Home » Baby Care » పిల్లల డైట్ ఎలా ఉండాలి..వాళ్లకు ఎలాంటి ఆహారం ఇవ్వాలి.! 


పిల్లల సరైన ఎదుగుదలకు, శారీరక , మానసిక వికాసానికి సమతుల్యమైన ఆహారం చాలా అవసరం. చిన్నతనంలో మనం అందించే ఆహారపు అలవాట్లే వారి భవిష్యత్తు ఆరోగ్యాన్ని నిర్దేశిస్తాయి. పిల్లలకు పెద్దల్లాగా తినడానికి ఎక్కువ ఛాయిస్ లు ఉండవు కాబట్టి ఏదో ఒకటి సమయానికి సాలిడ్ గా పెట్టేస్తే చాలని కొందరు తల్లులు అనుకుంటారు. కానీ నిజానికి పిల్లల ఆహారం ఎంత బలవర్థకంగా ఐతే.. వారి ఎదుగుదల అంత బలంగా ఉంటుంది. కాబట్టి పిల్లల రోజువారీ ఆహారం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లల డైట్ ఎలా ఉండాలి, వారికి ఎలాంటి పోషకాలు అందించాలనేది ప్రతీ తల్లిదండ్రులూ తెలుసుకోవాలి.

పిల్లలకు అందించాల్సిన ముఖ్యమైన ఆహార పదార్థాలు..

ధాన్యాలు , పప్పుధాన్యాలు పిల్లల శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి బియ్యం, గోధుమలు, జొన్నలు, రాగులు వంటి ధాన్యాలు సహాయపడతాయి. ముఖ్యంగా రాగుల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు వంటి పప్పుధాన్యాల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు అందుతాయి. ఇవి కండరాల ఎదుగుదలకు తోడ్పడతాయి.

తాజా కూరగాయలు , ఆకుకూరలు..

 కూరగాయల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు , పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు రక్తహీనతను నివారిస్తాయి. క్యారెట్, బీట్‌రూట్, టమాటో వంటి వివిధ రకాల రంగురంగుల కూరగాయలను పిల్లల ఆహారంలో భాగం చేయడం వల్ల వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

తాజా పండ్లు..

పిల్లల రోజువారీ ఆహారంలో కనీసం ఒక పండు ఉండేలా చూడాలి. అరటిపండు, యాపిల్, జామ, బొప్పాయి, నారింజ వంటి పండ్లు శరీరానికి అవసరమైన విటమిన్ సి , ఇతర ముఖ్యమైన పోషకాలను అందిస్తాయి. వీటిని జ్యూస్‌ల రూపంలో కాకుండా నేరుగా పండ్లుగా తినిపించడం వల్ల పీచు పదార్థం కూడా పూర్తిగా అందుతుంది.

పాలు , పాల ఉత్పత్తులు..

 పిల్లల ఎముకలు , పళ్ళు దృఢంగా మారడానికి క్యాల్షియం చాలా అవసరం. దీనికోసం ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాలు తాగించాలి. పాలతో పాటు పెరుగు, మజ్జిగ, పన్నీర్ వంటివి అందించడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

గుడ్లు , మాంసాహారం..

శాఖాహారంతో పాటు గుడ్లు, చేపలు, చికెన్ వంటివి తినిపించడం వల్ల నాణ్యమైన ప్రొటీన్ , ఐరన్ అందుతాయి. వారానికి కొన్ని రోజులు ఉడకబెట్టిన గుడ్డు ఇవ్వడం పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది.

ఎండు ఫలాలు , విత్తనాలు..

 బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా వంటి ఎండు ఫలాలలో మంచి కొవ్వులు , విటమిన్లు ఉంటాయి. ఇవి పిల్లల మేధస్సును, జ్ఞాపకశక్తిని పెంచడానికి తోడ్పడతాయి. స్నాక్స్ సమయంలో జంక్ ఫుడ్ కి బదులుగా వీటిని అందించవచ్చు.

పిల్లల డైట్ విషయంలో జాగ్రత్తలు..

జంక్ ఫుడ్ , ప్రాసెస్ చేసిన ఆహారాలు, కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, బేకరీ తిండికి పిల్లలను సాధ్యమైనంత దూరంగా ఉంచాలి.

ఈ విషయాలు గుర్తుంచుకోవాలి...

ఆహారం సిద్ధం చేసేటప్పుడు పరిశుభ్రత చాలా ముఖ్యం. అలాగే పిల్లలు రోజూ తగినంత నీరు తాగేలా చూడాలి.
పిల్లలకు ఒకే రకమైన ఆహారం ఇవ్వకుండా, ప్రతిరోజూ వేర్వేరు రుచులు , రంగులు ఉన్న పదార్థాలను విభిన్నంగా వండి పెడితే వారు ఉత్సాహంగా తింటారు.

సరైన సమయంలో, సమతుల్యమైన పోషకాహారాన్ని అందించడం ద్వారా పిల్లలను శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచవచ్చు.

                         *రూపశ్రీ.

 


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.