అల్లు అర్జున్ హీరోగా పరిచయమైన చిత్రం 'గంగోత్రి'. అదే చిత్రంలో టైటిల్ రోల్ పోషించడం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన తార అదితి అగర్వాల్. ఆమె అప్పటి టాప్ యాక్ట్రెస్ ఆర్తీ అగర్వాల్‌కు స్వయానా చెల్లెలు. కె. రాఘవేంద్రరావు లాంటి దిగ్దర్శకుడి ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యి సూపర్ హిట్ సాధించిన ఆమె కెరీర్ ఆ తర్వాత సాఫీగా సాగకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. 'గంగోత్రి'గా ఆమెను జనం మెచ్చారు.
అయితే, ప్రభాస్ బ్లాక్‌బస్టర్ మూవీ 'వర్షం'ను వదిలేసుకోవడం ఆమె తీసుకున్న బ్యాడ్ డెసిషన్‌గా చెప్పుకోవాలి. ఆ సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ వచ్చినప్పుడు 'విద్యార్థి', 'కొడుకు' అనే చిన్న సినిమాలు చేస్తోందామె. వాటి కోసం 'వర్షం'ను కాలదన్నుకుంది. 'విద్యార్థి', 'కొడుకు' సినిమాలు ఫ్లాపవడమే కాకుండా, అదితి కెరీర్‌కు రవ్వంత కూడా మేలు చేయలేదు. మరోవైపు 'వర్షం'లో హీరోయిన్‌గా నటించిన త్రిష టాలీవుడ్‌లో స్టార్‌గా మారిపోయింది.
అంతేకాదు.. కృష్ణవంశీ సినిమా 'శ్రీ ఆంజనేయం'లో ఛార్మి కంటే ముందు హీరోయిన్‌గా ఎంపికైంది అదితి. కొన్ని సన్నివేశాలు చేసింది కూడా. కానీ ఓ సాంగ్‌లో బోల్డ్‌గా చేయాల్సి రావడంతో చేయనని మొండికేసి వెళ్లిపోయింది. అలా ఆ సినిమాని వదిలేసుకోవడంతో ఆమెకి పొగరెక్కువ అనే ముద్రపడింది. దాంతో ఆమెకు స్టార్ల సరసన అవకాశాలే లేకుండా పోయాయి. మరోవైపు అక్క ఆర్తీ అగర్వాల్ సైతం వివాదాల్లో చిక్కుకోవడం, తర్వాత పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోవడంతో తను కూడా వెళ్లిపోయింది.
తిరిగి అక్కతో పాటు హైదరాబాద్‌కు వచ్చి ఆమె శివాజీతో 'లోకమే కొత్తగా' అనే సినిమాతో పాటు 'ఏం బాబూ లడ్డూ కావాలా' అనే సినిమా చేసింది. అంతే.. ఆ తర్వాత కనుమరుగైపోయింది. తిరిగి యుఎస్ వెళ్లి తల్లిదండ్రులతో ఉంటోంది. 2015లో ఆర్తి హఠాత్తుగా చనిపోవడం ఆమెను తీవ్ర షాక్‌కు గురిచేసింది. మళ్లీ టాలీవుడ్ ఊసెత్తకుండా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతదాకా ఆమె పెళ్లి ఆలోచన కూడా తలపెట్టలేదు. అలా ఇండస్ట్రీకి దూరమైపోయింది బన్నీ ఫస్ట్ హీరోయిన్.