Home » Ladies Special » అమ్మవారి శక్తికి నీరాజనం ఇవ్వడమే కాదు.. ఇంటి ఆడవారికి గౌరవం కూడా ఇవ్వాలి..
.webp)
దసరా నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని రకరకాల రూపాల్లో పూజిస్తాం. ఆ జగన్మాతను శక్తి స్వరూపిణిగా కొలుస్తాం. తొమ్మిది రోజులు పండగ చేసి గొప్పగా నివేదనలు అర్పిస్తాం. విజయదశమి రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా సంబరాలు జరుపుకుంటాం. అయితే ఇదంతా కేవలం పూజాగదులకు, ఆలయాలకు మాత్రమే పరిమితం అయితే ఆ పండగకి సంపూర్ణమైన అర్థం ఉండదు. మనం నిత్యం పూజించే ఆ దేవీ శక్తులు వేరెక్కడో లేవు, మన ఇళ్లలోనే మన కళ్ల ముందే ఉన్నారు. వారే మన అమ్మ, అక్క, చెల్లి, భార్య, కూతురు. ఆ దేవతలకు నీరాజనాలు అర్పించడంతో పాటు మన ఇంట్లోని ఆడవారిని మనస్ఫూర్తిగా గౌరవించినప్పుడే ప్రతి ఇంట్లోనూ నిజమైన విజయదశమి వెలుగులు నిండుతాయి. భారతదేశం స్త్రీ ని శక్తిగా, దైవంగా పూజిస్తుంది. అయితే ఇంట్లో స్త్రీ కి మాత్రం గౌరవం, ప్రాధాన్యత ఇవ్వడం చాలా అరుదు. దీని గురించి మరింత వివరంగా తెలుసకుంటే..
కష్టానికి గుర్తింపు ఎక్కడా?
సమాజంలో ఎంత మార్పు వచ్చినా, నేటికీ చాలా కుటుంబాల్లో స్త్రీల కష్టానికి తగినంత గుర్తింపు లభించడం లేదు. ఉదయాన్నే అందరికంటే ముందు లేచి, అందరి అవసరాలు చూసి, రాత్రి అందరూ పడుకున్నాక నిద్రపోయే స్త్రీ శ్రమను ఇంట్లో వారు చాలా తేలికగా తీసుకుంటుంటారు. పండగల సమయంలో ఆమె పడే కష్టం మరింత ఎక్కువగా ఉంటుంది. పూజలకు, పిండివంటలకు పరిగెత్తేది ఆమెనే. అలాంటి సమయాల్లో అమ్మవారి పూజకు ఇచ్చినంత ప్రాధాన్యం, ఇంట్లో కష్టపడే ఆ ఆడపిల్లల విశ్రాంతికి, సంతోషానికి ఇస్తున్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది.
అసలైన గౌరవం ఇదే..
ఆడవారికి గౌరవం ఇవ్వడం అంటే కేవలం నోటిమాటగా చెప్పడం కాదు. వారి ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం, వారి నిర్ణయాలను గౌరవించడం, వారి చదువుకు, ఉద్యోగానికి, ఆశయాలకు చేయూతనివ్వడం. ఇంట్లో పనుల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలబడటం. కుటుంబంలో ప్రతీ నిర్ణయంలోనూ వారి అభిప్రాయానికి సమాన స్థానం కల్పించడమే అసలైన మహిళా సాధికారత.
ఆలోచన మారినప్పుడే ..
విజయదశమి మన ఆలోచన విధానంలో మార్పునకు పునాది కావాలి. పండగ రోజున అమ్మవారికి పూలమాలలు వేయడంతో పాటు, మన ఇంట్లో ఉన్న స్త్రీల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు ప్రయత్నిద్దాం. వారి హక్కులను గుర్తించి, వారికీ స్వేచ్ఛను, సమానత్వాన్ని ఇచ్చే దిశగా అడుగులు వేద్దాం. చెడు ఆలోచనలు, లింగ వివక్ష అనే ఆలోచనలపై విజయం సాధించి, మన ఇంట్లోని స్త్రీ శక్తిని మనస్ఫూర్తిగా గౌరవిద్దాం. అప్పుడే మనం జరుపుకునే పండగకు ఒక సార్థకత, మన జీవితాలకు ఒక పరిపూర్ణత లభిస్తాయి.
*రూపశ్రీ.

