగే చిన్నారి కూడా సంతోషంగా, సురక్షితంగా ఎదుగుతుంది.
*రూపశ్రీ.

